ఎన్నికల్లో కొందరు అభ్యర్థులను ఓడించడం అంత సులభం కాదు. వారిని ఓడించడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. వారిని ఓడించడాన్ని సవాలుగా తీసుకుంటారు. వారిని ఎవరైనా ఓడిస్తే ఓడించిన అభ్యర్థిని జెయింట్ కిల్లర్ అంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓ కొరకరాని కొయ్యను ఓడించాలని కంకణం కట్టుకున్నారు.
అందుకోసం డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేసే వ్యక్తిని ఎంపిక చేశారు. కానీ ఓడించడం అంత సులభం కాకపోవొచ్చు. బాబు ఓడించాలని అనుకుంటున్న వైసీపీ అభ్యర్థి కొడాలి నాని. గుడివాడలో తిరుగులేని నాయకుడు. బాబుకు చికాకు పుట్టిస్తున్న వ్యక్తి. సీఎం జగన్ ను మరోసారి అధికారంలోకి రానివ్వకుండా చేయడం తమ లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ, అదే స్థాయిలో కొడాలి నానిని కూడా టార్గెట్ గా పెట్టుకుంది.
తనను ఓడించేందుకు టీడీపీ వాళ్లు 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయనే చెప్పాడు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి గడ్డు కాలం ఎప్పుడూ ఎదుర్కోలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. తమ కూటమి గెలుపు సంగతి పక్కన పెడితే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయాన్ని ఆపడమే లక్ష్యంగా చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ విజయం ఆపడంతో పాటు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని కూడా ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా ఉన్నారు.
వైసీపీ మాస్ లీడర్లలో మాజీ మంత్రి కొడాలి నాని ఒకరు. ప్రభుత్వంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ కానీ, చంద్రబాబు కానీ ఏ చిన్న విమర్శ చేసినా మొదట స్పందించేది నానినే. అంతేకాక సందర్భం వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకపడతాడు.
ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబు నాయుడికి సీఎం జగన్ కంటే.. కొడాలి నానే కొరకరాని కొయ్యగా మారాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్కడ అవకాశం దొరికినా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తాడు కొడాలి నాని. ఆతను మరోసారి గెలిస్తే.. తనకు ఇంకా తలనొప్పి అని.. ఎలాగైనా ఈసారి ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నట్లు టాక్. అందుకే గుడివాడలో పలుమార్లు అభ్యర్థులను మారుస్తూ వచ్చారు.
ధన బలం ఉన్న నేత కోసం వేటాడి.. చివరకు వెనిగండ్ల రాము అనే ఎన్నారైను అభ్యర్థిగా ప్రకటించారు. ఖర్చుకు వెనుకాడడనే రామును గుడివాడ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కొడాలి నాని సైతం మీడియాతో మాట్లాడుతూ..తనను ఓడించేందుకు దాదాపు 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపాడు.
కానీ గుడివాడలో నానిని ఓడించడం అంత ఈజీ కాదని స్థానికంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణం.. నాని డబ్బులను పంచూతు ఎదిగిన నాయకుడు కాదు. జనాల్లో కలిసి, వారి కష్ట సుఖాలు తెలుసుకుని వారిలో ఒకడిగా ఉంటూ ఎదిగిన నేత. గుడివాడ నియోజవర్గంలోని ప్రతి గడపకు నాని సుపరిచితం. అక్కడి ప్రతి కుటుంబం..నాని తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తుంది.
అందుకే ఆయనను పార్టీతో సంబంధం లేకుండా గుడివాడ ప్రజలు గెలిపిస్తూ వచ్చారు. ఇలా ప్రజా బలం ఉన్న నేతను ఢీ కొట్టేందుకు డబ్బును ఎరగా వేసినా ఫలితం శూన్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పలు సర్వేలు కూడా కొడాలి నానిదే మరోసారి విజయం అని తేల్చి చెప్పాయి.
2004 నుంచి ఇప్పటికే వరుసగా ఓటమి ఎరుగని నేతగా కొడాలి నాని నిలిచారు. ఇప్పటికే నాలుగుసార్లు గెలిచిన కొడాలి నాని 2024లో మరోసారి గెలుస్తాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబుకు వైసీపీలో ప్రధాన శత్రవు జగన్ తర్వాత నేత కొడాలి నాని మాత్రమే. కొడాలి నాని టీడీపీలో ఉండి గుడివాడలో పాతుకుపోయాడు.
అతను వైసీపీలోకి వెళ్లినా 2014లో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సొంత సామాజికవర్గం నుంచి కొంత వ్యతిరేకత వస్తుందన్న కారణంతోనే చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నం చేయలేదంటున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ ఓటమి పాలయింది. కొడాలి నాని జగన్ తొలి మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా చికాకు పుట్టేవిధంగా మాట్లాడుతున్నాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
2019 ఎన్నికలలో నానిని ఓడించేందుకు చంద్రబాబు దేవినేని అవినాష్ ను రంగంలోకి దించారు. అక్కడ ఇన్ ఛార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావును పక్కన పెట్టి మరీ దేవినేని అవినాష్ కు అవకాశమిచ్చారు. అయినా ప్రయోజనం కలగలేదు. ఇక ఇప్పుడు పోటీ చేయిస్తున్న వెనిగండ్ల రాము కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే అయినా ఆయన భార్య ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ. దీంతో ఇటు కమ్మ, అటు ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లను కూడా పొంది కొడాలి నానిని ఓడించే అవకాశముందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.