జనసేనాని పవన్‌కల్యాణ్‌కు వెన్నుపోటు పొడిచేందుకు రంగం సిద్ధమైంది. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందల్లా పవన్‌కల్యాణ్‌తో ప్రేమాయణం అంటూ చంద్రబాబు కన్నుగీటుతూ వచ్చారు. తీరా పవన్‌కల్యాణ్ మనసులో ప్రేమకు బీజం పడిన తర్వాత ..అబ్బెబ్బే అంటూ చల్లగా చంద్రబాబు వెనక్కి జారుకుంటున్నారు. ఇదెక్కడి చోద్యమని వాపోవడం జనసేన వంతైంది.
మరోవైపు కట్టుకున్నోడు కాదన్నాడు, ఉంచుకున్నోడు పొమ్మన్నాడు అనే రీతిలో పవన్‌కల్యాణ్ రాజకీయ పరిస్థితి తయారైంది. పొత్తులో ఉన్న బీజేపీ నమ్మకాన్ని పవన్ పోగొట్టుకున్నారు. చంద్రబాబును నమ్ముకుని, బీజేపీని కాదనుకున్న పవన్ రాజకీయ పయనం త్రిశంకు స్వర్గాన్ని తలపిస్తోంది.
నియోజక వర్గాల ఇన్‌చార్జ్‌లు, సొంత పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశాలను స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ఇక ఎంతో సమయం లేదని అప్రమత్తం చేశారు. దూకుడు పెంచాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది కాలం పార్టీకి అత్యంత కీలకమని చెప్పారు. నిర్లక్ష్యం వీడి, వ్యూహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మరోవైపు వైసీపీ ఇప్పటికే దూకుడు పెంచింది. గడపగడపకూ మన ప్రభుత్వం పేరుతో జనాల్లోకి వెళుతోంది. మూడేళ్ల పాలనలో తాము చేసిన మంచి పనులేంటో జనానికి వివరిస్తూ మరోసారి ఆశీస్సులు కోరుతోంది.
మరి జనసేన పరిస్థితి ఏంటి? పవన్‌కల్యాణ్‌తో టీడీపీది ఒన్‌సైడ్ లవ్ అని, అటువైపు గ్రీన్‌సిగ్నల్ వస్తే కదా అని చంద్రబాబు కుప్పం పర్యటనలో రెచ్చగొట్టారు. అది నిజమని జనసేనాని నమ్మారు. దీంతో పార్టీని బలోపేతం చేయడం విస్మరించి, పొత్తులను నమ్ముకున్నారు. ఎవరూ అడక్కుండానే, కోరుకోకుండానే మూడు ఆప్షన్లను బీజేపీ, టీడీపీ ముందు పవన్ పెట్టారు. వాటిని ఏ పార్టీ పట్టించుకోలేదు. మరోవైపు చంద్రబాబు మాత్రం నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.
ఎన్నికలకు ఇక సమయం లేదని, దూకుడు పెంచాలని నాయకులు, శ్రేణుల్ని ఉత్తేజపరుస్తున్నారు. పవన్‌కల్యాణ్ పరిస్థితి ఏంటి? ఆయనతో పొత్తు వుంటుందా? వుండదా? బాబునే నమ్ముకున్న పవన్ ఏం కావాలి? మనసులో ఏమీ లేనప్పుడు ఒన్‌సైడ్ లవ్, టూసైడ్ లవ్ అంటూ పవన్‌ను ఎందుకు గిల్లారు? లేని ఆశల్ని ఎందుకు కల్పించారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. యువకుడి మాటలకు మోసపోయి సర్వస్వం అర్పించిన ప్రియురాలిలా పవన్ పరిస్థితి తయారైందని జనసేన శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
చంద్రబాబును నమ్మి బాగుపడ్డ రాజకీయ పార్టీ ఏదైనా వుందా? ఇప్పుడు పవన్‌కల్యాణ్ విషయంలోనూ అదే జరుగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు. తాము రెండుమూడు దఫాలు మోసపోయిన అనుభవంతో పవన్‌కు హితబోధ చేసినా వినిపించు కోలేదని, చివరికి తమను కాదని చంద్రబాబుకు దగ్గర కావాలని చూశారని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వాలకం చూస్తుంటే పవన్‌తో సంబంధం లేకుండానే అభ్యర్థుల ఎంపిక చేపట్టే అవకాశాలున్నాయి.