చంద్రబాబు ఎకనామిక్స్‌లో ఏం చదివాడో తెలియదు కానీ, బోటనీ మాత్రం బాగా చదివాడు. ఆయన కరివేపాకును బాగా ఇష్టపడతాడు. దాని సువాసన ఆస్వాదించి, పక్కన పెడతాడు.
రాజకీయ గురువు రాజగోపాలనాయుడు మొదటి కరివేపాకు. ఆయన చలువతోనే వచ్చి, అపోజిషన్ పాలిటిక్స్ నడిపాడు. మంత్రి పదవి ఇచ్చిన అంజయ్యని ఏనాడూ పట్టించుకోలేదు. ఎన్టీఆర్‌కి తొడకొట్టి, పిల్లిలా ఆయన పార్టీలోనే చేరిపోయాడు. అక్కడి నుంచి కరివేపాకు చెట్టుని పెంచడం ప్రారంభించాడు.
ఉపయోగపడేవాళ్లందరినీ చేరదీయడం, అవసరం తీరాక పక్కన పెట్టడం. చిన్నాచితకా వాళ్లు ఎందరో ఉన్నా ప్రముఖంగా బలి అయ్యింది హరికృష్ణ, దగ్గుబాటి. మా నాన్న పదవి నాకు ఇవ్వాలని హరికృష్ణ అడిగితే ఏం జరిగేదో తెలియదు కానీ, ఆయన బాబుని నమ్మాడు. తాత్కాలికంగా రవాణామంత్రి చేసి, పవర్‌కి చెక్ పెట్టాడు. దగ్గుబాటి మరీ అమాయకుడు. బాబు గురించి బాగా తెలిసి కూడా దెబ్బతిన్నాడు. హరికృష్ణకి కొన్నాళ్లైనా పదవి దక్కింది. ఈయనకి ఏమీలేదు.
ఈ బ్యాగ్రౌండ్ తెలిసి కూడా జూనియర్ ఎన్టీఆర్ నమ్మాడు. బాబు టెక్నిక్ అది. ఎన్టీఆర్‌కి ఉన్న ఫాలోయింగ్ చూసి బాబుకి భయం పట్టుకుంది. లోకేశ్ డమ్మీగా మిగిలిపోతాడని అర్థమై ఎన్టీఆర్‌కి కరివేపాకు వడ్డించాడు.
చంద్రబాబు కష్టాల్లో వుంటే అందరూ వచ్చి అతని కోసం పని చేయాలి. వాళ్లు కష్టాల్లో పడితే టచ్ మీ నాట్ అంటాడు. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ రామోజీరావు.
మార్గదర్శి మీద కేసుల గురించి చంద్రబాబు నోరు మెదపడం లేదు. కారణం రామోజీ నిధులు పక్కదారి పట్టించాడని బాబుకి స్పష్టంగా తెలుసు. ఎవరైనా అవినీతిలో ఇరుక్కుంటే బాబు చాలా నిజాయతీగా నిప్పులా వ్యవహరిస్తాడు. అదంతా వాళ్ల ఖర్మ అని గాలికి వదిలేస్తాడు. మార్గదర్శి లొసుగులు ఏమీ లేకపోతే ఈ పాటికి పత్రికా స్వేచ్ఛ, అదీఇదీ అని చంద్రబాబు గగ్గోలు చేసేవాడే. అక్కడ తేడా వుంది కాబట్టే సౌండ్ చేయడం లేదు.
బాబు ఎంత నిప్పు అంటే బ్రీఫ్‌డ్ మీ అని దొరికిపోయిన నిప్పులాంటి నిజాన్ని కూడా మాయం చేసేంత!
బాబు విస్తరిలో ఇంకా ఎన్ని కరివేపాకులు తేలుతాయో వేచి చూడాలి.