
తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వెనువెంటనే కమలం పార్టీలోకి చేరిన నేతలు ఇప్పుడు తిరిగి పచ్చ పార్టీ వైపు చూస్తున్నట్టున్నారు. ఈ ఏర్పాట్లన్నీ ముందుగా చేసుకున్నవే లాగా ఉన్నాయి కూడా! భారతీయ జనతా పార్టీలో ఉంటూ చంద్రబాబు మేలు కోసం పని చేయడమే పనిగా పెట్టుకుని, ఈ మేరకు బాహాటంగా ప్రకటనలు కూడా చేస్తూ ఉన్నారు కొందరు నేతలు.
అలా బీజేపీలో ఉన్న పెద్ద చంద్రబాబు భక్తుడు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అధికారంలో లేని పార్టీల్లో ఉండటానికి రెడీగా లేని ఆదినారాయణ రెడ్డి ఇదే తీరుతో తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతవరకు కిరాతకుడిగా కనిపించిన ఆదినారాయణ రెడ్డిని తెలుగుదేశం చేర్చుకోవడమే కాదు, మంత్రిని కూడా చేసింది. 2014 ఎన్నికల సమయంలో జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి వేధింపులు అంటూ టీడీపీ హల్చల్ చేసింది.
ఎన్నికలను ప్రశాంతంగా జరగనివ్వడం లేదని, రిగ్గింగ్ అంటూ పోలింగ్ రోజున సీఎం రమేశ్ తో సహా కొందరు టీడీపీ నేతలు జమ్మలమడుగు నియోజకవర్గంలో హల్చల్ చేశారు. అయితే ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి అసలైన ప్రజాస్వామ్య వాది అయ్యాడు టీడీపీకి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయనను ఫిరాయింపజేసుకుని మరీ మంత్రి పదవిని ఇచ్చింది. ఇక ఆదినారాయణ రెడ్డి లెగ్గు మహత్యమో ఏమో కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ చిత్తయ్యింది. ఆ వెంటనే ఈయన టీడీపీని వీడి బీజేపీ లోకి వెళ్లారు.
ఇదంతా చంద్రబాబు స్ట్రాటజీ మేరకే అనే టాక్ వచ్చింది. అందుకు తగ్గట్టుగా బీజేపీలో ఉంటూ చంద్రబాబుతో పొత్తు అంటూ మాట్లాడుతున్నారు ఆదినారాయణ రెడ్డి. బీజేపీలో ఇరవై ముప్పై యేళ్లుగా పని చేసిన వారు కూడా పొత్తులు పూర్తిగా అధిష్టానం ఇష్టం అంటుంటే, ఆది మాత్రం తనే బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అన్నట్టుగా పొత్తులు ప్రకటిస్తున్నారు.
కేవలం ఆదినారాయణ రెడ్డి మాత్రమే కాదు, రాయలసీమలో బీజేపీలోకి చేరిన మరి కొందరు చంద్రబాబు అనుకూలురు కూడా ఉన్నారనే అభిప్రాయాలున్నాయి. వీరిలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. 2014 ఎన్నికల్లో ధర్మవరం నుంచి టీడీపీ తరఫున నెగ్గిన సూరి 2019లో ఓటమి పాలయ్యారు. పెద్ద కాంట్రాక్టర్ అయిన సూరి వెంటనే బీజేపీలోకి దూకారు. కమలం పార్టీ శరణుగోరి పనులు చక్కబెట్టుకుంటున్నారు నాలుగేళ్లుగా.
ఇక ఎన్నికల సమయానికి తిరిగి టీడీపీలోకి వెళ్లిపోయేందుకు ఈయన గట్టిగా ప్రయత్నిస్తున్నారనే టాక్ ఉంది. అయితే గతంలో సూరి ప్రాతినిధ్యం వహించిన ధర్మవరానికి ఇప్పుడు పరిటాల శ్రీరామ్ ఇన్ చార్జిగా ఉన్నాడు. అందులోనూ సూరి కుటుంబానికి, పరిటాల కుటుంబానికి మొదటి నుంచి పడదు. టీడీపీలోనే ఉన్నా.. పరస్పరం వైరి వర్గాలివి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సూరికి ఆ టికెట్ ను వదలడానికి పరిటాల కుటుంబీకులు నిరాకరించవచ్చు. దీంతో ఇప్పుడు సూరి కన్ను మరో నియోకవర్గం మీద పడిందట. అదే కళ్యాణదుర్గం.
వచ్చే ఎన్నికల్లో వరదాపురం సూరి కళ్యాణదుర్గం నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేయవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడింది. 2014లో ఈ సీటు నుంచి నెగ్గారు హనుమంతరాయ చౌదరి. 2019లో ఇక్కడ నుంచి ఉషశ్రీ చరణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో నెగ్గారు. హనుమంతరాయచౌదరి కుటుంబం రాజకీయ వారసత్వం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. అయితే వారికి అవకాశం ఇవ్వరనే ప్రచారం జరుగుతూ ఉంది, బీజేపీ నుంచి బయటకు వచ్చేసి తిరిగి టీడీపీలోకి చేరబోయే వరదాపురం సూరికి కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ దక్కుతుందనేది టీడీపీ నుంచి వినిపిస్తున్న టాక్!
అయితే కళ్యాణదుర్గానికి వరదాపురం సూరి పూర్తిగా స్థానికేతరుడు అవుతాడు. సూరి సొంత ఊరు ధర్మవరం మండలంలో ఉంటుంది. దశాబ్దాలుగా రాజకీయం అంతా కూడా ధర్మవరంలోనే చేశాడు. ఇప్పుడు ఉన్నట్టుండి అక్కడకు వెళితే అక్కడి క్యాడర్, హనుమంతరాయచౌదరి వర్గం ఏ మేరకు సహకారిస్తుందనేది అనుమానమే. అలాగే కళ్యాణదుర్గంలో కమ్మ వాళ్ల జనాభా కూడా అతి స్వల్పమే.
అయితే అనంతపురం జిల్లాలో జనాభా రెండు మూడు శాతం మించకపోయినా టీడీపీ తరఫున చాలా నియోజకవర్గాల్లో కమ్మ వాళ్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో బీసీల జనాభా ఎక్కువగా ఉన్న కళ్యాదుర్గం నియోజకవర్గంపై స్థానికేతర కమ్మ నేతను రుద్దనూ వచ్చు!
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా