జూన్ 5, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. భూమిని కాపాడుకుందామని పత్రికల్లో వ్యాసాలు వస్తాయి. ప్రభుత్వం వారు అడవుల్ని నరుకుతూ మొక్కల్ని పెంచుతుంటారు. పర్యావరణ విధ్వంస ఫలితాలను ఆల్రెడీ చూస్తున్నాం.
జూన్‌లో కూడా ఎండలు మండిపోతున్నాయి. రావాల్సిన టైంలో కాకుండా ఎపుడు పడితే అపుడు వానలొచ్చి పంటల్ని తినేస్తున్నాయి. విస్తరణ పేరుతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లని నరికేసి నీడ లేకుండా చేస్తున్నాం. ఇళ్లలో కిచకిచ తిరిగే పిచుక మాయమైంది. అందరికీ వున్నది ఈ భూమి ఒకటే. దీన్ని నాశనం చేసుకుని ఇంకో గ్రహానికి వెళ్లలేం. ఒకవేళ వెళ్లే టెక్నాలజీ వచ్చినా అది పేదలకి అందదు.
ప్రపంచ నేతలు, పర్యావరణవేత్తలు కాపాడాలి కానీ, మనలాంటి వాళ్లం ఏం చేయగలం? నిజానికి అనుకుంటే చిన్నచిన్న పనులైనా చేయొచ్చు. సులభంగా చేయదగినవే.
వారంలో ఒకట్రెండు రోజులైనా సొంత వాహనం మాని, బస్సు, లోకల్ రైలు, మెట్రో ఎక్కితే , గాలిని మన వంతుగా శుభ్రం చేయొచ్చు.
పర్యావరణానికి అతిపెద్ద శత్రువు ప్లాస్టిక్. అది లేకుండా మనకు రోజు గడవదు. మార్కెట్‌కు వెళితే చేతి సంచి వాడితే చాలు బోలెడంత ప్లాస్టిక్ చెత్త ఇంట్లోకి రాదు.
ఫుడ్‌ని పార్శిల్ తెచ్చుకోవడం ఆపితే మన వంతుగా ప్లాస్టిక్‌ని ఆపినట్టే. వ్యవసాయం వుంటే క్రిమిసంహారక మందులు ఆపేయాలి. ఇపుడు వాడుతున్నట్టు ఇంకో 25 ఏళ్లు వాడితే భారతదేశంలో 62 శాతం భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందని ఒక శాస్త్రీయ సర్వే.
ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం తగ్గించాలి. వాటి వల్ల విష వాయువులు వెలువడుతాయి. ఫ్యాషన్ వస్తువులు తగ్గించాలి. పర్యావరణానికి హాని చేసే పరిశ్రమల్లో ఇదొకటి.
ఇవన్నీ కాకుండా మన ఇంటిని ఒక సారి చెక్ చేసుకుంటే ఎన్ని వృథా వస్తువులు వున్నాయో అర్థమవుతుంది.
అన్నిటికంటే ముఖ్యం పచ్చదనం. చెట్టు లేకపోతే నీడ లేదు, పక్షికి ఇల్లు లేదు. మనకి తిండి లేదు. ఊపిరి కూడా లేదు. శరీరంలో ఊపిరితిత్తులు చేసే పనిని పర్యావరణానికి చెట్లు చేస్తాయి. భూమికి ఊపిరి ఆడాలంటే చెట్లు వుండాలి.
ఇదంతా ప్రభుత్వాల పనికదా, మనకెందుకు అనుకుంటే అంతే. ఎందుకంటే మొక్కకి నీళ్లు పోయడం, పక్షికి ఇన్ని గింజలు వేయడం మనకి చేతకాని పనేం కాదు.
జీఆర్ మహర్షి