ప్రధాని మోదీకి సంబంధించి సర్టిఫికెట్ల గొడవ… అటుతిరిగి, ఇటు తిరిగి తెలంగాణకు వ్యాపించింది. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలవి కూడా ఫేక్ డిగ్రీలే అంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టెన్త్ ప్రశ్న పత్రాల లీకేజీ వెనుక బీజేపీ నేతల హస్తం వుందని ఆధారాలతో సహా నిరూపిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏకంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బీజేపీ నేతలు బండి సంజయ్, ఎంపీ అరవింద్‌పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాలకే కాదు, తెలంగాణలో బండి, అరవింద్‌లకు సంబంధించి కూడా ఫేక్ డిగ్రీలు ఉన్నాయని సంచలన ఆరోపణ చేశారు. బీజేపీ నేతల తాటాకు చప్పుళ్లు, ఉడత ఊపులకు బీఆర్ఎస్ కార్యకర్తలు బెదిరిపోరన్నారు. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ చూపాలని అడిగితే రూ.20 వేలు జరిమానా వేయించారని ఆరోపించారు.
డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను మోదీ చూపాలని బాల్కసుమన్ సవాల్ విసిరారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్ డిగ్రీ సర్టిఫికెట్లు కూడా ఫేక్ అని, త్వరలో వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు. వాళ్లిద్దరూ సభ్యత్వం కోల్పోవడం ఖాయమని బాల్క సుమన్ హెచ్చరించారు. ఇదిలా వుండగా మోదీ ఉన్నత విద్యార్హత సర్టిఫికెట్లపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పోరాటం చేస్తున్నారు. మోదీ డిగ్రీ సర్టిఫికెట్ల కోసం న్యాయ పోరాటం చేస్తున్న కేజ్రీవాల్‌కు జరిమానా విధించినా, తగ్గేదే లే అని ఆయన అంటున్నారు.
రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడంతో ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించిన బీజేపీ ప్రజాప్రతినిధులపై కూడా అలాంటి డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. బీజేపీ నేతలకు చదువుసంద్యల్లేవనే విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.