టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ కీలక సమయంలో తర్జనభర్జన పడుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా పొత్తులో మూడో కృష్ణుడు బీజేపీ ప్రవేశించింది. బీజేపీని కోరుకున్నది చంద్రబాబునాయుడే. టీడీపీతో పొత్తుకు బీజేపీ ససేమిరా అన్నప్పటికీ.. ఎవరెవరినో బతిమలాడి చివరికి అమిత్‌షాతో అపాయింట్‌మెంట్ దక్కించుకున్నారు.
ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో చంద్రబాబునాయుడు పొత్తుపై చర్చించారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు కానీ, ఆయనలో ఒక్కసారిగా మార్పు. పూర్తిగా మౌన ముని అయ్యారు. అడపాదడపా టీడీపీ ఇన్‌చార్జ్‌లను పిలిపించుకుని మాట్లాడ్డం మినహాయిస్తే, బహిరంగ సభలు నిర్వహించలేదు. శంఖారావం పేరుతో లోకేశ్ జనంలోకి వెళ్లారు.
కానీ చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మాత్రం కీలక సమయంలో పొత్తుల పేరుతో మల్లగుల్లాలు పడుతున్నారు. బీజేపీ భారీ డిమాండ్లను చంద్రబాబు ఉంచిందనే ప్రచారం జరుగుతోంది. పొత్తు పెట్టుకుంటామని బతిమలాడి తనకు తానే చంద్రబాబు బీజేపీ దగ్గరికి వెళ్లడంతో, ఇప్పుడు వారి డిమాండ్లకు అంగీకరించకపోతే ఏమవుతుందో అనే భయం వెంటాడుతోంది. ఒకవేళ బీజేపీని కాదని ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదు.
బీజేపీ-జనసేన కూటమికి 60 అసెంబ్లీ, 10 లోక్‌సభ సీట్లు ఇవ్వాల్సిందే అని అమిత్‌షా షరతు విధించారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అధికారంలో షేర్ కావాలని కూడా అమిత్‌షా తేల్చి చెప్పినట్టు బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇదే నిజమైతే, చంద్రబాబు ఇక టీడీపీని మూసేసుకోవడమే మంచిదని సొంత పార్టీ నేతలు అంటున్న మాట.
పొత్తు అనేది టీడీపీకి రాజకీయంగా లాభం కథ దేవుడెరుగు, శాశ్వతంగా సమాధి కట్టేలా వుందనే ఆందోళన ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో వుంది. చంద్రబాబు చాణక్యుడని, పవన్‌లాంటి వారిని మాయ చేసి, అన్ని సీట్లలో తన వాళ్లనే నిలుపుకుంటారనే ప్రచారం సాగింది. అయితే బీజేపీ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి సీన్ మొత్తం మారిపోతోంది. అమిత్‌షాతో భేటీలో ఏం జరిగిందో చంద్రబాబు బయటికి చెప్పుకోలేని పరిస్థితి. మరోవైపు పవన్‌కల్యాణ్ కూడా దూరంగా వుంటున్నారు. అందుకే పొత్తుపై నీలి నీడలు అలుముకున్నాయి.
మరోవైపు మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికీ కనీసం పది మంది అభ్యర్థులను కూడా ప్రకటించలేని దయనీయ స్థితిలో ప్రతిపక్ష పార్టీలున్నాయి. ఇలాగైతే పొత్తు వల్ల లాభమా? నష్టమా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. పొత్తులో భాగంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్లు ఇస్తారో చూసుకుని, ఆ తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిద్దామనే ఆలోచనలో టీడీపీ, జనసేన నేతలున్నారు.
విడవమంటే పాముకు , కరవమంటే కప్పకు కోపం అనే సామెత చందాన…ఆ రెండు పార్టీల నేతల పరిస్థితి తయారైంది. మొత్తానికి చంద్రబాబు, పవన్ తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిణామాలు ప్రతిపక్షాలను ఏ దరికి చేరుస్తాయో అర్థం అయోమయ రాజకీయం ఏపీలో నెలకుంది.