సత్యసాయి జిల్లా హిందూపురానికి ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులతో మచ్చ ఏర్పడింది. ఒకరేమో పార్లమెంట్ సభ్యుడు, మరొకరు శాసనసభ్యుడు. ప్రజలు నమ్మి చట్టసభలకు పంపితే, విచక్షణ మరిచి ఇష్టానుసారం వ్యవహరించడం వారికే చెల్లింది. పైగా దబాయింపు. స్థానికేతరులు అయినప్పటికీ వారు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలపై అభిమానంతో ప్రజలు పట్టం కట్టారు.
తమను ఎన్నుకున్న ప్రజలకు గౌరవం తెచ్చేలా వ్యవహరించడానికి బదులు, తలవంపులు తెచ్చేలా ప్రయత్నించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ అడుగు ముందుకేసి గోరంట్ల మాధవ్‌ను విమర్శించడం ఆశ్చర్యపరుస్తోంది. తానేదో తక్కువ తిన్నట్టు ఆయన మాటలున్నాయి.
గతంలో నందమూరి బాలకృష్ణ ఆడవాళ్ల గురించి చేసిన అభ్యంతరకర కామెంట్స్ ఎంత వివాదాస్పదమయ్యాయో అందరికీ తెలుసు. “ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి… కమిట్ అయిపోవాలి అంతే” అని మాట్లాడారు. గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ డిఫరెంట్. మరో మహిళతో దిగంబరంగా మాట్లాడుతుండడాన్ని ఇతరులు కుట్రపూరితంగా వీడియో తీశారు. ఇక్కడ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ నైతికత దృష్ట్యా నాగరిక సమాజం అసహ్యించుకుంటోంది.
మహిళల విషయంలో వివాదాస్పదమైన ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా హిందూపురం నుంచే ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. ప్రజలతో సంబంధం లేకుండా, పార్టీ పలుకుబడితో ఎన్నికైన నేతలు కావడం వల్లే బరి తెగించి వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా గోరంట్ల మాధవ్ గురించి బాలయ్య విమర్శించడం… దెయ్యాలు వేదాలు వల్లించనట్టుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.