తపస్సు గురించి పురాణాల కథల్లో చదువుకున్నాం. అదేం ఖర్మో గానీ, ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ నాయకుల ప్రాపకం కోసం తపస్సు చేస్తున్న ప్రాంతీయ పార్టీ అధినేతను చూడాల్సి వచ్చింది. కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీలోనూ, కేంద్రంలోనూ హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దేశ స్థాయిలో బీజేపీ పెద్ద తోపు అయినా, ఏపీకి వచ్చేసరికి అంత సీన్లేదు. కనీసం అరశాతం ఓట్లు కూడా ఆ పార్టీకి లేవు. కానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం లేదు. దీంతో 2024లో కూడా బీజేపీనే అధికారంలోకి వస్తుందనే సానుకూల సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో వైరం అంటే మిగిలిన రాజకీయ పార్టీలు వణికిపోతున్నాయి.
2019లో బీజేపీతో వైరం పెట్టుకుని చావుదెబ్బ తిన్న టీడీపీ, ఆ భయం నుంచి ఇంకా కోలుకోలేదు. మరోవైపు టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ చెబుతున్నా…. ప్రధాన ప్రతిపక్షం మాత్రం ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీకి దగ్గర కావడం వల్లే రానున్న ఎన్నికల్లో వైసీపీని కట్టడి చేయొచ్చనేది టీడీపీ భావన. అందుకే ఛీ కొట్టినా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉండడం.
కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలని వైసీపీ, టీడీపీలను బీజేపీ నేతలు పదేపదే విమర్శిస్తుంటారు. అయినా చీమ కుట్టినట్టు కూడా టీడీపీకి ఉండడం లేదు. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో వైసీపీ పొత్తు ప్రసక్తే వుండదు. ఎందుకంటే వైసీపీకి ప్రధానంగా బీజేపీకి వ్యతిరేక ఓటు బ్యాంకే బలం. అందువల్ల బీజేపీతో పొత్తు పెట్టుకుని మైనార్టీల ఓట్లను వైసీపీ పోగొట్టుకోడానికి సిద్ధంగా లేదు. టీడీపీ పరిస్థితి అలా కాదు. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ కూటమికి జనసేనాని పవన్‌కల్యాణ్ మద్దతు పలికారు.
ఇప్పుడు అదే రీతిలో పొత్తు వుండాలని పవన్ ఆకాంక్ష. నాడు జనసేన ఎన్నికల్లో పాల్గొనలేదు. నేడు పాల్గొంటానంటోంది. అయితే మూడు పార్టీల కలయిక వల్ల టికెట్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తి, వైసీపీ లాభ పడుతుందనే భయం టీడీపీని వెంటాడుతోంది. అలాగని పొత్తు లేకుండా ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొంటాననే ధైర్యం టీడీపీలో లేదు.
అనేక భయాలు, అనుమానాలు వెంటాడుతున్న తరుణంలో ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు బాబు తపస్సు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో ప్రధాని పలకరింపు ఆయనకు ఊరటనిచ్చింది.
అయితే ఈ పలకరింపే రానున్న ఎన్నికల్లో పొత్తుకు పునాది అవుతుందనేది అనుమానమే. ఎందుకంటే టీడీపీ పతనమైతే తప్ప తమ పార్టీకి భవిష్యత్ లేదని బీజేపీ నేతల భావన. దీంతో చంద్రబాబును ఆదరిస్తారనేది కేవలం ప్రచారమే అంటున్నారు.
అయినా చంద్రబాబు మాత్రం ప్రధాని మోదీ, అమిత్‌షాలను ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేస్తూనే వుంటారు. 2024 ఎన్నికలు టీడీపీ భవిష్యత్‌ను తేల్చేవి కాబట్టే ఈ ప్రయాస.