బీజేపీ, బీఆర్ఎస్ మధ్య వైరం రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీని దూరం పెట్టేందుకు తెలంగాణ అధికార పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. తెలంగాణలో రాజకీయంగా పైచేయి సాధించడానికి బీఆర్ఎస్, బీజేపీ ఎత్తుకు పైఎత్తులేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీని బద్నాం చేయడంలో బీఆర్ఎస్ కొంత వరకూ పైచేయి సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడం ద్వారా, ఆ పార్టీని దోషిగా నిలబెట్టడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన వ్యవహారం కావడంతో బీజేపీ కూడా ఆత్మరక్షణలో పడింది. బండి సంజయ్ బెయిల్‌పై వచ్చారు.
ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు. ప్రధానితో కలిసి పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఇష్టపడలేదు. దీంతో మరోసారి ప్రధాని కార్యక్రమానికి సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు.
దీన్ని రాజకీయం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రధాని సభకు సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఇవాళ్టి షెడ్యూల్ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. సీఎం కేసీఆర్ కోసం తాను చాలా ఎదురు చూశానని, ఆయనకు సన్మానం చేసేందుకు శాలువ కూడా తీసుకొచ్చానని బండి సంజయ్ చెప్పడం విశేషం. బండి మాటలు విన్న జనం ….అబ్బో కేసీఆర్‌పై బీజేపీ నేతలకు ఎంత ప్రేమో అని సెటైర్స్ విసురుతున్నారు.