Cobra Review: మూవీ రివ్యూ: కోబ్రా

టైటిల్: కోబ్రా రేటింగ్: 2/5 తారాగణం: విక్రం, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, కె.ఎస్. రవికుమార్, రోషన్, ఆనందరాజ్, మృనాళిని రవి తదితరులు కెమెరా: భువన్ శ్రీనివాసన్, హరీష్ కన్నన్ ఎడిటింగ్: జాన్ అబ్రహాం,…

టైటిల్: కోబ్రా
రేటింగ్: 2/5
తారాగణం: విక్రం, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, కె.ఎస్. రవికుమార్, రోషన్, ఆనందరాజ్, మృనాళిని రవి తదితరులు
కెమెరా: భువన్ శ్రీనివాసన్, హరీష్ కన్నన్
ఎడిటింగ్: జాన్ అబ్రహాం, భువన్ శ్రీనివాసన్
సంగీతం: రెహ్మాన్
నిర్మాత: ఎస్.ఎస్.లలిత్ కుమార్
దర్శకత్వం: ఆర్. అజయ్ జ్ఞానముత్తు
విడుదల తేదీ: 31 ఆగష్ట్ 2022

తెలుగు ప్రేక్షకులు థియేటర్లో విక్రం సినిమా వచ్చి చాలా కాలమయ్యింది. ఏదో విషయముందనిపించే ట్రైలర్, తయారీలో భారీ తనం మొదలైన కారణాల వల్ల “కోబ్రా” పై కాసిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. పండగ పూట విడుదలైనా కూడా ఉన్నంతలో మార్నింగ్ షోల్లో జనం కనిపించారంటే అది విక్రం మీద నమ్మకమే.

ఇక విషయంలోకి వెళ్తే..స్కాట్లాండ్ లోని ఒక యువరాజు హత్యతో కథ మొదలవుతుంది. రకరకాల మారువేషాల్లో కనిపిస్తూ విక్రం కాసేపు “దశావతారం” ని, మరి కొంత సేపు “ధూం-3” ని గుర్తు చేస్తాడు. 

భారీ యాక్షన్ సీన్స్, ఏదో జరుగుతొందన్న ఉత్కంఠ కలిగించే ప్రయత్నమైతే జరిగింది ప్రధమార్థంలో. అలా యాక్షన్ ఓరియెంటేషన్ తో సాగే కథలో చిన్నపాటి ట్విస్టులాగ హెల్యూసినేషన్ లాంటి సైకలాజికల్ సబ్జెక్ట్ చొరబడింది. అది కూడా బాగానే ఉంది. 

ఆ తర్వాత మదర్ సెంటిమెంటు, కష్టాల ఫ్లాష్ బ్యాక్, ప్రతీకారం మొదలైనవి తెర మీదకొస్తాయి. అటు పిమ్మట బ్రదర్ సెంటిమెంటొస్తుంది. అప్పటికే ప్రేక్షకుడు హాల్లోకొచ్చి రెండున్నర గంటలు దాటిపోతుంది. ఇన్ని ట్రాకుల మధ్యలో కథ ట్రాకు తప్పి లూప్ లైన్లోకి పోయింది. 

నిజానికి ఇది పాయింటు పరంగా మంచి కథే. కానీ దినుసులు ఎక్కువైపోవడంతో మంట నషాళానికి అంటి అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి దాపురిస్తుంది ద్వితీయార్థం నడుస్తున్న కొద్దీ. 

కథా రచనలోనూ, సీన్ కన్సీవింగ్ లోనూ, స్క్రీన్ ప్లేనూ హార్డ్ వర్క్ కనపడింది కానీ అనుభూతి కలిగించడంలో విఫలమయ్యింది ఈ చిత్రం. మూడు గంటల పాటు ఏకధాటిగా పైన చెప్పుకున్న రసాల్లో ఎప్పుడే రసం పిండుతుందో తెలియకుండా సాగుతుంది.

సినిమా అంతా విక్రం దే. హీరోయిన్స్ కైతే అసలు పాత్ర పరంగా స్కోపే ఇవ్వలేదు. చాలా వీక్ గా రాసుకున్న పాత్రలనిపించుకున్నాయి. 

కే.జీ.ఎఫ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఇందులో తేలిపోయింది. మృనాళిని రవికి కూడా పెద్దగా బలమైన క్యారెక్టరైజేషన్ లేదు. 

అనందరాజ్ కనిపించిన కాసేపు బాగానే నటించాడు..ముఖ్యంగా హేల్యూసినేషన్ ఎపిసోడ్స్ లో. 

సినిమా తీసిన విధానంలో బడ్జెట్ పరంగా ఎక్కడా రాజీపడినట్టు కనపడలేదు. కెమెరా వర్క్ బాగుంది. లొకేషన్స్ రిచ్ గా ఉన్నాయి. 

రెహ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మాత్రం సాదాసీదాగానూ, లౌడ్ గానూ ఉంది. ఈ మాత్రం పనితనం చాలామంది ఎమెచ్యూర్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చూపిస్తున్నారు ఈ మధ్య. రెహ్మాన్ ఔట్ దేట్ అయ్యాడని, అప్డేట్ అవ్వలేదని తెలియజేస్తుంది ఈ సినిమా. పాటలు కూడా రొటీనే. 

పాత్ర తీరు వల్ల విక్రం లో అపరచితుడు నాటి ఫ్లావర్ కొంత కనిపిస్తుంది. అతని నటనా ప్రతిభకి వంక పెట్టడానికేం లేదు. 

కానీ కథా విస్తరణ మరీ ఎక్కువైపోయి మూడు గంటలు బలవంతంగా కూర్చోబెట్టింది.

ఇంటర్వల్ ట్విస్ట్, ఒకటి రెండు సీన్స్ తప్ప మిగతాదంతా తర్వాతేదైనా విశేషముంటుందేమోనని భరిస్తూ కూర్చోవాలి. సినిమాలో విలనుంటాడు కానీ అతనికి, హీరోకి మధ్యలో గొడవెందుకో ఎష్టాబ్లిష్ అవ్వలేదు. కథని ఇష్టమొచ్చినట్టు సాగదీసి కావాల్సిన ఇలాంటి విషయం దగ్గర గాలికొదిలేసాడు దర్శకుడు. 

ఏకవాక్యంలో చెప్పాలంటే చాలా భారీగా, శ్రద్ధగా, కష్టపడి తీయగా ప్రేక్షకుడిని అయోమయం పాలు చేసిన చిత్రం ఈ 'కోబ్రా'.  

బాటం లైన్: బుసగొట్టి పొడుకుంది