ఎన్నికలు.. ఎకానమీ బూస్ట్!

ఎన్నికలు మంచివే. సామాన్య జనానికి, నాయకులకు, ఆఖరికి మీడియాకు సైతం పండగే. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో దాదాపు 10 నుంచి పదిహేను వేల కోట్లు ఖర్చు అవుతుందని ఓ అంచనా. ఈ డబ్బులో తొంభై…

ఎన్నికలు మంచివే. సామాన్య జనానికి, నాయకులకు, ఆఖరికి మీడియాకు సైతం పండగే. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో దాదాపు 10 నుంచి పదిహేను వేల కోట్లు ఖర్చు అవుతుందని ఓ అంచనా. ఈ డబ్బులో తొంభై అయిదు శాతం నల్ల ధనమే. ఎందుకంటే ఎన్నికల కమిషన్ రూల్స్ కాస్త కట్టుదిట్టంగా వుండడమే కాదు, ఎప్పుడో జమానా కాలం నాటి లెక్కల మేరకు విధించిన నిబంధనలు. అందువల్ల తెల్లధనం ఓ అయిదు నుంచి పదిశాతమే వుంటుంది. మిగిలినదంతా నల్ల ధనమే. అంటే దాదాపు 10 వేల కోట్లు నేలమాళిగల్లో దాటిన నల్లడబ్బు జనాల్లోకి వస్తుంది. నిజానికి ఓ విధంగా ఇదంతా ఎకానమీకి బూస్ట్ అనే అనుకోవాలి.

ఒక్కో అభ్యర్ధి హీనంలో హీనంగా చూసుకున్నా 30 కోట్లు వంతున ఖర్చు చేయడం అనివార్యం. మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇది కాక పార్టీల పరంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసే ఖర్చు వుండనే వుంటుంది. సగటున 100 కోట్లు ఒక్కో నియోజకవర్గంలో ఖర్చు వుంటుంది. అంటే సుమారుగా 12వేల కోట్ల ఖర్చు అన్నమాట. ఇది కాకుండా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు చేసే ఖర్చు కూడా వుండనే వుంటుంది.

ఎందుకంటే జనాల చేతుల్లోకి కావచ్చు, నాయకుల చేతుల్లోకి కావచ్చు, వచ్చిన డబ్బు అలా వుండిపోదు. అందిన సొమ్మును బట్టి భూములు, వాహనాలు, బంగారం కొనుగోలుకు వెళ్తుంది. అదే విధంగా ఇదే టైమ్ లో పెట్రోలు, డీజిల్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. రెస్టారెంట్ ల ఆదాయం అదే తీరులో పెరుగుతుంది. మద్యం, బార్ అండ్ రెస్టారెంట్ల టర్నోవర్ ఓ రేంజ్ లో వుంటుంది. దీని వల్ల జిఎస్టీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల వుంటుంది.

ఇన్నివేల కోట్లు నల్లధనంగా వుంటే ఏ విధమైన ఉపయోగం వుండదు. జనాల్లోకి వస్తేనే ఎకానమీకి మద్దతు లభిస్తుంది. సామాన్య ఓటరు ఇంటికి ఈ నెలలో మంచి ఆదాయం లభిస్తుంది. ఊరేగింపుల, రొడ్ షో లు నిత్యం ఏదో పార్టీ తరపున వుంటూనే వుంటాయి. నిత్యం ఆదాయమే. ఇక ఓటింగ్ నాడు అన్ని పార్టీల నుంచి మొత్తాలు అందుతాయి. చోటా, గల్లీ, కాలనీ లీడర్లకు భారీ మొత్తాలు అందుతాయి. కులసంఘాలకు,నాయకులకు సరేసరి.

మీడియా సంస్థల్లో తొంభై శాతం నష్టాల్లోనే నడుస్తున్నాయి. వీటి అన్నింటికీ ఇప్పుడే కాస్త బలమైన ఆదాయం లభిస్తుంది. ఈ ఆదాయంతోనే మిగిలిన కాలంలో నడపడానికి ఉపయోగించాలి. ఇలా అన్ని విధాలా ఎన్నికల టైమ్ లో బయటకు వచ్చే నల్లధనం ఉపయోగపడుతుంది. అందుకే ఎన్నికలు అంటే ఇప్పుడు సిద్దాంత పోరాటాలు కాదు. ధనపోరాటాలు మాత్రమే.