అదే జరిగితే మోడీ దగ్గర బాబు చేతులు కట్టేసుకున్నట్లే

వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ- టీడీపీ పొత్తు పెట్టుకుంటాయని జాతీయ మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి. వాటిని తెలుగు మీడియా కూడా అందుకుంది. టీడీపీ ఎన్డీయేలో చేరుతుందని అంటున్నారు. మొదటగా ఈ విషయాన్ని ఇండియన్ ఎక్స్…

వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ- టీడీపీ పొత్తు పెట్టుకుంటాయని జాతీయ మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి. వాటిని తెలుగు మీడియా కూడా అందుకుంది. టీడీపీ ఎన్డీయేలో చేరుతుందని అంటున్నారు. మొదటగా ఈ విషయాన్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఢిల్లీ ఎడిషన్ బయటపెట్టింది. దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు కనబడలేదు. కానీ బీజేపీ మౌత్ పీస్ గా పేరుబడిన రిపబ్లిక్ టీవీ కూడా వెల్లడించడంతో తెలుగు మీడియా అంది పుచ్చుకుంది. 

టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు రిపబ్లిక్ టీవీ తెలియచేసింది. వాస్తవానికి బీజేపీతో స్నేహానికి బాబు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటినుంచి అర్రులు చాస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు మోడీనిగానీ, బీజేపీని గానీ పల్లెత్తు మాట అనలేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అడక్కుండానే తానే ముందుకెళ్లి మద్దతు ఇచ్చారు.

చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల ఏపీకి ఏమైనా మేలు జరుగుతుందా అంటే చెప్పలేం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ కేంద్రంతో గానీ, బీజేపీతో గానీ సఖ్యంగానే ఉన్నారు. బీజేపీ నాయకులే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారుగానీ జగన్ ఏమీ మాట్లాడటం లేదు. తనకు అధికారం అప్పగిస్తే ఆరు నెలల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి పెడతానని చంద్రబాబుకు సవాల్ విసిరాడు. దీంతో జగన్ ట్రాప్ లో ఇరుక్కున్న బాబు ప్రత్యేక హోదాపై గట్టిగా డిమాండ్ చేశారు. మోడీపై  వీరంగం వేశారు. వ్యక్తిగత దూషణలు కూడా చేశారు. తీవ్ర నిరసనలు తెలియచేసారు. చివరకు సంబంధాలు తెంచుకున్నారు. ఫలితంగా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అధికారం జగన్ పరమయ్యాక ఆయన హోదా సాధన మీద సింపుల్ గా చేతులెత్తేశారు.

కేంద్రాన్ని అడుగుతూనే ఉండాలి అంటూ చేతులు దులుపుకున్నారు. అక్రమాస్తుల కేసుల రూపంలో జగన్ జుట్టు మోడీ చేతుల్లో ఉంది కాబట్టి సైలెంట్ అయిపోయారని ప్రతిపక్షాలు అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు అధికారంలోకి వచ్చాడనే అనుకుందాం. ఈయనా జగన్ కంటే భిన్నంగా వ్యవహరించలేడు కదా. పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడింది ఈయనే కదా. కాబట్టి ప్రత్యేక హోదా డిమాండ్ చేసే సాహసం చంద్రబాబుకు ఉండదని చెప్పొచ్చు. కేంద్రంలో మోడీ అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం.  నాలుగేళ్ల కిందట తెగతెంపులు చేసుకుని వెళ్లిన తెలుగుదేశం పార్టీని తిరిగి ఎన్‌డీఏలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఆంధ్ర, తెలంగాణల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ యోచిస్తోందా..? తాజా రాజకీయ పరిణామాలు వీటినే సూచిస్తున్నాయని రిపబ్లిక్‌ టీవీ చానల్‌ ఓ కథనం ప్రసారం చేసింది.

ఈ ఆంగ్ల చానల్‌ బీజేపీకి అనుకూలమన్న ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఈ కథనంలో కొంతమేరకు వాస్తవం ఉండొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి గట్టి ఓటు బ్యాంకు ఉందని.. తెలంగాణలో దానికి 10-20 శాతం ఓట్లు ఉన్నాయని.. అందుచేత వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సానుకూలంగా ఉందని చానల్‌ వెల్లడించింది. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటించినప్పుడు ప్రధాని మోదీతో కరచాలనం చేసి.. ఐదు నిమిషాలు ముచ్చటించిన విషయాన్ని ప్రస్తావించింది. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థులకు టీడీపీ మద్దతిచ్చిందని.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చంద్రబాబు.. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారని గుర్తుచేసింది. ప్రత్యేక హోదాపై  2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ తెగతెంపులు చేసుకున్నాయి.

హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ టీడీపీ మోదీ కేబినెట్‌ నుంచి వైదొలగింది. ఇటు బీజేపీ కూడా ఆంధ్రలో చంద్రబాబు మంత్రివర్గానికి గుడ్‌బై చెప్పింది. రాజకీయ అవకాశవాదానికి టీడీపీ పాల్పడిందని ఆరోపించింది. రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నం కావడానికి ప్రత్యేక హోదా ప్రధాన కారణమని.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఒత్తిడి కారణంగా హోదా డిమాండ్‌పై చంద్రబాబు పట్టుబట్టారు. కేంద్రం పట్టించుకోలేదు అని రిపబ్లిక్‌ తెలిపింది. పైగా కేంద్రానికి ఎక్కడి నుంచో నిధులు వచ్చిపడడం లేదని.. కేంద్ర నిధులపై ప్రతి రాష్ట్రానికీ సమాన హక్కు ఉంటుందని నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన వ్యాఖ్యలతో పరిస్థితులు తారుమారయ్యాయని పేర్కొంది. కాగా.. టీడీపీ ఎన్‌డీఏలో చేరే అవకాశముందని రెండ్రోజుల కిందట సీనియర్‌ జర్నలిస్టు కూమి కపూర్‌ కూడా ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాశారు. 

టీడీపీలో గతంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలు ఆ బాధ్యత తీసుకున్నారంటూ ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్పందించారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానించారు. అయితే టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర కో-ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ స్పష్టం చేశారు. ఆ మరుసటి రోజే ఎంపీ సీఎం రమేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం మళ్లీ చర్చకు తెర లేపింది. బీజేపీ-టీడీపీ పొత్తు ఉండేది, లేనేది.. కాదంటే ఏ పార్టీతో పొత్తు ఉంటుందనేది సునీల్ దియోదర్ లేదా జీవీఎల్ నరసింహారావు కానీ, తాను కానీ నిర్ణయించేది కాదు అన్నారు. 

ఇది జాతీయ పార్టీ కనుక జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, లేదా అమితా షా నిర్ణయిస్తారన్నారు సీఎం రమేష్. ఎప్పుడైనా అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు.. ఆయన బీజేపీతో అలెయన్స్ పెట్టుకుంటాడని అనుకున్నామా అని ప్రశ్నించారు..? రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. అది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. ఇది తమ పరిధిలోని అంశం కాదని సీఎం రమేశ్ స్పష్టం చేశారు.