సాయంత్రం వేళ ఎవరో ఒక గెస్ట్ కావాలి. ఈ రోజు బండ్ల గణేష్ దొరికాడు. పిలిచిందే తడువుగా వాలిపోయాడు. తనకున్న వాక్ చాతుర్యం మొత్తం వాడేసాడు. వైకాపా ను దుయ్యబట్టాడు. చంద్రబాబును గాల్లోకి ఎత్తేసాడు. కాంగ్రెస్ అభిమానిని అంటాడు. చంద్రబాబు జై అంటాడు అదేం చిత్రమో. హైదరాబాద్ ఐకియా ఏరియాలో ఫ్లయ్ ఓవర్ మీద నుంచి చూస్తుంటే అదంతా ఏదో మరో దేశంలో వున్న ఫీలింగ్ ఇస్తోందట. దానికి చంద్రబాబే కారణం అట.
బండ్ల చెబుతున్న ఏరియా అంతా గత అయిదేళ్లలో అలా మారిందని, మై హోమ్ అబ్ర, మై హోమ్ భూజా వచ్చిన తరువాత కదా అక్కడ మిగిలిన డెవలప్ మెంట్ అంతా వచ్చింది అన్నది వాస్తవం కదా? అక్కడ పెట్రోలు బంక్ చూసినా, విద్యుత్ సబ్ స్టేషన్ చూసినా ఓ రేంజ్ తో ఓ మార్క్ తో వుంటాయి. మరి హైదరాబాద్ లో అన్ని చోట్లా సబ్ స్టేషన్లు అలా లేవు కదా? పెట్రోల్ బంక్ లు అంత అందంగా లేవు కదా.
అభివృద్ది అంటే అంతటా సమానంగా వుండాలి. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్కడ చూసినా రోడ్లు అలాగే వుండాలి. అంత అందంగానూ ఏరియాలు వుండాలి. ఆ విషయాన్ని బండ్ల మరిచిపోతే ఎలా? ఆ సంగతి అలా వుంచితే చంద్రబాబు హైదరాబాద్ ను వదిలేసి దాదాపు 10 ఏళ్లయింది. అంతకు ముందు ఆయన హైదరాబాద్ ను పాలించి మరో పదేళ్లయింది. అంటే రెండు దశాబ్దాల వెనుక చంద్రబాబు వుంటే, ఇప్పుడు హైదరాబాద్ తీరు అంతా మారితే కేసిఆర్/కేటిఆర్ అని అనకుండా బండ్ల చంద్రబాబు అంటారేంటీ?
కులం..కులం అంటారేంటీ అంటూ బండ్ల ఆశువుగా శ్రీశీ కవితను చకచకా చదివేశారు. కులం అంటేనే తనకు ఆసక్తి లేదని, అసహ్యం లేదని భయంకరమైన కలర్ ఇచ్చే బండ్ల అస్సలు కులాభిమాని కాదా? అవునా? అన్నది ఆయన సన్నిహితులకు బాగా తెలుసు. పోనీ అది ఆయన వ్యక్తిగతం అని అనుకుందాం. ముందు పోలవరం కట్టవయ్యా స్వామీ అంటున్నారు బండ్ల. మరి గతంలో ఇదే మాట చంద్రబాబును ఎందుకు అడగలేదు. ఆయన వదిలేస్తే కదా జగన్ కట్టాల్సి వచ్చింది. చంద్రబాబు కడితే ఇప్పుడు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చేది కాదు కదా?
నిజానికి బండ్ల ఓ కాలక్షేపం బటానీ. ఎవరైనైనా తిట్టించాలి అనుకుంటే పనికొచ్చే పరికరం. జనం బండ్ల మాటలను సీరియస్ గా తీసుకోవడం ఎప్పుడో సెవెనో క్లాక్ బ్లేడ్ టైమ్ నుంచే మానేసారు. యూ ట్యూబ్ లో వ్యూస్ కు తప్ప మరెందుకు పనికిరావు అన్నది వాస్తవం.
ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ బండ్ల ఇంకెన్ని కామెడీలు చేస్తాడో చూడాలి. ముఖ్యంగా కాంగ్రెస్ లో ఏదో ఒక పోస్ట్ ఆశిస్తున్న బండ్ల అది రాకపోతే అక్కడ వుంటాడా? జై భాజపా అంటారా? అన్నది చూడాలి.