పవన్‌కల్యాణ్ తన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పాడు. ఆ ఆప్షన్ల ఫలితం ఒకసారి చూద్దాం.
1.జనసేన -బీజేపీ కలిసి పోటీ చేయడం
ఇదే జరిగితే బీజేపీ మంకు పట్టు పట్టి కనీసం 40 సీట్లు అడుగుతుంది. ఎందరు జాతీయ నాయకులు వచ్చి ప్రచారం చేసినా 35 సీట్లకు పైగా ఓడిపోతుంది. అపుడు పవన్ పోటీ చేసిన 135 సీట్లలో 80కి పైగా గెలవాలి. అప్పుడే సీఎం అవుతారు. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే అటు బీజేపీ కానీ, ఇటు జనసేనకి కానీ కార్యకర్తలు, పవన్ అభిమానులున్నారు కానీ ఓటు వేయించే యంత్రాంగం లేదు.
బూత్ కమిటీలు, వార్డు కమిటీల సంగతి దేవుడెరుగు, కనీసం నియోజకవర్గ స్థాయిలో కూడా చాలా చోట్ల జనసేనకి యంత్రాంగం లేదు. బీజేపీకి ఉన్నా నామమాత్రమే. అది కూడా పట్టణాలకే పరిమితం. గ్రామస్థాయిల్లో శూన్యం. క్షేత్రస్థాయిలో వైసీపీ బలాన్ని అంచనా వేయకుండా జగన్ వ్యతిరేకత అనే మీడియా ప్రచారాన్ని నమ్మితే పవన్‌కి మరోసారి అవమానమే.
ఒకవేళ హంగు ఏర్పడి టీడీపీకి మద్దతు ఇవ్వాల్సిన స్థితి వస్తే చంద్రబాబు దగ్గుబాటిని ముంచేసినట్టు మధ్యలోనే ముంచేస్తాడు. పవన్‌లాంటి గ్లామర్ ఉన్న సినిమా హీరోని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసేంత అమాయకుడు కాదు బాబు. ముక్కోణపు పోటీ జరిగితే జగన్‌కే ఎక్కువ అవకాశం. మీడియా వార్తలు చదివి ఓటు వేసే పరిస్థితిలో లేరు జనం. వాళ్ల లెక్కలు వాళ్లకు ఉంటాయి. జగన్ పథకాలు జగన్‌కి ఉన్నాయి.
2.జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తేః
జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా వుండడానికి ఈ పొత్తు వినడానికి బాగుంది కానీ, ఆచరణ చాలా కష్టం. బీజేపీ సంగతి పక్కన పెడితే జనసేనకి కూడా టీడీపీ ముష్టి పడేస్తుంది కానీ, గౌరవమైన సీట్ల సంఖ్య ఇవ్వదు. ఇచ్చిన సీట్లలో కూడా రెబల్స్ వుంటారు. లేదంటే వెన్నుపోట్లు. జగన్‌ని ఓడించాలని ఉన్నా, జనసేన ఎమ్మెల్యేలను నెత్తిమీదకి తెచ్చుకోడానికి టీడీపీ కేడర్ ఇష్టపడదు. కుమ్ములాటలు భారీగా వుంటాయి.
ఒకవేళ ఈ కూటమి గెలిచినా చంద్రబాబుదే పైచేయి అవుతుంది తప్ప, పవన్‌కి ఒరిగేదేమీ లేదు. ఇంకో కరివేపాకు అంతే. హెరిటేజ్‌లో కూరగాయలు అమ్మినంత ఈజీగా ఎమ్మెల్యేలను బాబు కొనగలడు. ఇట్లాంటి వ్యవహారాల్లో అందెవేసిన చేయి. జనసేనని ఖాళీ చేయిస్తాడు.
3.జనసేన ఒంటరిగా పోటీ చేయడంః
ఇది కొంచెం బెటర్ ఆప్షనే కానీ, గత ఎన్నికల చేదు అనుభవం కళ్ల ముందే వుంది. ఈ మూడేళ్లలో పార్టీ అభివృద్ధి కోసం పవన్ చేసిందేమీ లేదు. అప్పుడప్పుడు సభలు పెడితే రాజకీయ పార్టీలు బతకవు. అదొక ఫుల్‌టైమ్ జాబ్. షాట్ గ్యాప్‌లో పాలిటిక్స్ మాట్లాడితే అభిమానులు చప్పట్లు కొడతారు కానీ, ఓట్లు వేసే జనం పట్టించుకోరు. 175 నియోజకవర్గాల్లో కనీసం పోటీకి సిద్ధపడే నాయకుల పేర్లు కూడా తెలియని స్థితి వుంటే ఏం జరుగుతుందో పవన్‌కి తెలియకపోయినా రాజకీయ విశ్లేషకులకి తెలుసు.
ఇంకా రెండేళ్లు టైమ్ వుంది. గుర్రం ఎగరా వచ్చేమో! అనుకుంటే ఎగిరే గుర్రాన్ని చూసిన వాళ్లు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు.
పవన్‌కైనా, బాబుకైనా అసలు సమస్య ఏమంటే జగన్ పథకాలు. వాటిని రద్దు చేస్తామని చెప్పలేరు. కొనసాగిస్తే రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడి జనాన్ని నమ్మించలేరు.
అన్ని బ్యాడ్ ఆప్షన్లు అయితే పవన్ ఏం చేయాలి?
ఏదో ఒక రంగాన్ని ఎంచుకోవాలి. సినిమాలే ముఖ్యమనుకుంటే రాజకీయాల్ని వదిలేయాలి. రాజకీయం కావాలనుకుంటే నిరంతరం ప్రజలతోనే వుండాలి. గెలుపోటముల సంగతి పక్కన పెడితే విశ్వసనీయత సాధిస్తాడు. అది వుంటే ఎప్పటికైనా నాయకుడవుతాడు.