పుష్ప-2 ట్రైలర్‌లో హీరో ఒక రాబిన్‌హుడ్‌గా పేదలకి సాయం చేస్తూ వుంటాడని అర్థమైంది. అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే తప్పించుకునే క్రమంలో పోలీసులు కాలుస్తారు. చనిపోయాడని అనుకుంటున్నప్పుడు పులి సైతం బెదిరిపోయే పుష్ప బతికి వున్నాడని తెలుస్తుంది. ఒక రకంగా కథంతా చెప్పేసినట్టే. కథ కంటే సుకుమార్ మేకింగే కీలకం కాబట్టి పుష్ప-2లో ఏదో అద్భుతం చేస్తాడని ఆశిద్దాం.
అయితే పుష్ప మాదిరి నిజ జీవితంలో ప్రజల మనసుని చూరగొన్న ఎర్ర స్మగ్లర్ ఒక్కడు కూడా లేడు. తిరుపతిలో 20 ఏళ్లు జర్నలిస్టుగా పని చేశాను. నాకు తెలిసి ఎర్రచందనం స్మగ్లర్ నెట్ వర్క్ వేరుగా వుండేది. వాళ్లు స్థానికుల్ని ఎక్కువ నమ్మేవాళ్లు కాదు. తమిళనాడు నుంచి భక్తుల రూపంలో కూలీలు వస్తారు. వాళ్లని శేషాచలం అడవుల్లో ఉంచి చెట్లు కొట్టిస్తారు. అక్కడి నుంచి మద్రాస్ పోర్టు వరకూ అంచెలంచెలుగా సరుకు తరలిస్తారు.
రియల్ లైఫ్‌లో పుష్ప ఎదగకపోవడానికి కారణం రాజకీయ నాయకులు. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ మనుషులు ఎర్ర చందనం దందా నడిపిస్తారు. చిన్న నాయకుడి నుంచి , పెద్ద నాయకుడి వరకూ డబ్బులు నడుస్తాయి. రాజకీయం అండ వుంటేనే పోలీస్, ఫారెస్ట్‌శాఖలు మాట వింటాయి. నిజానికి ఫారెస్ట్ వాళ్లు సాయం కోరితేనే పోలీసులు వెళ్లాలి. నేరుగా అడవుల్లోకి పోలీసులు వెళ్లరు. అటవీ ఉత్పత్తుల సంరక్షణ వారి పరిధి కాదు. అటవీ సిబ్బందితో ఆయుధాలు వుండవు కాబట్టి, కొన్ని సార్లు పోలీసుల సాయం కోరుతారు.
ఈ రెండు శాఖలకి లోకల్ లీడర్ల ద్వారా ముడుపులు అందుతాయి. మాట వినని అధికారులని బదిలీ చేయిస్తారు. సినిమాలో చూపించినట్టు ఎస్పీ దగ్గరికి పుష్ప వెళ్లే సీన్ వుండదు. సీఐ స్థాయిని దాటి వెళ్లలేరు. కారణం ఏమంటే స్మగ్లర్లు ఎక్కువ ఎదగడం రాజకీయ నాయకులకి ఇష్టం వుండదు. ఎన్నికల సమయంలో వాళ్ల డబ్బు కావాలి కానీ, వాడే పోటీగా వచ్చేంత వుండకూడదు. ఎవడైనా ఎక్కువ ఓవర్ చేస్తే వాడి సరుకు పట్టుబడుతుంది. అయినా అతి చేస్తే ఎత్తి లోపల వేస్తారు.
ప్రభుత్వాలు మారినప్పుడు , అధికార పార్టీ స్మగ్లర్లు రంగంలోకి వస్తారు. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు తెర వెనక్కి వెళ్లి ఐదేళ్లు పనులు ఆపేస్తారు. ప్రభుత్వం మారితే కొందరు జైలుకి, కొందరు జైలు నుంచి బయటికి కూడా వస్తారు.
పోలీస్ కేసుల్లో ఎక్కువగా అరెస్ట్ అయ్యేది తమిళ కూలీలు. వాళ్లని విడిపించడానికి లాయర్లు కూడా సిద్ధంగా వుంటారు. గతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది తమిళ కూలీలే. పెద్ద తలకాయలు లేదా వాళ్ల మనుషుల్ని ఒకట్రెండు సార్లు అరెస్ట్ చేశారు తప్ప , ఎన్‌కౌంటర్ వరకూ వెళ్లలేదు.
పుష్ప సినిమాలో ఎదుగుతాడు కానీ, నిజంగా కాదు. పాలిటిక్స్, పోలీస్, ఫారెస్ట్ ఈ మూడింటిని పుష్ప దాటి వెళ్లలేడు. పుష్పని చూసి పులి తగ్గొచ్చు కానీ, పుష్ప మాత్రం ఈ మూడు పులుల్ని చూసి తగ్గాల్సిందే. తగ్గేదే లే అంటే కుదరదు.
జీఆర్ మహర్షి