అప్పుడు ఈసడించుకున్నారు.. ఇప్పడు వాటేసుకున్నారు

ఎంతటి కొమ్ములు తిరిగిన రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయంగా భవిష్యత్తు లేదనుకున్నప్పుడు, ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతామని అనుకున్నప్పుడు మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. అప్పుడు సిద్ధాంతాలు గుర్తుకురావు. గతంలో తిట్టిన…

ఎంతటి కొమ్ములు తిరిగిన రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయంగా భవిష్యత్తు లేదనుకున్నప్పుడు, ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతామని అనుకున్నప్పుడు మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. అప్పుడు సిద్ధాంతాలు గుర్తుకురావు. గతంలో తిట్టిన తిట్లు గుర్తుకు రావు. కళ్ల ముందు భయమే కనబడుతుంటుంది. అసెంబ్లీ ఎన్నికల యుద్ధంలో ఓడిపోయి దిగులుపడిపోతున్న కేసీఆర్​ పరిస్థితి కూడా ఇదే. పార్లమెంటు ఎన్నికల్లో అన్నో ఇన్నో సీట్లు తెచ్చుకోవాలంటే బహుజనుల పార్టీ అయిన బీఎస్పీతో పొత్తు పెట్టుకోక తప్పలేదు. ఆ పార్టీ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది కాబట్టి దానికీ తప్పలేదు.

పైకి తెలంగాణ భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నామని చెబుతున్నా తమ రాజకీయ భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టున్నారనేది వాస్తవం. విధి అంటే ఇలానే ఉంటుంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. ఇప్పుడు ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. విధి ఎంత బ‌లంగా ఉంటుందో అర్ధం అవుతుంది. “ఏ ఎస్పీ.. బీఎప్పీనా.. ఎస్పీ లేదు.. పాడు లేదు ఊకోవ‌య్యా.. గ‌ది కూడ పార్టీయేనా?.. ఎవ‌రు..? ప్రవీణా? గాయ‌నెవ‌రు? ఎట్టుంట‌డు? ఏం చేస్తడు? వీళ్లంతా ఆయారాం.. గ‌యారాంలే” – అని గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు అప్పటి సీఎంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అప్పట్లో కన్నూ మిన్నూ కానకుండా ఉన్నారు కదా. బీఎస్పీని, ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్న ప్రవీణ్​ కుమార్‌ను కూర‌లో క‌రివేపాకు మాదిరిగా కేసీఆర్ తీసేశారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

క‌ట్ చేస్తే.. మూడు మాసాలు కూడా కాకుండా.. ప్రవీణ్​ కుమార్‌ తో కేసీఆర్ భేటీ అయ్యారు. బీఎస్పీతో  చేతులు క‌లిపేందుకు రెడీ అయ్యారు. అంతేకాదు.. టికెట్ల పంప‌కాల‌పై కూడా.. ఆయ‌న చ‌ర్చించారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన వారు.. హ‌త విధీ కేసీఆర్‌కు ఎంత క‌ష్టం అనే అనుకుంటారు. బీఎస్పీతో పొత్తు దాదాపు ఖారారైనట్లు  బీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఎస్సీ పార్లమెంటు స్థాన‌మైన‌ నాగర్ కర్నూల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని బీఎస్పీకి కేటాయించే అవ‌కాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పని చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తరువాత  బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ టికెట్ కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. అదే స‌మ‌యంలో లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు ఉండ‌డంతోపాటు.. సీట్లను  కూడా పంచుకుంటారు. రెండు నుంచి మూడు స్థానాల‌ను బీఎస్పీకి కేటాయించే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది.  

కేసీఆర్​ ఒక వైపు బీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మరోవైపు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు ఫైనల్ చేయడానికి కేసీయార్ తొందరలో ఉత్తర ప్రదేశ్ కు వెళ్ళి బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అవటానికి రెడీ అవుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని దృష్టిలో పెట్టుకునే బీఎస్పీతో పొత్తుకు కేసీయార్ రెడీ అయినట్లు అర్ధమవుతోంది. మొత్తం 19 ఎస్సీ సీట్లలో బీఆర్ఎస్ గెలిచింది మూడు సీట్లు… అలంపూర్, స్టేషన్ ఘన్ పూర్, చేవెళ్ళ స్ధానాల్లో మాత్రమే. అంటే 19 ఎస్సీ సీట్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గెలిచింది కేవలం మూడు సీట్లు మాత్రమే అంటే ఎంతటి పూర్ రిజల్టో అర్ధమవుతోంది. అందుకే ఎస్సీ ఓట్లను మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ వైపుకు మళ్ళించుకోవటంలో భాగాగంగానే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నట్లున్నారు. లేకపోతే ఎస్సీ ఓట్లు, సీట్లన్నీ కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయనే టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది.

కాంగ్రెస్ కు ఎస్సీ ఓట్లు పడకుండా అడ్డుకోవాలన్నదే కేసీయార్ వ్యూహంగా కనబడుతోంది. కారు, ఏనుగు పొత్తుల వ్యవహారం ఇరు పార్టీలకు చిక్కులు తెచ్చిపెడుతోంది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగేందుకు రెడీ అయ్యారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. కోనేరు బాటలోనే మరో ఇద్దరు లీడర్లు ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడుతారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్ బీఆర్ఎస్ తో జత కట్టడాన్ని దళిత సంఘాల నేతలు తప్పు పడుతున్నారు.

బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సాక్ష్యాలు చూపించి మరి చెండాడిన ఆర్ఎస్పీ పార్లమెంటు ఎన్నికల ముందు కేసీఆర్ తో జతకట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు, మేధావులు, సామాజికవేత్తలు పెదవి విరుస్తున్నారు. ఒక్క ఎంపీ సీటు కోసం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సైతం ట్విట్టర్ వేదికగా ఆరెస్పీ నిర్ణయంపై ఘాటుగా స్పందించారు. 

“గాడిద మీద ఎక్కి అయినా పర్లేదు మీరు ఎంపీ అవ్వాలసిందేనా? (గాడిదకు క్షమాపణలు చెబుతున్నాను). అన్యాయం పోలీస్ బాస్.. కరెక్టు కాదు మీ స్టెప్. ’ అంటూ ట్వీట్ చేశారు. విశారదన్ మహరాజ్ కూడా ఈ కలయికపై ఫైర్ అయ్యారు.  ‘'చీకటి ' మిత్రులు 'వెలుగు' లోకి వచ్చారు. అదేనండీ “ఆర్ఎస్పీ- కేసీఆర్ పొత్తు”. అంటే, ఇన్నాళ్లు ఆర్ఎస్ ప్రవీణ్ కేసీఆర్‌పై చేసిన యుద్ధం ఒక పెద్ద బూటకం, నాటకం, పచ్చి బోగస్ అని తేలిపోయింది. అసలు రహస్యం బద్ధలైపోయింది. బహుజన వర్గాలకు ఒక స్పష్టత వచ్చింది.’ అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా ఆర్ఎస్పీని చూసి బీఎస్పీలోకి వచ్చిన పలువురు  నేతలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.