సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ గురించి విన్నాం. దానిపై అప్పుడప్పుడు రగడ జరుగుతూ వుంటుంది. తమకు అవకాశాలు ఇవ్వ డానికి దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఇలా అనేక మంది ఎలాంటి డిమాండ్లు పెట్టేవాళ్లో కొందరు సెలబ్రిటీలు అనుభవాలను పంచుకుంటూ వుంటారు.
తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజం నందమూరి ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కూడా క్యాస్టింగ్ కౌచ్ జాడ్యం అంటిందా? అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది.
సినీయర్ నటి దివ్యవాణి తెలుగుదేశం పార్టీ నుంచి నిష్క్రమణ కన్నీటికి దారి తీసింది. ఆడబిడ్డ కంట కన్నీళ్లు సమాజానికి, ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదు. తనను కరివేపాకులా వాడుకున్నారని ఆమె తల్లడిల్లారు. ప్రధానంగా టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్దన్ తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. మీడియా సమావేశం అనంతరం పలు చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.
“చంద్రబాబు ఓ నలుగురిని నమ్ముకున్నారు. టీడీపీలో పదవులు రావాలంటే ఆ నలుగురు చుట్టూ తిరగాలి. ఆ నలుగురికి ఏం కావాలంటే అది చేస్తేనే పదవులు. నిజంగా పని చేసేవాళ్లు అక్కడే వుంటున్నారు. ఇంకొకటి ఇంకొకటి చేసేవాళ్లకు పోస్టులు వేస్తున్నారని వాళ్ల ఆవేదన నా దగ్గర చెబుతున్నారు. అందుకే నాకు పదవి రాలేదేమో! నిజం మాట్లాడినందుకు నన్ను టార్గెట్ చేశారు” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీడీపీలో ఆడవాళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో దివ్యవాణి మాటలే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీలో ఏం జరుగుతున్నదో దివ్యవాణి మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు దేశం పార్టీలో మహిళంతా ఏడుస్తున్నారని దివ్యవాణి పేర్కొనడం వెనుక ఎంతో ఆవేదన వుందరే చర్చకు తెరలేచింది.
తాను నాశనమై పోయినా ఫర్వాలేదని, తన తర్వాతి జనరేషన్ వాళ్లకైనా న్యాయం జరగాలని దివ్యవాణి అంటున్నారంటే… ఆమెలో గూడు కట్టుకున్న ఆవేదన ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు.
ఇది రాజకీయ తెరకావడంతో దివ్యవాణి నర్మగర్భ వ్యాఖ్యలతో అర్థమయ్యేలా సున్నితంగా చెప్పారని అంటున్నారు. ఇదే చిత్రపరిశ్రమకు సంబంధించి సమస్య అయి వుంటే…ఆ భాషలోనే క్యాస్టింగ్ కౌచ్ గురించి దివ్యవాణి చెప్పేవారేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.