ఎన్నాళ్లుగానో వార్తల్లోనే వినిపిస్తూ వస్తున్న విరాటపర్వం సినిమా ట్రయిలర్ విడుదలయింది. మంచి భావజాలం కలిగిన దర్శకుడు వేణు ఉడుగుల అందిస్తున్న సినిమా ఇది. 1990 నేఫథ్యంలో రాసుకున్న కథ.
అటు నక్సలిజం..ఇటు అణచివేత..ఈ రెండింటి మధ్యలో చిగిర్చిన ప్రేమ…స్ధూలంగా ట్రయిలర్ లో కనిపించిన విషయం. దేశంలోని మంచి ఎడిటర్ లలో ఒకరైన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేసిన సినిమా ఇది. అందువల్ల ట్రయిలర్ కట్ ఆద్యంతం ఆసక్తికరంగా వుంది.
సన్నివేశాలు, వాటి నడుమ వేసిన డైలాగులు, ఇటు పోరు..అటు ప్రేమ రెండింటినీ సమాంతరంగా నడిపిన తీరు కచ్చితంగా ఆకట్టుకునేలా వున్నాయి. రానా..సాయిపల్లవి ప్రధానపాత్రలుగా నడిపిన కథ మొత్తం సంఘర్షణ నేపథ్యంలోనే కనిపించింది.
భావజాలానికి ఫిదా అయిన అమ్మాయి భావోద్వేగానికి గురై, అది కాస్తా ప్రేమగా మారి, ఆ ప్రేమ ఆమెను సైతం నక్సల్ గా మారేలా చేసిన తీరు ఒక్కో సీన్ ను పేర్చి చూపించారు.
ట్రయిలర్ లో కంటెంట్ మాత్రమే కాదు, టెక్నికల్ వర్క్ కూడా బాగుందని అనిపించుకుంటుంది. నక్సలైట్ భావజాలం, అణచివేత, పోరుబాట వీటన్నింటిని ఒడిసిపట్టిన డైలాగులు అనేకం ట్రయిలర్ లో వినిపించాయి. ఈనెల 17న విడుదలవుతున్న ఈ సినిమాకు నిర్మాత చెరుకూరి సుధాకర్.