ఉమ్మడి ఏపీలో కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు బలోపేతం కాలేకపోయిందంటే.. దానికి కారణం తెలుగుదేశం పార్టీతో పొత్తే అని రాజకీయ విశ్లేషకులు ఎంత లోతు విశ్లేషణ అయినా చేసి చెబుతారు. చంద్రబాబు స్వార్థానికి బీజేపీని ఏపీ నాయకులే బలి చేశారనే విశ్లేషణ బాగా పాతదే.
2014 ఎన్నికల సమయంలో ఈనాడు పత్రికలో ఒక కార్టూన్ ప్రచురితం అయ్యింది. ఆ కార్టూన్ లో చంద్రబాబు నాయుడు శోభనం గదిలో పడక మీద కొత్త పెళ్లికొడుకుగా పెళ్లి కూతురు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఏపీ బీజేపీ పెళ్లికూతరు రూపంలో అలంకారం అయ్యి ఉంటుంది. బీజేపీ నాయకత్వం ఆ పెళ్లి కూతురును బలవంతంగా శోభనం గదిలోకి తోస్తూ ఉంటుంది. పెళ్లి కూతురు వెళ్లడానికి ఇష్టపడనట్టుగా మొహం పెట్టి ఉంటుంది. పెళ్లి కొడుకేమో ఉత్సాహంగా ఉంటాడు. అధిష్టానం వెనుక నుంచి ఆ అమ్మాయిని తోస్తూ ఉంటుంది! చంద్రబాబు చెప్పిన ప్రకారం రాజ్యాంగంతో సమానమైన ఈనాడులో ప్రచురితం అయిన ఈ కార్టూను చాలు దశాబ్దాల పాటు ఏపీ బీజేపీ పరిస్థితి ఏమిటో చెప్పడానికి!
తనకు అవసరం అయినప్పుడు బీజేపీతో చెలిమి చేయడం, అవసరం లేనప్పుడు దాన్ని పక్కన పడేయడం చంద్రబాబుకు కొత్తా కాదు. అవసరం లేదనుకున్నప్పుడు మోడీని చంద్రబాబు నాయుడు ఎలా తిట్టాడో దాస్తే దాగేది కాదు. అలాగే ఇప్పుడు మోడీ ప్రాపకం కోసం పచ్చపార్టీ ఎంత పాకులాడుతోందో కూడా ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. అప్పుడేమో *జగన్ మోడీ రెడ్డి* అంటూ లోకేష్ వాగారు. ఇప్పుడేమో మోడీ దయ కోసం సాష్టాంగపడుతున్నారు. మరి చంద్రబాబు చేతిలో మరోసారి బీజేపీ పావు అవుతుందా, వచ్చే ఎన్నికల్లో కూడా 2014 నాటి కార్టూన్ నే వేసుకునే పరిస్థితి వస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేని అంశమే.
ఆ సంగతలా ఉంటే.. ఇన్నాళ్లూ భారతీయ జనతా పార్టీలో ఆవాసం పొందిన వాళ్లంతా ఇప్పుడు మళ్లీ తిరిగెళ్లిపోయే పనిలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోగానే కొందరు తెలుగుదేశం నేతలు అర్థాంతరంగా భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయారు. అది వారి అవసరార్థం కొందరు, మరికొందరు చంద్రబాబు సూచనల ప్రకారం అనే వార్తలు అప్పుడే వచ్చాయి. చేరిన వారిలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా ఉండటంతో బీజేపీ అవసరం మేరకు అప్పుడు చేర్చుకుంది.
అలాగే కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా సందడిలో సడేమియాగా చేరారు. అయితే వారెక్కడ ఉన్నా చంద్రబాబు అదుపాజ్ఞల ప్రకారమే పని చేశారు. మరి ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతూఉంది. దీంతో వీరు బీజేపీ వాసాన్ని వీడి తిరిగి తెలుగుదేశం వెళ్లిపోయే పని లో ఉన్నట్టున్నారు.
ఇన్నాళ్లూ కాంట్రాక్టులు, బిల్లులు, రాజకీయ ఆశ్రయం కోసం వీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అది కూడా చంద్రబాబు మనుషుల హోదాలో. రేపు పొత్తులూ గట్రా చర్చకు వచ్చినా.. వీరు చంద్రబాబు అనుకూలంగా బీజేపీలో వంత పాడతారు. ఇలాంటి వ్యూహాలు చంద్రబాబుకు కొత్త కాదు. పవన్ కల్యాణ్ ను కూడా ఇదే తరహా వ్యూహంతో చంద్రబాబే బీజేపీ పంచన చేర్చారనే అభిప్రాయాలూ ఉన్నాయి. మరి ఇప్పుడు బీజేపీ దగ్గర పని జరుగుతున్నట్టుగా లేదు.
దీంతో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలూ ఒక్కొక్కరుగా తిరిగి చంద్రబాబు వద్దకు చేరిపోయే సమయం దగ్గరపడుతోందని సమాచారం! మరి చంద్రబాబు అవసరాలకు బీజేపీ ఏదో రకంగా ఉపయోగపడుతూ ఉండాల్సిందేనేమో!