అవును ఇది ప్రచారంలో ఉన్న మాట. ఇంతకీ ఏంటా మాట అంటే ఈసారి ఎన్నికల్లో ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేయరు. ఆయన అన్న నాగబాబు బరిలో దిగుతారు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నాగబాబు మరోమారు ఎంపీగానే పోటీ చేస్తారు అని తెలుస్తోంది. అయితే ఆయన సేఫేస్ట్ సీటు చూసుకుంటున్నారు అని తెలుస్తోంది.
ఉత్తరాంధ్రాలో అయిదు ఎంపీ సీట్లు ఉన్నాయి. అందులో అరకు ఎస్టీ సీటు పక్కన పెడితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఉన్నాయి. ఈ నాలుగింటిలో చూస్తే సిక్కోలు, విజయనగరం సీట్లు ఎపుడూ లోకల్ క్యాండిడేట్స్ కే పట్టం కడతాయి.
ఇక విశాఖ అనకాపల్లి చూస్తే అనకాపల్లి నుంచి కూడా ఇద్దరు నాన్ లోకల్ బిగ్ షాట్స్ 2009 ఎన్నికల వేళ ఎంపీ టికెట్ తెచ్చుకుని పోటీ చేస్తే వారిద్దరి మధ్య ఏ మాత్రం అంచనాలు లేని కాంగ్రెస్ అభ్యర్ధి సబ్బం హరి ఎంపీగా గెలిచారు. సబ్బం హరిని గెలిపించింది లోకల్ కార్డు అనే అంటారు. నాడు అల్లు అరవింద్ ప్రజారాజ్యం తరఫున పోటీ చేస్తే టీడీపీ నుంచి పత్రికాధిపతి ఒకరు పోటీ చేసి ఓడారు.
ఇక విశాఖపట్నం సీటే ఇపుడు అందరికీ ముద్దుగా ఉంది. ఈ సీటు గత ముప్పయేళ్ళుగా వలసపాలకులకు అడ్డా అయింది. ఎవరు ఎక్కడ నుంచి వచ్చినా అక్కున చేర్చుకుని ఎంపీ కిరీటం పెట్టే సీటు ఇదే. అయితే విశాఖ లేకపోతే అనకాపల్లి అన్న చర్చలు అయితే నాగబాబు విషయంలో జనసేనలో నడుస్తున్నాయని అంటున్నారు.
పొత్తులు కుదిరితే విశాఖ సీటు బీజేపీ కోరుతుంది. కాదంటే టీడీపీకి కూడా గట్టి క్యాండిడేట్స్ ఉన్నారు. దాంతో జనసేనకు అనకాపల్లి సీటు ఇవ్వవచ్చు అంటున్నారు. అక్కడ కాపులు పెద్ద ఎత్తున ఉండడంతో పాటు పొత్తులు ఫలిస్తే మ్యాజిక్ ఏమైనా జరగవచ్చు అన్న ఆశలు ఉన్నాయట.
మొత్తానికి గతసారి తమ్ముడు పవన్ గాజువాక నుంచి పోటీ చేస్తే ఈసారి అన్న నాగబాబు అటూ ఇటుగా ఉన్న విశాఖ అనకాపల్లి వైపు చూస్తున్నారు అన్నదైతే ప్రచారంలో ఉంది.