దేశంలో ‘దేహ’ద్రోహులున్నారు జాగ్రత్త!

మహిళ డాక్టరయినా ఒకటే. యాక్టరయినా ఒక్కటే. ఆమె ప్రతిభకో, ఆమె కృషికో కాకుండా ఆమె దేహానికి విలువకడుతున్నారు

దేశమంటే మట్టి కాదోయ్‌ అని గురజాడ చెప్పినట్టు, ఇవాళ ఎవరయినా ‘స్త్రీ అంటే దేహం’ కాదోయ్‌ అని అరచి చెబితే బాగుండుననిపిస్తోంది. దేశద్రోహులు ఎక్కుడున్నారో తెలీదు కానీ, ‘దేహ’ ద్రోహులు అడుగుడుగునా కనిపిస్తున్నారు. అది పసిబిడ్డ దేహమా? ముసలి అవ్వ దేహమా? అనవసరం. ఏ స్త్రీ అయినా ఈ ‘ద్రోహుల’కు ఉత్త శరీరంగానే కనిపిస్తోంది. స్త్రీ గృహిణిగా వున్నా దేహమే. వృత్తి చేసుకున్నా దేహమే. డాక్టరయినా దేహమే, యాక్టరయినా దేహమే.

అవును. తమ దేహాల్లా చూడవద్దని ఒక చోట డాక్డర్లు రోడ్డు ఎక్కితే, మరొక చోట యాక్టర్లు రోడ్డెక్కారు. అంతా మహిళలే. పశ్చిమ బెంగాల్లో మహిళా వైద్యులూ, కేరళలో మహిళా సినీ కళాకారులూ ఆందోళన బాట చేపట్టారు. డ్యూటీలో వున్న ఒక మహిళా డాక్టర్‌ పై (9 ఆగస్టు 2024న) సంజయ్‌ రాయ్‌అనే సివిక్‌ (పోలీస్‌) వాలంటీర్‌ దారుణంగా హింసిస్తూ, అత్యాచారం చేసి, హత్య చేశాడు. అదికూడా ఎంతో చరిత్ర వున్న ఆర్‌.జి కార్‌ హాస్సటల్‌లో జరిగింది. ఎప్పుడో ఒక సినీతార పై జరిగిన అత్యాచారం కారణంగా ఏర్పడ్డ జస్టిస్‌. హేమ కమిటీ నివేదిక కూడా ఇదే సందర్భంగా రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. దాంతో మళయాళీ సినిపరిశ్రమలోని మగ నిర్మాతల, దర్శకుల, నటుల వికృత రూపాలు బయటపడ్డాయి.

అక్కడికి మిగిలిన రాష్ట్రాలన్నీ భద్రంగా వున్నట్టు కాదు. ఇదే నెలలో మహరాష్ట్రలోని ఒక స్కూలు నర్సరీ చదువుతున్న నాలుగేళ్ళ బాలిక పై అత్యాచారం జరిగిందని ఆందోళనలకు దిగారు. ఉత్తరప్రదేశ్‌ లో అయితే అనుదిన అత్యాచార పర్వమే నడుస్తుంటుంది. ఇదే నెల చివరి వారంలో పదిహేను, పదహారేళ్ళ దళిత బాలికలు ఇద్దరు పొద్దున్నే చెట్టుకు వేళ్ళాడుతూ కనిపించారు. పోలీసులు ఏం చెబుతారు. అత్యాచారమే అంటారు కదా! అనేశారు కూడా,

అయితే బెంగాల్‌ గ్యాంగ్‌ రేప్‌ అండ్‌ మర్డర్‌, కేరళలోని సినీపరిశ్రమలోని లైంగిక వంచనా ఏకకాలంలో దేశాన్ని కుదిపేశాయి. దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే నెల కూడా ఇదే. పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ట్రాల ప్రభుత్వాలు బీజేపీయేతర పక్షాల చేతుల్లో వున్నాయి. ఒక చోట తృణమూల్‌ కాంగ్రెస్‌, మరొక చోట లెఫ్ట్‌ డెమాక్రటిక్‌ ఫ్రంట్‌లు ఇక్కడ అధికారంలో వున్నాయి.

సహజంగానే కేంద్రంలో అధికార పక్షమైన బీజేపీకి సందు దొరికనట్లే లెక్క. పశ్చిమ బెంగాల్‌ ఏకంగా మహిళే (మమతా బెనర్జీ) అధికారంలో వున్నారు. మహిళే పాలించే చోట మహిళల పై అత్యాచారాలా? నిర్భయ ఘటనప్పుడు (2012)లో కూడా ఇలాగే అన్నారు. ఇది ఢిల్లీలో జరిగింది. అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళ (షీలా దీక్షిత్‌), కేంద్రాన్ని నడుపుతున్న యుపీయే చైర్‌పర్సన్‌ (సోనియా గాంధీ) మహిళ, లోక్‌ సభలో ప్రతిపక్ష నేత (సుష్మా స్వరాజ్‌) మహిళ. లోక్‌ సభ స్పీకర్‌ (మీరాకుమార్‌) కూడా మహిళే. అత్యున్నత పదవుల్లో అయిదుగురు కొలువు తీరి వున్న ఢిల్లీ మహానగగరంలో నే ‘నిర్భయ’ పై అత్యాచారం చేశారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ అధికారంలో వున్నా అత్యాచార పర్వం కొనసాగుతూనే వుంది. కాకుంటే అవి జరగకుండా నివారించగల కొన్ని పనులయినా బాధ్యతగా చేస్తున్నారా? లేదా అన్నది.

తాను చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలోనే డాక్టర్‌ అత్యాచారానికీ, హత్యకు గురవ్వటమూ, మళ్ళీ దానిని ఆత్మహత్యగా కప్పిపుచ్చటానికి ప్రయత్నించటమూ జరిగిపోయాయీ అంటే, అక్కడి తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో విఫలమయ్యిందని వేలెత్తి చూపించవచ్చు. ఇందుకు వైరి పక్షాలే దిగిరానవసరంలేదు. అయితే పోలీసులు అత్యాచార నిందితుణ్ణి (సంజయ్‌ రాయ్‌ను) పట్టుకున్నారు. కానీ ఆ నిందితుడు ఎక్కడ వాడో కాదు.

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలోని వాడే. అక్కడ ఉన్న పోలీసులూ, హోంగార్డులూ చాలక, పోలీసు విభాగంలో పనిచెయ్యటానికి ‘సివిక్‌ వాలంటీర్ల’ ను తీసుకున్నారు. వీరికి రోజు వేతనం రు.330 వరకూ వుంటుంది. వీరికి కనీస విద్యార్హత ఎనిమిదవతరగతి. ఇలాంటి వారు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో 1.20 లక్షల మంది వున్నారు. సంజయ్‌ రాయ్‌ ఇలాంటి వాలంటీరే. అప్పుడప్పుడు పోలీసు ఉద్యోగుల్లో జబ్బు పడ్డవారినీ, ప్రమాదంలో చిక్కుకున్న వారినీ ఈ ఆసుపత్రికి తీసుకురావటం అలవాటు. అలా వచ్చిన ఇతను, గదిలో విశ్రాంతి తీసుకుంటున్న ఈ డాక్టర్‌ పై అతి దారుణంగా అత్యాచారం చేసి హింసించి చంపేశాడు.

‘నిర్భయ’ చట్టం వచ్చేశాక కూడా ఇలాంటి అత్యాచారాలు నిరాటంకంగా జరిగిపోతున్నాయి. ‘నిర్భయ’ చట్టానికి ఆధారభూతమైన జస్టిస్‌ వర్మ నివేదికలోని ఒక అంశం మళ్ళీ ఇప్పుడు చర్చకు వస్తోంది. అత్యాచార నేర నిరూపణ అయితే యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు, మరణ శిక్ష వేయకూడదని జస్టిస్‌ వర్మ చెప్పారు. కానీ, ‘నిర్భయ’ చట్టం ప్రకారం మరణదండన వెయ్యవచ్చు. అత్యాచారం చేశాక ఆధారాన్ని తుడిచెయ్యాలన్న ఉద్దేశ్యంతో బాధితురాలిని నేరస్తుడు చంపేస్తాడని, అప్పుడు అసలు నిందితుణ్ణి పట్టుకోవటం కష్టం అవుతుందన్నది వర్మకమిషన్‌ ఆంతర్యం.

ఇక మళయాళీ సినీ పరిశ్రమలో జస్టిస్‌ హేమ నివేదికను వెల్లడి చేసిందే అక్కడి లెఫ్ట్‌ ప్రభుత్వం. దానిని వెల్లడి చెయ్యటమంటే, సినీ ప్రముఖుల ఆగ్రహాన్ని ఏరి కోరి తెచ్చుకోవటమే. సినీ పరిశ్రమలోకి వెళ్ళాలనుకునే మహిళలు, నిర్మాతల, దర్శకుల, నటుల లైంగి వాంఛను తీర్చాల్సి వస్తోందని ఈ నివేదిక ధ్రువపరచింది. అంతే కాదు. ఒకటి కాదు రెండు ఏకంగా 17 రకాల లైంగిక హింసల్ని ఈ నివేదిక బట్టబయిలు చేసింది. ఏ ఒక్కరి కోరికను నిరాకరించినా ఆ స్త్రీ పట్ల, మొత్తం పరిశ్రమ ఏకమయి వెలి వెయ్యటం కూడా జరుగుందని ఆ నివేదిక బయిట పెట్టింది. దీంతో ‘మోలీ వుడ్‌ ( మళయాళీ సినీ పరిశ్రమ)లో ప్రకంపనలు రేగాయి. సీనియర్‌ నటీమణులు కూడా తమ పట్ల కొందరు కళాకారులు ప్రదర్శించిన అనుచిత ప్రవర్తన గురించి ఒక్కొక్కటిగా బయిట పడుతున్నారు.

మహిళ డాక్టరయినా ఒకటే. యాక్టరయినా ఒక్కటే. ఆమె ప్రతిభకో, ఆమె కృషికో కాకుండా ఆమె దేహానికి విలువకడుతున్నారు. ఈ ‘దేహ’ ద్రోహులు సైతం దేశభక్తులుగా చెలామణీ అయితే దేశానికే ప్రమాదం.

9 Replies to “దేశంలో ‘దేహ’ద్రోహులున్నారు జాగ్రత్త!”

  1. టాలీవుడ్ లో బహిరంగంగా ఆడవాళ్ళని గురించి వెకిలిగ మాట్లాడి స్వర్ణోత్సవం చేసుకుంటున్నారు. వాడికి అగ్ర హీరో లు వత్తాసు. వీళ్ళ ముసుగులు కూడా తియ్యండి

    1. దేశంలో మగ వాళ్ళు అందరినీ మాయం చేసేస్తే సరి. అసలు మాఘ వాళ్ళు అనేవాళ్లె లేకపోతే ఇంక ఆడవారి పైన అత్యాచారం చేసే అవకాశం వుండదు కదా.

  2. అదే ‘దిశా’ చట్టంతోనైతే నిందితుడు మరియు ఆధారాలు కలిపి సంఘటన తేదీ నుండి మూడు వారాల్లోపు దొరికితే సరి…లేకుంటే నిర్దోషే!

  3. మగ వాళ్ళ పుట్టుక కి కారణం అయ్యే వై క్రోమోజోమ్ లు క్రమంగా మాయం అవుతున్నాయి అంట.

    బహుశా , మగవారి మీద ప్రకృతే స్వయంగా ప్రతీకారం తీర్చుకుని శిక్ష వేస్తున్నట్లు వింది.

    అదే జరిగితే , ఆడవారి మీద అఘాయిత్యం చెయ్యడానికి అసలు మగవాళ్ళు వుండనే వుండదు.

    ప్రపంచమీ మొత్తం కేవలం ఆడవారు మాత్రమే మిగులుతారు.

Comments are closed.