పొత్తు పెట్టుకున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గద్దె దించడం సాధ్యం కాదని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భయపడుతున్నారా? అంటే… ఔననే సమాధానం టీడీపీ, జనసేన శ్రేణుల నుంచి వస్తోంది. అందుకే బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడుతున్నారనే చర్చకు తెరలేచింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, వ్యవస్థల సహాయ సహకారాలు అంది, తద్వారా జగన్‌ను కట్టడి చేయొచ్చని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు.
ఈ కారణంగానే ఏపీలో అరశాతం ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీతో పొత్తు కోసం టీడీపీ, జనసేన వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాయనే చర్చకు తెరలేచింది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో పొత్తు ఉంటేనే చాలా అంశాల్లో ప్రయోజనం వుంటుందని బాబు, పవన్ నమ్ముతున్నారు. బీజేపీతో పొత్తు కుదిరితే కార్పొరేట్ ఫండ్స్ వెల్లువెత్తుతాయని, అలాగే ఓటర్లకు సులువుగా డబ్బు పంపిణీ జరుగుతుందని, కేంద్ర ఎన్నికల సంఘం తోడ్పాటు వుంటుందని, అధికార పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయొచ్చని పవన్, చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
కానీ బీజేపీ నుంచి సానుకూల స్పందన రాకపోవడం, మరోవైపు అభ్యర్థుల ఎంపికపై జాప్యం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. బీజేపీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ కూచుంటే సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం వుందని ఆ రెండు పార్టీల శ్రేణుల మధ్య చర్చ జరుగుతోంది. ఏపీ బీజేపీ నేతలు రెండు రోజులుగా ఎన్నికలకు సమాయత్తం కావడం చూస్తే, ముఖ్యంగా టీడీపీతో పొత్తు పెట్టుకోడానికి ఆసక్తిగా లేనట్టు కనిపిస్తోంది.
జనసేనతో పొత్తు ఉన్నట్టు ఇప్పటికీ ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ జనసేనాని పవన్‌కల్యాణ్ మాత్రం టీడీపీతో సీట్ల అవగాహన కుదుర్చుకోడానికి చర్చలు జరుపుతున్నారు. బీజేపీతో పవన్ ఎలాంటి చర్చలు జరపడం లేదు. ఏపీలో ప్రత్యేక పరిస్థితులున్నాయని, అందుకే టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నామని పవన్ ఇప్పటికే చెప్పారు. అయితే తమతో బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.
తాజా పరిణామాలు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కార్యాలయాలను ప్రారంభించడం చర్చనీయాంశమైంది. ఇవాళ 15 ప్రచార రథాలను కూడా బీజేపీ నేతలు ప్రారంభించారు. దీంతో ఎన్నికలకు సొంతంగానే బీజేపీ సమాయత్తం అవుతున్న సంకేతాలు ఇచ్చినట్టైంది. ఇంకా ఆ పార్టీ తమతో కలిసి వస్తుందని టీడీపీ, జనసేన నాయకులు ఆశతో ఎదురు చూడడం విమర్శలకు దారి తీసింది.
కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ సహకారం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ను చంద్రబాబు, పవన్ ఎదుర్కోలేరనే చర్చకు తెరలేచింది. ఆ భయంతోనే కనీసం అరశాతం ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు, పవన్ తమ స్థాయి దిగజార్చుకుని వారి వెంట పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ప్రజాదరణ ఉంటే వ్యవస్థలతో పనేంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చంద్రబాబుకు మించిన నాయకుడు దేశంలో లేరని, ఆయనకు భయం ఏంటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఓటమికి సాకులు వెతుక్కోడానికే బీజేపీ మద్దతు తమకు లేదని, జగన్‌కు ఉందనే కొత్త ప్రచారాన్ని తెరపైకి తీసుకురాడానికి చంద్రబాబు, పవన్ రెడీ అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.