విమానంలో వికృత ఛేష్టలు ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. మినిమం గ్యాప్స్ లో విమానంలో జరుగుతున్న పిచ్చి పనులు బయటకొస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. తాగిన మైకంలో విమానం ఎమర్జెన్సీ డోర్ ను ఓపెన్ చేయాలని ప్రయత్నించాడు ఓ ప్రయాణికుడు.
ఇండిగో విమానం.. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తోంది. ఉన్నట్టుంది 40 ఏళ్ల ఓ ప్రయాణికుడు సీటు నుంచి లేచాడు. అప్పటికే అతడు తాగి ఉన్నాడు. నేరుగా వెళ్లి విమానం ఎమర్జెన్సీ డోర్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు.
సదరు ప్రయాణికుడు విమానం డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న వెంటనే కొందరు ప్రయాణికులు గట్టిగా అరిచారు. మరికొందరు సిబ్బందిని ఎలర్ట్ చేశారు. వెంటనే విమాన సిబ్బంది అతడ్ని ఆపారు.
విమానం బెంగళూరు చేరిన వెంటనే సదరు పాసింజర్ ను పోలీసులకు అప్పగించింది ఇండిగో. భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అతడు తాగిన మత్తులో చేసినప్పటికీ తప్పు తప్పేనంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడు నిజంగానే తాగిన మైకంలో అలా చేశాడా, లేక విమానాన్ని ప్రమాదానికి గురిచేయడానికి కావాలనే అలా చేశాడా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.