కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కన్నడ సినిమా స్టార్ల వ్యవహారాలు ఆసక్తిదాయకంగా మారాయి. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో సుదీప్ భారతీయ జనతా పార్టీకి జై కొట్టాడు. బీజేపీకి తన మద్దతు అంటూ బాహాటంగా ప్రకటించాడు.
ఇక మరో స్టార్ హీరో దర్శన్ కూడా ఇదే పని చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని గెలిపించాల్సిందిగా దర్శన్ పిలుపును ఇవ్వనున్నాడనే వార్తలూ వచ్చాయి. అయితే ఎందుకో దర్శన్ ఆ పని చేయలేదు. ప్రెస్ మీట్ ను రద్దు చేసుకున్నారు.
మరింతమంది సినిమా వాళ్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. వారిలో సుమలత ఒకరు. మండ్య నుంచి ఎంపీగా ఉన్న సుమలతకు లోక్ సభ ఎన్నికలప్పుడు బీజేపీ మద్దతు పలికింది. దివంగత కన్నడ సూపర్ స్టార్ అంబరీష్ సతీమణిగా సుమలతకు రాజకీయ గుర్తింపు కూడా లభించింది. పాత మైసూరు ప్రాంతంలో అంబరీష్ కు రాజకీయ మద్దతు ఉండేది. వక్కలిక సమూహానికి చెందిన అంబరీష్ కు వక్కలిగులు అధికంగా ఉన్న ఆ ప్రాంతంలో మద్దతు ఉండేది. ఆయన మరణానంతరం సానుభూతిలో సుమలతకు భారీ విజయం లభించింది గత లోక్ సభ ఎన్నికలప్పుడు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఆమె బీజేపీకి మద్దతు పలుకుతున్నారు.
ఇక సినిమాల్లో ట్రై చేసిన కుమారస్వామి తనయుడు నిఖిల్ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. రామనగర నుంచి అతడు ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.
కొన్నాళ్ల పాటు రాజకీయంగా హల్చల్ చేసి మండ్య నుంచి ఎంపీగా కూడా నెగ్గిన నటి రమ్య ప్రస్తుతానికి కామ్ గా ఉన్నారు. కొన్నాళ్ల కిందట రాహుల్ గాంధీ పాదయాత్రలో కనిపించిన రమ్య మళ్లీ కాంగ్రెస్ లో యాక్టివ్ గా లేదు.
ఇక మరికొందరు తారలు కూడా ఈ ఎన్నికల వేడిలో తమ గుర్తింపు కోసం తహతహలాడుతూ ఉన్నారు. ఇక కొన్నేళ్ల కిందట రాజకీయ పార్టీని పెట్టి ఆటో గుర్తును కూడా పొందిన ఉపేంద్ర మాత్రం ఇప్పుడు రాజకీయానికి దూరంగా ఉన్నారు. అనూహ్య పరిస్థితుల్లో తను పెట్టిన పార్టీకి తనే రాజీనామా చేసిన ఉపేంద్ర ఆ తర్వాత మాత్రం మళ్లీ రాజకీయ ప్రకటనలు చేయడం లేదు. ఇక బీజేపీ వ్యతిరేక ప్రకటనలు చేసే ప్రకాష్ రాజ్ ఇటీవల స్పందిస్తూ సుదీప్ తీరును తప్పు పట్టాడు. అయితే కర్ణాటక ఎన్నికల్లో తన దారెటో ఈ కన్నడ నటుడు ఇంకా ప్రకటించలేదు!