కొంత కాలంగా దేశంలో ఎటువంటి పరిణామం సంభవించినా, రాజకీయంగా ఎలాంటి ఘటన జరిగినా దాని వెనుక బీజేపీ హస్తం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనుమానాలు కలుగుతున్నాయి. విమర్శలు వస్తున్నాయి. ఈ అభిప్రాయం, అనుమానం, విమర్శల్లో కొంత వాస్తవం ఉందని చెప్పుకోవచ్చు. దేశంలో తనను వ్యతిరేకించే ఏ ప్రతిపక్షమూ బతికి బట్ట కట్టకూడదన్నదే బీజేపీ ఉద్దేశం, లక్ష్యమూ కూడా. ఇందుకు చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ రాజీనామా వెనుక కూడా బీజేపీ అదృశ్య హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. కొన్ని ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. కాంగ్రెస్ కీలక నేత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా, రాజ్యసభ సభ్యుడిగా, పెద్దల సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగిన 73 ఏళ్ల వయసున్న ఆజాద్.. దాదాపు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో కొనసాగిన అనుబంధాన్ని తెంచేసుకున్నారంటే అది చిన్న విషయం కాదు.
ఆయన ఈ నిర్ణయానికి రావడం వెనుక బలమైన శక్తి ఉందని కొందరు అంటున్నారు. గత రెండు మూడేళ్లుగా కాంగ్రెస్ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని ప్రదర్శిస్తున్న ఆయన.. తాజా పరిణామాలకు మాత్రం తీవ్రంగా నొచ్చుకున్నారు. అయితే.. ఆయన పార్టీని వీడతారని మాత్రం అధిష్ఠానం ఊహించలేదు. పైగా పార్టీని వీడుతూ.. ఆయన విడుదల చేసిన సంచలన ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. 1973లో 22 ఏళ్ల వయసులో భలెస్సా బ్లాక్‌కు కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా ఆజాద్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆయన పనితనానికి మెచ్చి రెండేళ్లకే జమ్ము కశ్మీర్ యూత్ ప్రెసిడెంట్‌ను చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. మరో ఐదేళ్లకు అంటే 1980లో ఏకంగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయ్యాడు ఆయన. ఆపై మహారాష్ట్ర వాసిం లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికై అటుపై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే పార్లమెంటరీ వ్యవహారాలు, పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖలు చేపట్టారు ఆజాద్. ఆపైన రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ కాలం కొనసాగినా జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి అవకాశం రావడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్.. కాంగ్రెస్ నలుగురి ప్రధానుల హయాంలో మంత్రిగా పని చేసిన అనుభవశాలి గులాం నబీ ఆజాద్. ప్రతిపక్ష నేతగా, సభ్యుడిగా బీజేపీ-ఎన్డీయేపై ఆయన ప్రత్యక్ష విమర్శలు గుప్పించిన సందర్భాలు చాలా చాలా తక్కువ. మోదీ నేతృత్వంలోని బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పురస్కారం అందుకున్నారాయన.
ఆ సందర్భంలో.. కనీసం ఎవరో ఒకరు తన పనిని గుర్తించారంటూ వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిందంటూ బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా ప్రశంసలు గుప్పించారు గులాం నబీ ఆజాద్. ఆ సందర్భంలో.. బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను స్వాగతించారు. కాంగ్రెస్ గాంధీ కుటుంబ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పడ్డ జీ 23 కూటమిలో గులాం నబీ ఆజాద్ కీలకంగా వ్యవహరించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల(పంజాబ్‌లో అయితే ఏకంగా అధికారం కోల్పోవడం) ఆధారంగా.. సంస్థాగత మార్పుపై తీవ్రస్థాయిలో అధిష్ఠానంపై గళమెత్తారు. ఆ సమయంలోనే ఆయన పార్టీని వీడతారేమో అనే చర్చ నడిచింది. అయితే సోనియా గాంధీ పిలిపించుకుని వ్యక్తిగతంగా మాట్లాడడంతో ఆయన ఆ సమయానికి మెత్తబడ్డారు.
“పోస్టులు వస్తాయి… పెద్ద పెద్ద ఆఫీసులు వస్తాయి… అధికారం వస్తుంది… కానీ వాటిని ఎలా నడపాలి అనేది ఎవరైనా సరే… గులామ్ నబీ ఆజాద్ జీ నుంచి నేర్చుకోవాలి. నా దృష్టిలో ఆయన నిజమైన స్నేహితుడు” అని మోదీ భావోద్వేగం చెందారు. “నేను మిమ్మల్ని రిటైర్ కానివ్వను. మీ సలహాలు తీసుకుంటూనే ఉంటాను. నా డోర్లు ఎల్లప్పుడూ మీ కోసం తెరిచే ఉంటాయి” అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆజాద్ వీడ్కోలు సందర్భంగా రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఆజాద్.. బీజేపీ గూటికి చేరతారంటూ పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. అయితే అవన్నీ ఊహాగానాలే అని అప్పుడు కొట్టిపారేశారాయన. బీజేపీలో చేరేది ఊహాగానాలే అంటూ గతంలో ప్రకటించారు గులాం నబీ ఆజాద్. కానీ, బీజేపీతో ఆయన అనుబంధం మాత్రం చాలా ఏళ్లుగా కొనసాగుతూనే వస్తోంది.
ప్రస్తుత పరిస్థితులు.. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరవచ్చని ఒకవర్గం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీజేపీలో చేరినా.. సలహాదారుగా మాత్రమే ఆయన వ్యవహరించవచ్చనే భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీలో గనుక చేరకపోతే .. ఆయన కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ‘స్థానిక’ సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుని కొత్త పార్టీ నిర్ణయం తీసుకోవచ్చని, లేదంటే.. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీతో ముందస్తు అవగాహన ప్రకారమే ఆయన రాజీనామా చేసి ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు.
ఆయనను తెలంగాణ గవర్నర్‌గా పంపిస్తారన్న ప్రచారం కూడా ఢిల్లీలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.. పుదుచ్చేరికి ఇన్ఛార్జ్ లెప్టినెంట్ గవర్నర్‌గా పని చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమెను పూర్తిస్థాయిలో పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా అపాయింట్ చేసి.. గులాం నబీ ఆజాద్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తారని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.
రెండు రోజుల కిందట కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఇదివరకే తమిళిసై సౌందరరాజన్ భేటీ కూడా అయ్యారు. ఆజాద్‌కు తెలంగాణతో అనుబంధం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. కొన్నాళ్లు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా కూడా పని చేశారు. రేపు కాకపోతే.. మరి కొద్ది రోజుల తర్వాతైనా బీజేపీ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
అదే సమయంలో ఆయనను కీలకంగా ఉపయోగించుకోవడానికి బీజేపీ సిద్ధపడటం ఖాయం. అందుకే ఆయన ముందు ముందు రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనం చేయడంలో భాగంగానే గులాం నబీ ఆజాద్ కు బీజేపీ వల వేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి.