యువనేత హార్దిక్ పటేల్ మరోసారి రాజకీయంగా కొత్త మార్గం పట్టారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా హార్దిక్ పటేల్ ప్రకటించారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు హార్దిక్‌ను బయటికి వెళ్లేలా చేశాయి.
యువ పాటిదార్ నేత అయిన హార్దిక్‌ను కాంగ్రెస్ సరిగా ఉపయోగించుకోలేదు. దీంతో గుజరాత్లో ఆ పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. కొన్ని నెలల్లో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కర్నీ కలుపుకుని పోవాల్సిన కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటలకే ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం.
కాంగ్రెస్ రాజకీయాలతో విసిగిపోయిన హార్దిక్ …అందులో వుంటే భవిష్యత్ ఉండదనే నిర్ణయానికి వచ్చారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన హార్దిక్ పటేల్ ఇవాళ్టి నుంచి నూతన ప్రయాణాన్ని మొదలు పెట్టారు.
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో హార్దిక్ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరే ముందు హార్దిక్ ట్విటర్లో పోస్టు పెట్టారు. తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని ట్వీట్ చేయడం విశేషం. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం కోసం ఒక చిన్న సైనికుడిగా పని చేయనున్నట్లు తెలిపారు.
యావత్ ప్రపంచానికే మోదీ ఆదర్శంగా నిలుస్తున్నారని హార్దిక్ అన్నారు. ప్రజల కోసం పని చేయడానికే బీజేపీలో చేరుతున్నట్టు హార్దిక్ తెలిపారు. పార్టీలో చేరడానికి ఎలాంటి డిమాండ్లు పెట్టలేదన్నారు.