బాబూ..ఇలా ఎందుకు చేయకూడదు బాబూ?

కొత్త వరాలు అంటూ చంద్రబాబు తన పార్టీ మేనిఫెస్టో పార్ట్ వన్ విడుదల చేసారు. అందులో రెండు కీలకమైనవి. వాటిని వివరిస్తూ, సమర్థించుకుంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పోస్ట్ లు కూడా పెట్టింది.…

కొత్త వరాలు అంటూ చంద్రబాబు తన పార్టీ మేనిఫెస్టో పార్ట్ వన్ విడుదల చేసారు. అందులో రెండు కీలకమైనవి. వాటిని వివరిస్తూ, సమర్థించుకుంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పోస్ట్ లు కూడా పెట్టింది. జగన్ హయాంలో సిలెండర్ ధరలు పెరిగాయి కనుక ఇంటికి మూడు సిలెండర్లు ఫ్రీ అన్న స్కీము ఒకటి. జగన్ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కనుక ఒక్కో మహిళకు 1500 ఆర్థిక సాయం అన్న స్కీము మరోటి ప్రకటించారు.

పరోక్షంగా ఈ రెండు స్కీములు పెట్టడానికి పరోక్షకారణం జగన్ నిర్వాకమే అని చెప్పారు. సరే. కాస్సేపు అదే నిజం అనుకుందాం. గ్యాస్ రేట్లు పెంచేది కేంద్రం కాదు, జగన్ నే అని సరిపెట్టుకుందాం. అలాగే టోల్ రేట్లు సవరించేది, టోల్ గేట్ లు పెంచేది, జిఎస్టీ పెంచేది కూడా జగన్ అనే నమ్మేద్దాం. కేంద్రం కానే కాదని అనుకుందాం. చంద్రబాబు కు కేంద్రాన్ని వేలెత్తి చూపే దమ్ము లేదని పొరపాటున కూడా అనుకొవద్దు.

ఇలాంటి హామీలు ఇచ్చి పాలనలోకి వచ్చే బదులు, తాను వస్తే సిలెండర్ల రేట్లు బాగా తగ్గించేస్తానని, నిత్యావసర వస్తువుల రేట్లు అమాంతం కిందకు దించేస్తానని చెప్పవచ్చు కదా. అలా అయితే మొత్తం అన్ని కుటుంబాలు లబ్ది పొందుతాయి. ఇప్పుడు అయితే ఈ స్కీములు కొందరికే వర్తిస్తాయి. పైగా ఇలా స్కీములు పెట్టడం వల్ల ఖజానా మీద భారం పడుతుంది.అదే కనుక సిలెండర్ రేట్లు, ధరల రేట్లు తగ్గించడం బాబుగారికి చిటికెలో పని కనుక ఆ విధంగా ముందుకు వెళ్తే ఆర్థిక భారం కూడా వుండదు.

తాను అధికారంలోకి వస్తే సిలెండర్ రేటు ఇంతకు తగ్గించేస్తా, నిత్యావసర వస్తువల ధరలు ఇంత శాతం తగ్గిస్తా అన్న హామీ ఇవ్వవచ్చు కదా. ఆ విధంగా జగన్ పాలనను తాను సరిచేస్తా అని చెప్పుకోవచ్చు కదా.

కేంద్రాన్ని నిందించలేక, కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేక, కేంద్రం తప్పులను జగన్ ఖాతాలో వేసి, వరాలు ప్రకటించడం కాదు, ఇలా ప్రకటించి, వాటిని నిలబెట్టుకుంటే శభాష్ చంద్రబాబు అనొచ్చు.