బండి సంజయ్ …నీ నోరు మంచిది కాదు

ఏపీ రాజకీయాల్లోగాని, తెలంగాణా రాజకీయాల్లోగాని ఏ నాయకుడి నోరూ మంచిది కాదు. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చిన్నాచితకా పదవులు ఉన్న నేతలు, ప్రతిపక్ష నాయకులు …ఇలా ఎవరిని తీసుకున్నా అందరివీ కంపు…

ఏపీ రాజకీయాల్లోగాని, తెలంగాణా రాజకీయాల్లోగాని ఏ నాయకుడి నోరూ మంచిది కాదు. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చిన్నాచితకా పదవులు ఉన్న నేతలు, ప్రతిపక్ష నాయకులు …ఇలా ఎవరిని తీసుకున్నా అందరివీ కంపు నోళ్లే. కంపు నోళ్లంటే పళ్ళు తోముకోరనే అర్థం కాదు. బూతులు మాట్లాడతారని. అవాకులు చెవాకులు వెళతారని, నోటికి ఏదొస్తే అది మాట్లాడతారని అర్థం. 

బూతులు మాట్లాడని వారిని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. విధానాల మీద విమర్శలు చేయడం ఏనాడో గంగలో కలిసింది. సిద్ధాంతాల మీద విభేదించడం ఏనాడో నీరుగారిపోయింది. అలాంటి నాయకులు ఇప్పుడు లేరు. అలాంటి రాజకీయాలు ఇప్పుడు లేవు. ఈ కాలంలో బూతులు మాట్లాడే నాయకుడే గొప్ప నాయకుడు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేవాడే బలమైన నాయకుడు. అలాంటి వారినే ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ యమ దూకుడు మీద ఉంది. 

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే సత్తా ఉందొ లేదో గానీ కమలం పార్టీ నాయకులు మాత్రం గులాబీ పార్టీ మీద కదం తొక్కుతున్నారు. కేసీఆర్ ను ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అంటున్నారు. ఇతర నాయకుల సంగతి పక్కన పెడదాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ ఫుల్లుగా రెచ్చిపోతున్నాడు. ఆయన నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నాడు. 

సంజయ్ కి కేసీఆర్ మీద రెచ్చిపోయే హక్కు ఉంది. ఎవరూ కాదనరు. కానీ దానికో పధ్ధతి ఉంటుంది కదా. మాట మాట్లాడితే కేసీఆర్ ను జైలుకు పంపుతామంటాడు. ఇప్పటికి ఈ మాట వందలసార్లు అని ఉంటాడు. కానీ కేసీఆర్ జైలుకు వెళ్లేంత నేరాలు ఏం చేశాడో, అందుకు ఆధారాలు ఏమిటో చూపించాలి కదా. ఆ పని మాత్రం చేయడు. కేంద్రంలో ఎనిమిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా. కేసీఆర్ నేరాలు నిరూపించి జైలుకు పంపవచ్చు కదా. కానీ ఆ పని చేసే దమ్ము, ధైర్యం లేవు.

కేసీఆర్ అంటే ఖాసీం రజ్వీ అని కొత్త పేరు పెట్టాడు సంజయ్. మంత్రి కేటీఆర్ పేరు సయ్యద్ మక్బుల్ అట. ఎవరీయన అంటే రజాకార్ల వారసుడు అని చెబుతున్నాడు. సంజయ్ కి తెలంగాణలో రజాకార్ల పాలన ఏం కనిపించిందో మరి. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ భయంకరంగా మాట్లాడాడు. ఆయన మాటలు వింటే ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మాటల్లా అనిపించడంలేదు. 

ఇంతకూ సంజయ్ ఏమన్నాడో చూడండి ….కేసీఆర్ కరుకు బీడీలు ఏరుకొని తాగాడట. కరుకు బీడీలు అంటే వేరేవాళ్లు తాగి పడేసిన బీడీలు అనే అర్థం కావొచ్చు. దుబ్బాక బస్టాండులో లచ్చమ్మ అనే మహిళ మెడలోనుంచి గొలుసు కొట్టేశాడట. ఆ మహిళ పేరు కూడా బలే చెప్పాడు. మరి ఆమెను తీసుకొచ్చి ఈ విషయం చెప్పించగలడా? దుబాయ్ పేరుతో అమాయక యువకులను మోసం చేశాడట. కేసీఆర్ నెంబర్ వన్ దొంగ అట. కేసీఆర్ తన భార్యను బాగా కొట్టేవాడట. ఆమె తట్టుకోలేక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం. సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) దగ్గరకు వచ్చి మోర పెట్టుకుందట. ఈ విషయం చెప్పడానికి ఎమ్మెస్సార్ ఇప్పుడు లేరు.

సీఎంకు తాగుడు తప్ప వేరే ద్యాస లేదని, పగలు, రాత్రి తాగి పడుకుంటాడని సంజయ్ అన్నాడు. ఒక ముఖ్యమంత్రిపై ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసే విమర్శలు ఇవా? కేసీఆర్ ఇటువంటివాడు కాబట్టే ఆయనపై ధర్మ యుద్ధాన్ని ప్రారంభించామన్నాడు. కేసీఆర్ తాగుతాడనే అనుకుందాం. బీజేపీలో తాగనివాళ్ళు లేరా? సంజయ్ మాట్లాడాల్సింది ఇలాంటి చచ్చుపుచ్చు మాటలు కాదు. 

పరిపాలనలో కేసీఆర్ వైఫల్యాలపై మాట్లాడాలి. ప్రజలకు జరిగే అన్యాయాల గురించి మాట్లాడాలి. బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో మాట్లాడాలి. మొత్తం మీద బండి సంజయ్ చిల్లరగా మాట్లాడాడు. అందులో సందేహం లేదు.