Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: అంబాజీపేట మ్యారేజి బ్యాండు

మూవీ రివ్యూ: అంబాజీపేట మ్యారేజి బ్యాండు

చిత్రం: అంబాజీపేట మ్యారేజి బ్యాండు 
రేటింగ్: 2.75/5
తారాగణం: సుహాస్, శివాని నాగరం, శరణ్య ప్రదీప్, జగదీష్ ప్రతాప్, నితిన్ ప్రసన్న, గోపరాజు రమణ తదితరులు
కెమెరా: వాజిద్ బేగ్
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: పవన్ కళ్యాణ్
నిర్మాత: ధీరజ్ మొగిలినేని
దర్శకత్వం: దుశ్యంత్ కటికనేని
విడుదల: ఫిబ్రవరి 2, 2024

సుహాస్ అనగానే గుర్తొచ్చే సినిమా "కలర్ ఫోటో". ఇప్పుడీ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు"తో వచ్చాడు. ఎలా ఉందో చెప్పుకుందాం. 

అంబాజీపేటలో మల్లి (సుహాస్) ఒక మ్యారేజి బ్యాండులో పని చెస్తుంటాడు. అతనికి ఒక కవల అక్క పద్మ (శరణ్య). ఆ ఊరికొక పెద్ద (నితిన్ ప్రసన్న) ఉంటాడు. అతని చెల్లెలు లక్ష్మి (శివాని నాగరం). మల్లి, లక్ష్మి ఒకర్నొకరు ఇష్టపడతారు. సహజంగానే అది లక్ష్మి అన్నకి నచ్చదు. కానీ అతని కన్ను మాత్రం పద్మ మీద ఉంటుంది. ఈ ఊరు పెద్దకి, పద్మకి మధ్యన స్కూలు పిల్లల విషయంలో గొడవ జరుగుతుంది. ఆ క్రమంలో అతను పద్మని వివస్త్రని చేసి అవమానిస్తాడు. దానికి మల్లి ఎలా ప్రతీకారం తీర్చుంటాడనేది కథ. 

టైటిల్, పోస్టర్ చూడగానే ఇదేదో పూర్తి స్థాయి హాస్యభరిత చిత్రమనుకుంటే పొరపాటే. ఇది ఒక పల్లెటూరిలో జరిగే పాతకాలపు కథ. ధనిక అగ్రకులం, పేద నిమ్నకులం మధ్యన సాగే సగటు వ్యధాభరిత ప్రేమకథ.

కథావస్తువు పాతదే అయినా కథనాన్ని ఎలాగైనా మలచుకోవచ్చు. ఇక్కడ మాత్రం సీరియస్ టోన్ లోనే నడిపారు మొత్తంగా. పాత్రలన్నీ సహజంగా ప్రవర్తిస్తాయి. 

సుహాస్ నటన చాలా సటిల్ గా, సహజంగా ఉంది. ఎక్కడా అతి లేదు.. అలాగని అండర్ ప్లే కూడా కాదు. సెకండఫ్ లో ఇతని నటన బాగా పండింది. 

శరణ్య కూడా సినిమాకి ప్లస్సయ్యింది. బేలగా కాకుండా మానసికంగా బలంగా ఉండే మహిళ పాత్రలో ఒదిగిపోయింది. 

కొత్త హీరోయిన్ శివానిది కూడా నేపథ్యానికి, కథకి సరిపోయే పాత్ర. 

ఊరి పెద్దగా నితిన్ ప్రసన్న మంచి నటనే కనబరిచాడు. 

సుహాస్ పక్కన కనపడ్డ జగదీష్ కేవలం సైడ్ కిక్ లా కాకుండా ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించాడు. 

గోపరాజు రమణది మాత్రం పూర్తిగా తేలిపోయిన పాత్ర. మంచి నటుడిని పెట్టుకుని సరైన సీన్స్ రాసుకోలేదు. 

ఈ కథనంలో ప్రధానమైన లోపాలు రొటీన్ కథాంశం కావడం, ఇంటెర్వల్ తర్వాత చాలా సేపటి వరకు కథ అక్కడక్కడే తిరగడం. ఎంత సినిమా నిడివి తక్కువగానే ఉన్నా సాగదీసినట్టు అనిపించింది ఇక్కడే. 

అంతకు మించి మిగతాదంతా అద్భుతం అనలేం అలాగని కంప్లైంట్ అయితే ఇవ్వలేం. చెప్పుకోదగ్గ మంచి పాయింట్ ఏంటంటే రెండు గంటల పన్నెండు నిమిషాల్లో ముగిసిపోవడం. 

పాటల్లో "దొంగచూపులే..", "కడుపులో చెరిసగమైన ప్రాణము.." సాహిత్యపరంగా బాగున్నాయి. సంగీత పరంగా ఓకే అనగలం తప్ప కొత్తగా ఉందనిపించలేదు.  

హీరో కాబట్టి అతనికి అతీతశక్తులు, రౌడీల్ని గుద్దితే గాల్లోకి ఎగరడాలు ఉండవు. ఆ హీరోకి ఒక హీరోయిన్ ఉంది కాబట్టి ఫైనల్ గా క్లైమాక్స్ ఇలా ఉండబోతోంది అని ఊహిస్తే, అలా ఉండకుండా మరోలా ఉంటుంది. అది కూడా మెచ్యూర్డ్‌గా. అయితే క్లైమాక్స్ లో విలన్ కి వేసిన శిక్ష మాత్రం వింతగా, సినిమాటిక్ గా ఉంది. అదొక్కటీ మినహాయిస్తే మిగిలిన సినిమా అంతా సహజంగా ఉన్నట్టే. 

లవ్ ట్రాక్ రొటీన్ గా ఉన్నా.. సెలూన్‌లో తలుపేసుకుని హీరో హీరోయిన్ సరసాల సీన్లు మాత్రం ఈ చిత్రాన్ని యువతకి దగ్గర చేయడానికి పెట్టినట్టుంది. 

భూస్వాముల పొగరు.. శిరోముండనాలు, వివస్త్రల్ని చేయడాలు ప్రేక్షకులకి ఉక్రోషం తెప్పిస్తాయి. కానీ చివరికి దానికి ప్రతీకారంగా ఏ స్థాయి శిక్ష వేయాలి అనే దానిపై దర్శకుడు తీసుకున్న నిర్ణయం మాస్ ప్రేక్షకులకి నచ్చపోవచ్చు కానీ క్లాస్ ఆడియన్స్ మెచ్చుకునే విధంగా ఉంది. ప్రాణానికి ప్రాణం తీయడమే సమాధానం కాదని... అన్నీ ఆలోచించి హీరో నిర్ణయం తీసుకోవడం బాగుంది. 

ఊరంతా ఒకటైతే పోలీసు వ్యవస్థ కూడా వాళ్లకి ఎదురెళ్లలేదని చూపించడం పొయెటిక్ గా ఉంది. 

గర్వభంగానికి మించిన శిక్ష ఉండదు. "పద్మపేరు మళ్లీ ఈ ఊరిలో వినిపించదు" అన్న ఊరిపెద్ద పొగరుకి లాస్ట్ సీన్లో హీరోయిన్ చెప్పే సింగిల్ వర్డ్ డైలాగ్ సమాధానంగా నిలుస్తుంది. 

రెండు గంటల పన్నెండు నిమిషాల నిడివి గల ఈ చిత్రం బోర్ కొట్టదు. అయితే కథ పాకాన పడ్డాక అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అదీ ముఖ్యంగా సెకండాఫ్ మొదలయ్యాక... కానీ చివరికి వచ్చే సరికి డైనమిక్స్ మారాయి. మొత్తంగా చూస్తే ఈ సినిమా గొప్పగా అనిపించదు... అలా అని ఎంగేజ్ చేయకుండా ఉండదు. 

కామెడీ ఇంచుకైనా లేని సీరియస్ బ్యాండు ఈ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". 

బాటం లైన్: సీరియస్ బ్యాండు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?