Advertisement

Advertisement


Home > Politics - Analysis

ప‌వ‌న్ త‌ప్ప‌.. చంద్ర‌బాబును ఎవ్వ‌రూ న‌మ్మ‌డం లేదా!

ప‌వ‌న్ త‌ప్ప‌.. చంద్ర‌బాబును ఎవ్వ‌రూ న‌మ్మ‌డం లేదా!

ఒక‌వైపు భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు కోసం చంద్ర‌బాబు నాయుడు కాళ్లావేళ్లా ప‌డుతున్న ప‌రిస్థితుల్లో ఉన్నారు. మోడీపై త‌న వ‌న్ సైడ్ ల‌వ్ ను చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టిస్తూనే ఉన్నారు. స‌రిగ్గా ఐదేళ్ల కింద‌ట మోడీని ఇష్టానుసారం తిట్టిపోసిన చంద్ర‌బాబు నాయుడు, ఇప్పుడు చిడ‌త‌లు ప‌ట్టుకుని మోడీ భ‌జ‌న చేస్తూ ఉన్నారు. 

అంతే కాదు.. బీజేపీ కోరిన‌న్ని సీట్ల‌ను ఇచ్చి పొత్తు కుదుర్చుకునేందుకు కూడా చంద్ర‌బాబు సై అంటూనే ఉన్నారు. ఇందుకు మ‌ధ్య‌వ‌ర్తిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను దింపాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రెండు పార్టీల మ‌ధ్య‌న పొత్తు కుదిర్చే ప‌నిలో కొన్ని నెల‌లుగా శ్ర‌మిస్తున్నారు. అయితే చంద్ర‌బాబు గ‌తంలో వ్య‌వ‌హ‌రించిన తీరును గుర్తుంచుకున్న క‌మ‌లం పార్టీ ప‌వ‌న్ మ‌ధ్య‌వ‌ర్తిత్వానికి కూడా పెద్ద‌గా విలువ‌ను ఇవ్వ‌డం లేదు!

ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో పొత్తు కోసం చంద్ర‌బాబు నాయుడు ఆరాట‌ప‌డ్డారు. ప‌వ‌న్ క‌ల్యాణ్  పై ల‌వ్ ను ప్ర‌క‌టించారు. ఎలాగూ చంద్ర‌బాబుకు చంచాగిరి చేయ‌డం అల‌వాటుగా క‌లిగి ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. త‌న‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కూడా అక్క‌ర్లేద‌ని చంద్ర‌బాబును సీఎంగా చేయ‌డ‌మే త‌న త‌దుప‌రి ల‌క్ష్య‌మ‌న్న‌ట్టుగా ప‌ని చేస్తూ ఉన్నారు. 

చంద్ర‌బాబు ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చినా చాల‌నే ప‌రిస్థితుల్లో ఉన్నారు జ‌న‌సేన అధినేత‌. మొన్న‌టి వ‌ర‌కూ జ‌న‌సేన క‌నీసం యాభై సీట్ల‌ను డిమాండ్ చేసి తీసుకోగ‌ల‌ద‌నే ప‌రిస్థితి ఉండేది. అయితే చంద్ర‌బాబు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ సాగిలా ప‌డుతున్న తీరు చూస్తే మాత్రం.. ఇప్పుడు టీడీపీ ఇచ్చింది తీసుకోవ‌డం త‌ప్ప ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వేరే ఛాయిస్ ఏమీ లేదు. మ‌రి చంద్ర‌బాబు కేటాయిస్తే  ప‌వ‌న్ క‌ల్యాణ్ కు15 నుంచి ఇర‌వై సీట్ల వ‌ర‌కూ కేటాయించ‌వ‌చ్చు. 

ఎలాగూ తెలుగుదేశం పార్టీ 1999 త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కూ గెల‌వ‌ని సీట్లు ముప్పైకి పైనే ఉన్నట్టున్నాయి. అలాంటి వాటిని కొన్నింటిని, జ‌న‌సేన ముచ్చ‌ట‌ప‌డుతున్న సీట్ల‌ను కొన్నింటిని క‌లిపి 15 సీట్ల వ‌ర‌కూ జ‌న‌సేన‌కు చంద్ర‌బాబు కేటాయించ‌వ‌చ్చు. ఫిఫ్టీ సీట్ల ను డిమాండ్ చేయాల్సిన జ‌న‌సేన ఫిఫ్టీన్ సీట్ల‌తో స‌ర్దుకునే ప‌రిస్థితి ఉంటుందా.. అంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌రో మార్గం లేదు. ఆల్రెడీ చంద్ర‌బాబు దృత‌రాష్ట్ర కౌగిలిలో ఉన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇక గింజుకున్నా ఉప‌యోగం ఉండ‌దు. అయినా గింజుకునే ఉద్దేశం కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న‌ట్టుగా లేదు.

మరి క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కూడా చంద్ర‌బాబు విష‌యంలో బీజేపీ పెద్ద‌గా బెట్టు వీడిందేమీ లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. ప‌వ‌న్ మధ్య‌వ‌ర్తిత్వం ఇప్ప‌టి వ‌ర‌కూ పెద్ద‌గా ప‌ని చేస్తున్న‌ట్టుగా లేదు. అయితే ప‌వ‌న్-బాబుకు ఉన్న మ‌రో అవ‌కాశం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు. ఆ ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ చిత్తుగా ఓడిపోతే అప్పుడైనా ఆ పార్టీకి తాము గుర్తుకు రాక‌పోతామా.. అనే లెక్క‌ల‌తో వీరు ఉండ‌వ‌చ్చు!  

తెలంగాణ‌పై బీజేపీ చాలా ఆశ‌లు పెట్టుకుంది. జీహెచ్ఎంసీ ఫ‌లితాల‌తో ఆ పార్టీ మురిసిపోయింది. తెలంగాణ‌లో కేసీఆర్ కు తామే ప్ర‌త్యామ్నాయం అనేంత స్థాయిలో హ‌డావుడి జ‌రిగింది కొన్నాళ్లు. అయితే మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితం త‌ర్వాత క‌మ‌లం గ్రాఫ్ తెలంగాణ‌లో బాగా త‌గ్గిన‌ట్టుగా ఉంది. కాంగ్రెస్ తెలంగాణ‌లో జీరో ఏమీ కాద‌ని స్ప‌ష్టం అవుతోంది. 

తెలంగాణ‌లో ముక్కోణ‌పు పోరు అయితే ఖాయ‌మే. అయితే బీజేపీ ఏ మేర‌కు స‌త్తా చాటుతుంద‌నేది ఇప్పుడు సందేహాస్ప‌ద‌మైన విష‌యంగా మారింది. బీఆర్ఎస్ పై చేయి సాధించినా, కాంగ్రెస్ గ‌నుక రెండో స్థానం సంపాదిస్తే .. బీజేపీకి అది నిరాశే అవుతుంది. ఇక హంగ్ త‌ర‌హా ఫ‌లితాలు వ‌చ్చినా కాంగ్రెస్-బీఆర్ఎస్ లు చేతులు క‌లిపే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఏతావాతా తెలంగాణ‌లో బీజేపీకి ఎదురుదెబ్బ త‌గిలితే ఆ పార్టీ అప్పుడైనా త‌న వైపుకు వ‌స్తుంద‌నేది చంద్ర‌బాబు లెక్క ఉండొచ్చు.

మ‌రి వేరే రాష్ట్రాల ఫ‌లితాల‌తో బీజేపీ త‌మ‌కు చంద్ర‌బాబే దిక్కు అని ఎందుక‌నుకుంటుంది అనేది స‌మాధానం లేని ప్ర‌శ్నే. ఏపీ విష‌యంలో బీజేపీ లెక్క‌లు బీజేపీకి ఉండొచ్చు. అంతే కాదు.. త‌మ‌తో పొత్తు అంటూ వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ను బీజేపీ అంత తేలిక‌గా ఇష్టానుసారం బ‌య‌ట‌కు వెళ్లిపోనిస్తుందా అనేది మ‌రో సందేహం.

ఇక కాంగ్రెస్ కూట‌మిలోని పార్టీలు కానీ, బీజేపీ వ్య‌తిరేక పార్టీలు కానీ నాలుగేళ్ల నుంచి చంద్ర‌బాబును దాదాపుగా ప‌ట్టించుకోవ‌డం లేదు. 2019 ఎన్నిక‌ల ముందు త‌మ‌తో తిరిగి, మోడీపై దుమ్మెత్తి పోసిన చంద్ర‌బాబు ఆ త‌ర్వాత మోడీ ప్రాప‌కం కోసం పాకులాడుతూ ఉండ‌టాన్ని గ‌మ‌నించి.. ఇత‌డి ప‌చ్చి అవ‌కాశ‌వాదం గురించి ఆ పార్టీలు మాట్లాడుకుంటున్నాయి త‌ప్ప‌, ఇత‌డిని న‌మ్మ‌దగిన నేత‌గా చూసే అవ‌కాశాలు లేవు. అప్పుడు మోడీకి వ్య‌తిరేకంగా పోరాడిన చాలా మంది అలానే పోరాడుతూ ఉన్నారు. 

అయితే చంద్ర‌బాబు అప్పుడు ఆ కూట‌మిలో హ‌ల్చ‌ల్ చేసి, తెలంగాణ‌లో కాంగ్రెస్ తో దోస్తీతో ఆ పార్టీని చిత్తుగా ఓడించేసి.. ఇప్పుడు వారి వైపు చూడ‌టానికి కూడా భ‌య‌ప‌డుతున్నాడు. ఆ కూట‌మి కూడా చంద్ర‌బాబు అవ‌కాశ‌వాదాన్ని చూసి న‌వ్వుకుంటూ ఇత‌డిని ప‌ట్టించుకోవ‌డం మానేసింది.

మ‌రి బీజేపీనూ చంద్ర‌బాబును ప‌ట్టించుకోవ‌డం లేదు, ప్ర‌తిప‌క్ష కూట‌మీ ఇత‌డిని గుర్తించ‌డం లేదు. ఏతావాతా ప్ర‌స్తుత రాజ‌కీయంలో చంద్ర‌బాబు అంద‌రి విశ్వ‌స‌నీయ‌త‌నూ కోల్పోగా.. ఈ అవ‌కాశ‌వాదిని న‌మ్ముతున్న ఏకైక రాజ‌కీయ నేత‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ నిలుస్తున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?