ఈ పార్టీలకు.. ముందు నుయ్యి వెనుక గొయ్యి!

ఉప ఎన్నికలు అరుదుగా వస్తుంటాయి. సిటింగ్ ప్రజాప్రతినిధి మరణం వలన ఉపఎన్నిక వచ్చినట్లయితే.. ఇతర పార్టీలకు మనసు నిమ్మళం. మరణం వల్ల జరుగుతున్న ఉపఎన్నిక కాబట్టి.. ఆయన కుటుంబానికి సానుభూతిగా తాము బరిలో నిలబడడం…

ఉప ఎన్నికలు అరుదుగా వస్తుంటాయి. సిటింగ్ ప్రజాప్రతినిధి మరణం వలన ఉపఎన్నిక వచ్చినట్లయితే.. ఇతర పార్టీలకు మనసు నిమ్మళం. మరణం వల్ల జరుగుతున్న ఉపఎన్నిక కాబట్టి.. ఆయన కుటుంబానికి సానుభూతిగా తాము బరిలో నిలబడడం లేదు అని చెప్పి తప్పించుకోవచ్చు. ఎటూ గెలిచే అవకాశం లేని పార్టీలు, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే బరిలోకి దిగే పార్టీలు ఇదే సూత్రం అవలంబించి ఖర్చు నుంచి తప్పించుకుంటాయి. కానీ, రాజీనామా కారణంగా ఉప ఎన్నిక అనివార్యం అయితే.. ప్రతి పార్టీ కూడా నిర్ణయం తీసుకోవాల్సిందే.

ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో అలాంటి పరిస్థితే తలెత్తుతోంది. ఎందుకంటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్ల ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అవుతోంది. ఈ ఎన్నికను అధికార టీఆర్ఎస్, విపక్ష బీజెపీ సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఇక్కడ గెలవడం ద్వారా.. తెరాస ప్రభుత్వం పతనం మొదలైందని రాష్ట్రవ్యాప్తంగా చాటుకోవడం బిజెపి లక్ష్యం. అలాగే బిజెపివి ఉత్త ప్రగల్భాలే అని చాటడానికి తెరాస గెలిచి తీరాలి. మద్యలో.. టెక్నికల్ గా ఇక్కడ ఖాళీ అయినది కాంగ్రెస్ సీటు గనుక.. ఆ పార్టీ కూడా పోటీచేసి తీరాల్సిందే. అభ్యర్థి బలం వల్ల కాదు, పార్టీ బలం వల్ల మేం గెలుస్తున్నాం అని చాటుకోవాలంటే.. కాంగ్రెస్ కూడా ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. ఈ మూడు పార్టీల సంగతి సరే.. తెలంగాణలోని మిగిలిన పార్టీల సంగతి ఏంటి? తెలంగాణలో ఉన్నవి ఈ మూడు పార్టీలు మాత్రమే కాదు కదా!?

వామపక్షాల విషయానికి వస్తే.. వారు గులాబీ పార్టీకే జై కొట్టే అవకాశం ఎక్కువ. మునుగోడు విషయంలో త్వరలోనిర్ణయం తీసుకుంటాం అని అన్నారు గానీ.. కొత్తగా తీసుకునే నిర్ణయమేదీ ఉండదు. టీఆర్ఎస్‌కు మద్దతివ్వడం మాత్రమే! బిజెపిని ఎవరు వ్యతిరేకిస్తే వారికి వామపక్షాలు అండగా ఉంటాయి అంతే. ఇక కోదండరాం సారథ్యంలోని తెజస పార్టీ ఉంది. ఇప్పటిదాకా తమ బలాన్ని కనీసమాత్రంగా నిరూపించుకోలేని ఈ పార్టీ ఈ ఉపఎన్నికలోకి దిగుతుందా? గతంలో వీరితో పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ ఈ దఫా కూడా కోదండరాం ను కలిసి మద్దతు అడిగింది. స్వయంగా తమ పార్టీని ఎన్నికల్లోకి దించి.. ఖర్చుల పరంగా చేతులు కాల్చుకోవడానికి బదులు.. కాంగ్రెస్ కు మద్దతివ్వడమే కోదండరాంకు కూడా క్షేమం. 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ, తెలుగుదేశం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాకపోతే, ఆ పార్టీలు ఉన్నాయనే సంగతిని నిరూపించుకోవడానికి వారికి ఇది ఒక అవకాశం. షర్మిల ఏం చేస్తారు? ఏడాదిగా కష్టపడుతున్న ఆమె.. తన మాటలను, ప్రయత్నాన్ని కనీసం ప్రజలు గుర్తిస్తున్నారు అని నిరూపించుకోడానికి ఈ మునుగోడు ఉపఎన్నికను వాడుకుంటుందా? లేదా.. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే పడికట్టు మాట అనేసి.. పోటీనుంచి మిన్నకుంటుందా అనేది చూడాలి. 

ఇక తెలుగుదేశం పరిస్థితే దయనీయంగా ఉంది. ఒకప్పట్లో తెలంగాణలో హవా చెలాయించిన ఈ పార్టీ ఇప్పుడు సమాధి అయిపోయింది. అయినా ఈ పార్టీ మళ్లీ లేస్తుందని.. అధికారంలోకి వస్తుందని చంద్రబాబు అప్పుడప్పుడూ బీరాలు పలుకుతుంటారు. అలాంటి బాబు.. మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థిని దింపడానికి సిద్ధమేనా? అసలు ఆ పార్టీకి అక్కడ నామినేషన్ వేయడానికైనా మనిషి ఉన్నారా? అనేది ప్రశ్న. షర్మిల కొత్త పార్టీ గనుక.. పోటీకి దిగకుండా మాటలు చెప్పడం చాలా ఈజీ. కానీ.. చంద్రబాబు కూడా పోటీకి తమ అభ్యర్థిని దింపకపోతే.. తమ పార్టీకి తెలంగాణలో అసలు దిక్కులేదని స్వయంగా తాను ఒప్పుకోవడమే అవుతుంది. 

ఇలాంటి పార్టీలన్నిటికీ కూడా మునుగోడు ఉప ఎన్నిక ముందు గొయ్యి వెనుక నుయ్యి లాంటి పరిస్థితి తయారుచేసింది. ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని, తాను తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానని అంటున్న కెఎ పాల్ పార్టీ పోటీచేస్తుందా లేదా అని మాట్లాడుకోవడం కూడా కామెడీ అవుతుంది.