బీజేపీ నేత సత్యకుమార్‌ కారుపై దాడి!

అమ‌రావ‌తిలోని మంద‌డం వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. బీజేపీ నేత స‌త్య‌కుమార్ వాహ‌నంపై కొంద‌రు రాళ్ల దాడి చేశారు. అమ‌రావ‌తి రైతుల‌కు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న ఆయ‌న వాహ‌నంపై కొంద‌రు రాళ్లు విసిరారు.…

అమ‌రావ‌తిలోని మంద‌డం వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. బీజేపీ నేత స‌త్య‌కుమార్ వాహ‌నంపై కొంద‌రు రాళ్ల దాడి చేశారు. అమ‌రావ‌తి రైతుల‌కు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న ఆయ‌న వాహ‌నంపై కొంద‌రు రాళ్లు విసిరారు. ఈ దాడిలో స‌త్య‌కుమార్ కారు ధ్వంసం కాగా.. పోలీసుల సాయంతో ఆయ‌న ఆక్క‌డ్నుంచి వెళ్లిపోయారు.

కాగా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ కొంద‌రు రైతుల పేరిట‌ చేస్తున్న ఆందోళన ఇవాళ్టికి  1200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా మందడంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది అమరావతి జేఏసీ. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లు పార్టీల నేత‌ల‌తో పాటు స‌త్య‌కుమార్ పాల్లొన్నారు. ఈ దీక్ష శిబిరం నుండి సత్యకుమార్ తుళ్లూరులో బీజేపీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారుపై మూడు రాజధానుల అనుకూల శిబిరానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడిన‌ట్లు తెలుస్తోంది.

ఇదే దీక్ష శిబిరంలో వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఆయ‌న మాట్లాడుతూ.. అమరావతికి అనుకూలమైన ప్రభుత్వం రాబోతుందని, మూడు ముక్కలు అన్న వాళ్లు కొట్టుకు పోతారని.. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సముచితమని సమర్థించారు.