నోటికొచ్చినట్టుగా మాట్లాడటాన్ని అలవాటుగా చేసుకున్న వృద్ధ కమ్యూనిస్టు చికెన్ నారాయణ ఒక బ్రహ్మాండమైన విషయాన్ని సెలవిచ్చారు. అదేంటంటే.. కర్ణాటకలో బీజేపీని గెలిపించడాన్ని జగన్ బాధ్యతగా తీసుకున్నారట! వంద సీట్లలో అక్కడ బీజేపీని గెలిపించడానికి జగన్ కంకణం కట్టుకున్నారట! అందుకోసం జగన్ అక్కడి తన అక్రమాస్తులను ఖర్చుపెడతారట. ఇందుకు ప్రతిగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బీజేపీ వాళ్లు విముక్తిని ఇస్తారట!
ఏమాటకామాట చెప్పుకుంటే.. చికెన్ నారాయణ క్రియేటివిటీ మాత్రం అదుర్స్. ఈ కాన్సెప్ట్ తో కేజీఎఫ్ లెవల్ సినిమా తీయొచ్చేమో! అయితే నారాయణ కథ బాగానే చెప్పారు, అయితే వినే వారికి బోలెడన్ని సందేహాలొస్తాయి. వాటిని ఈ చికెన్ వీరుడు విశదీకరించాలి!
కర్ణాటకలో బీజేపీ చేతి ఇప్పటికీ చాలా బలంగానే ఉంది! ఏరకంగా చూసినా బీజేపీకి అక్కడ బలముంది. పారిశ్రామికంగా అభివృద్ది చెందిన రాష్ట్రం, దేశంలోనే మంచి సంపన్నరాష్ట్రాల్లో ఒకటి. అక్కడ బీజేపీ నేతల అవినీతికి కూడా లోటు లేదాయె! ఎడాపెడా సంపాదించేసే ఉంటారు. అనుకున్న తక్షణం బీజేపీ వాళ్లు కాంగ్రెస్ నుంచి ఆ మధ్య 20 మంది ఎమ్మెల్యేలను తెచ్చేసుకుని తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు! రాజకీయ అవినీతిలో కర్ణాటకను కొట్టే రాష్ట్రం కూడా లేదిప్పట్లో! కాంగ్రెస్, బీజేపీ రెండూ రెండే అక్కడ.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధిష్టానాలే తలపట్టుకుని తమ ముఖ్యమంత్రులను తప్పిస్తూ ఉంటాయి. యడియూరప్పను బీజేపీ వాళ్లు రెండు సార్లు తప్పించారు ఇదే తరహాలో! ఇటీవలే ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆఫీసులో ఏకంగా ఇరవై కోట్ల రూపాయల స్థాయి పంపకాలకు సిద్ధంగా ఉంచిన బహుమతులను లోకాయుక్త వాళ్లు సీజ్ చేశారు! కర్ణాటక ఎన్నికల లీలలు వింటే.. ఏపీ, తెలంగాణ జనాలు కూడా ఉలిక్కిపడాలి. ఆ రేంజ్ లో ఉంది వ్యవహారం!
మరి ఆ కర్ణాటక నేతల గెలుపుకు జగన్ డబ్బులు పెట్టాలా! 17 శాతం జనాభా ఉన్న లింగాయత్ ల మద్దతు బీజేపీకి ఉంది. బోలెడన్ని కుల సమీకరణాలు, మత లెక్కలు ఉన్న రాజకీయంలో బీజేపీకి వంద సీట్లను గెలిపించే బాధ్యత జగన్ తీసుకున్నారా! అమిత్ షా ఈ బాధ్యతలను జగన్ కు ఇచ్చేసి తను తుండుగుడ్డ వేసుకుని పడుకున్నారా! ఏమయ్యా చికెన్ నారాయణ తమరి మతిస్థిమితం బాగానే ఉందా!