‘బర్రెలక్క’ చిన్నదే..! బరిలోని సమస్య పెద్దది..!!

అభ్యర్థి అయ్యాక సమస్యను వెతుక్కోవటం ఆనవాయితీ. అంటే ‘బీఫాం’ వచ్చాకే, అభ్యర్థి తన నియోజకవర్గం వైపు తేరిపార చూస్తాడు. కానీ నామినేషన్ల గడువుకు ఒక్క రోజు ముందు వరకూ, అభ్యర్థుల తుది జాబితాను పార్టీలు…

అభ్యర్థి అయ్యాక సమస్యను వెతుక్కోవటం ఆనవాయితీ. అంటే ‘బీఫాం’ వచ్చాకే, అభ్యర్థి తన నియోజకవర్గం వైపు తేరిపార చూస్తాడు. కానీ నామినేషన్ల గడువుకు ఒక్క రోజు ముందు వరకూ, అభ్యర్థుల తుది జాబితాను పార్టీలు విడుదల చెయ్యవు. తీరా చేశాక, ఉండే సమయం ఎంత..

సమస్యే అభ్యర్థి కాగలదా? అవును. ఎన్నికలలోనే. అభ్యర్థి అయ్యాక, ఏదో ఒక పార్టీ ‘బీఫాం’ ఇచ్చాక, తానే అభ్యర్థి అని తేలాక, అతడు లేదా ఆమె నమ్మకంగా కండువా కప్పుకుని నియోజకవర్గంలోని సమస్యల వైపు చూస్తారు. వాటిలో కొన్నింటిని ఎన్నుకుని, పరిష్కారాల కోసం పాటుపడతానంటూ, ప్రచార రథం ఎక్కుతారు. అది దరిద్రం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, నిర్బంధం కావచ్చు. ఇంకేదయినా కావచ్చు. ఈ సమస్యల్ని ఊరేగించటానికి ముచ్చటగా మూడు వారాలు కూడా సమయం వుండదు. ఎన్నికలొచ్చేస్తాయి. నమ్మిన వాళ్ళు వోటేస్తారు. నమ్మని వాళ్ళు పక్కవాడికి వేస్తారు. లేదా వదిలేస్తారు. 

అందుకే మన ఎన్నికల రాజకీయాల్లో అభ్యర్థే ముందు. సమస్య తర్వాత. 

మరి సమస్యే ముందుండాలంటే ఎలా..? సమస్యనే అభ్యర్థిని చెయ్యాలి. ఈ మాట అనటానికీ, వినటానికీ బాగుంది కానీ, ఆచరించటానికి బాగుండదు. అయినా అప్పుడప్పుడూ అవుతుంది. ఇప్పుడు అయ్యింది కూడా. ఆమే బర్రెలక్క. అసలు పేరు శిరీష. పూర్తి పేరు కర్నె శిరీష. 

తనను తానే సమస్యగా పరిచయం చేసుకుంది. ఆ సమస్య పాతదే. ఎంత పాతదంటే స్వతంత్ర భారతమంత పాతది. సర్వాంతర్యామి. కాస్త ఎక్కువ తక్కువలు మినహా అన్ని రాష్ట్రాలలనూ వుంటుంది. పుట్టి పట్టుమని పదేళ్ళు కూడా కానీ, తెలంగాణలో వుండదా..? ఉంటుంది. కానీ, పెద్దగా కనిపిస్తుంది. పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే 2022`23 వార్షిక నివేదిక ప్రకారం నిరుద్యోగ రేటు జాతీయ సగటు కన్నా తెలంగాణ ఎక్కువగా నే వుంది. జాతీయ సగటు 10 శాతం వుంటే, తెలంగాణలో ఏకంగా 15.1 శాతం వుంది. అదే మహిళల్లో అయితే ఇంకా ఎక్కువే. అది 16.2 శాతం. 

అసలు 2014 ముందు తెలంగాణ ఉద్యమం వచ్చిందే ‘నిరుద్యోగం’ నుంచి. కాకుంటే కాలేజీల్లో, యూనివర్శిటీల్లో చదువుకునే విద్యార్థులు ఎందుకు రోడ్డు ఎక్కుతారు? ఉన్న అరకొర ఉద్యోగాల్లో ఎక్కువ భాగం ‘సీమాంధ్ర’ ప్రాంతం వాళ్ళు కొట్టేస్తారన్న అనుమానంతోనే కదా..! ఈ పాయింటు చాలు ప్రత్యేక తెలంగాణ ను నినాదంగా మలుచుకున్న రాజకీయ పార్టీలు. అల్లుకు పోయాయి. ‘నియామకాల’ను నీళ్ళు. నిధుల పక్కన పెట్టేశాయి. తెలంగాణ వచ్చేశాక. ఉద్యోగాల ఎక్కడవున్నాయీ అంటే, ప్రయివేటు రంగంలోని ఉపాధి అవకాశాలను చూపించబోయారు. మరి సర్కారు కొలువులో..? ఉంటాయి. నిరుద్యోగులు లక్షల్లో వుంటే, ఉద్యోగాలు వందల్లో వుంటాయి. వాటినన్నా పూరించాలి కదా! మీన మేషాలు లెక్కిస్తూ, పూరించ బోయారు. తెలంగాణ స్టేట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌`1 పరీక్షలు నిర్వహించలేక పోయారు. అవకతవకలతో వాయిదా పడ్డాయి. ‘ఏముందీ..! తప్పులు జరగవా..? సరిదిద్దుకుంటాం’ అని చెప్పుకుంటూ వచ్చారు అధికారంలో వున్న బీఆర్‌ఎస్‌ నేతలు. 

‘దిద్దుబాటు’ వారికి చిన్నది. కానీ, నిరుద్యోగులకు అది పెద్దదే. ఎంత పెద్దదంటే, వాళ్ళకున్న రెండు మూడు ఎకరాల భూమి అంత పెద్దది. ఆ కాస్త భూమీ అమ్మే లక్షో, రెండు లక్షలో బిడ్డ చేతిలో పెట్టి, పోటీ పరీక్షల ప్రిపరేషన్‌ కోసం, రాజధాని నగరం (హైదరాబాద్‌) పంపుతారు. నెలల్లో అయ్యే ప్రిపరేషన్‌, పరీక్షల వాయదాల వల్ల ఏళ్ళు పడుతుంది. ఇక్కడ ఇరుకిరుకు గదుల్లో వుండి, రుచీ పచీ లేని తిండి తిన్నా, తెచ్చుకున్న డబ్బు కరిగి పోతుంది. అక్కడ అమ్మా, నాన్నలు కూలి చేసుకుంటూనే వుంటారు. ఇంకొందరయితే అప్పుల పాలవుతారు. 

ఈ నేపథ్యంలో ఏం చెయ్యాలి నిరుత్సాహంతో ఇంటి ముఖం పట్టాలి. మానసిక దుర్బలులయితే ఆత్మహత్యాయత్నాలకు కూడా పాల్పడతారు.

అలాకాకుండా కొత్త దారి వెతుక్కుంది ఈ ‘బర్రెలక్క’ ఎలియాస్‌ శిరీష. ఆమె కోరుకున్నది ఒకానొక సర్కారు కొలువు. అందుకే గ్రూప్‌`1, గ్రూప్‌`2, ఎస్సయి, కానిస్టేబుల్‌ .. ఏ ఉద్యోగపు పోటీ పరీక్షను వదలకుండా ప్రిపేర్‌ అయ్యింది. కానీ అమె ఎక్కాలనుకున్న రైలు (కవి చెప్పినట్లు) ‘ఒక జీవిత కాలం వాయిదా పడుతూ’నే వస్తోంది. దాంతో స్వగ్రామమయిన (నాగర్‌కర్నూల్‌ జిల్లాపెద్ద కొత్త పల్లి మండలంలోని) మరికల్‌ గ్రామం వెళ్ళిపోయింది. 

ఆమె కుటుంబానికి ఎకరానికి తక్కువగా కొంత భూమి వుండేది. కానీ తండ్రి వ్యసనం వల్ల హారతి కర్పూరం అయిపోయింది. కానీ వాళ్ల అమ్మ ఆమెకు నాలుగు బర్రెల్ని కొనిఇచ్చింది. ‘ఉద్యోగాలు లేని వాళ్ళకు ఈ బర్రెలే మేలు’ అంటూ వీడియో చేసింది. లక్షలు.. లక్షలు వచ్చిపడ్డాయి. ఏమిటీ..? రూపాయిలు కాదు. వ్యూస్‌! రావూ మరి..! వింత కోసం ముఖం వాచి వున్న వారే కదా.. ఈ ట్యూబులు చూసేది! బర్రెల్ని కాసే వాళ్ళను బడికి పంపటం వార్త కాదు. డిగ్రీ చేసిన వాళ్ళు బర్రెలు కాయటం వార్త.! ఎందులో కూడా ‘శ్వేత విప్లవాన్ని’ చూసేవాళ్లు చూడవచ్చు. పైసల్లేని పేరు ఇబ్బంది పెడుతుంది. 

దాంతో నిరుద్యోగుల తరపున తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా దిగింది. అలా సమస్యే అభ్యర్థి అయ్యింది. 

ఇది దేశంలో కొత్త కాదు. తెలంగాణలో అస్సలు కాదు. ఇదే ప్రాంతానికి చెందిన పక్క (జడ్చర్ల) నియోజకవర్గం నుంచి 2008 మే నెలలో జరిగిన ఉపఎన్నికలలో ఏకంగా 15 మంది పోలేపల్లి రైతులు స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగారు. ప్రత్యేక ఆర్థిక జోన్‌ (ఎస్‌ఈజెడ్‌) కారణంగా భూములు కోల్పోయిన వారే వీరంతా. అలాగే నిజామాబాద్‌ నుంచి 50 మంది పసుపు రైతులు 2019 తమ సమస్యనే అభ్యర్థిగా మార్చుకుని ప్రధాని నరేంద్ర మోడీపై వారణాసిలో స్వతంత్రులుగా నిలబడ్డారు. 

ఇక దేశంలో అయితే సమస్యే అభ్యర్థిగా మారిన ఉదంతాలు వున్నాయి. గుజరాత్‌ లోని ఊనాలో 2016లో మృతిచెందిన గోవు చర్మం వలుస్తున్న దళిత యువకుల్ని, గోవును హత్య చేశారన్న అనుమానంతో జీపుకు కట్టి ఈడ్చుకుపోయారు. ఈ సమస్యనే అభ్యర్థిగా మార్చుకుని వడగం నియోజకవర్గం నుంచి ఎన్నికయి గెలుపొందారు. 

ఇలా సమస్యనే అభ్యర్థిగా మార్చుకున్న అందరూ చట్టసభకు వెళ్ళలేక పోవచ్చు. కానీ తాము ఓడిపోయినా, ఆ సమస్య మాత్రం చట్ట సభకు వెళ్తుంది. ఇదీ రాజ్యాంగం ఇచ్చిన అవకాశమే..!!