తనకు ప్రాణహాని వుందంటూ చంద్రబాబు లేఖ. అంతకు ముందు ఆరోగ్యం అస్సలు బాలేదంటూ హడావుడి. ఇదంతా ఎందుకోసం? జైలు నుంచి బయటపడడానికి బెయిలు రావడానికి ఎన్ని అడ్డంకులు వస్తున్నాయో అన్నీ వస్తున్నాయి. ఇక మరో గత్యంతరం లేదు. ఆరోగ్యం బాగాలేదంటే ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్లిపోవచ్చు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు దాదాపు తమ వాళ్లవే కనుక ఇక ఏ సమస్య వుండదు. కానీ అక్కడ కూడా అనుమానం. నడుం దాకా దద్దుర్లు వస్తే ఆసుపత్రికి తరలిస్తారా? కంటి ఆపరేషన్ అంటే ప్రైవేట్ ఆసుపత్రికి మారుస్తారా? అని. అందుకే కావచ్చు. తనకు ప్రాణహాని అంటూ మరో హడావుడి.
నిజానికి ఈ టైమ్ లో చంద్రబాబును అరెస్ట్ చేయడమే జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం అని అంతా అనుకుంటున్నారు. ఎన్నికల వేళ సింపతీ వస్తుందేమో అన్న భయం లేకుండా జగన్ ముందుకు వెళ్లిపోయారు. దాని వల్ల జగన్ పని అయిపోయిందని తెలుగుదేశం సామాజిక జనాలు సంబరపడిపోయారు. కానీ అది ఎన్నాళ్లో నిలవలేదు. బాబు గారి కోసం తెలుగుదేశం శ్రేణులు రొడ్డెక్కలేదు. అందుకే జనసేనను అర్జంట్ గా దోస్తానా చేసుకున్నారు. కొత్తగా రాజకీయాల్లో హుషారుగా వున్నారు కదా, వాళ్ల చేతికే పచ్చ జెండాలు కూడా నాలుగు ఇస్తే ఓ పనైపోతుంది అని ఎత్తుగడ వేసారు.
కానీ ఈ లోగానే ఈ ప్రాణభయం లేఖ ఎందుకు? ఈ లెక్కన జైలులో ప్రతి ఖైదీ ఏవో నాలుగు సాకులు చూపించి కోర్టుకు లేఖ రాయచ్చు. చంద్రబాబును అందరితో కలిపి వుంచలేదు. కేవలం ఓ వార్డ్ కు పరిమితం చేయలేదు. ఓ బ్యారెక్స్ మొత్తం ఆయనకే కేటాయించారు. మామూలు ఖైదీలు అయితే అదే బ్యారెక్స్ లో పదుల కొద్దీ వుంటారు. రాజకీయ ఖైదీగా ఆయనకు రావాల్సిన సదుపాయాలు అన్నీ వుంచారు. మామూలు ఖైదీలు ఎవ్వరూ ఆయన దరిదాపుల్లోకి రాలేరు. కట్టుదిట్టమైన భద్రత వుంటుంది.
అవన్నీ పక్కన పెడితే ఈ టైమ్ లో, చంద్రబాబు కు ప్రాణహాని ఎవరన్నా తలపెడతారా? ముఖ్యంగా ఈ ఎన్నికల టైమ్ లో ఎంత కమోషన్ వస్తుంది. అది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కు దారితీసినా తీయచ్చు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసినా చేయచ్చు. అందువల్ల ఈ టైమ్ లో చంద్రబాబు ప్రాణహాని తలపెట్టే పని మెడమీద తలకాయ వున్నవాడు ఎవ్వరూ చేయరు. ఎవరైనా చేసి ఆ పాపం జగన్ మీదో, వైకాపా మీదో నెట్టేయాలి తప్ప మరోటి కాదు.
కానీ చంద్రబాబు మరి ఎందుకిలా లేఖ రాసారు..సింపుల్
అరెస్ట్ చేయండి అంటూ సవాళ్లు విసిరారు. చేసారు
పోరాడండి అంటూ పిలుపు ఇచ్చారు. కానీ ఎవ్వరూ పోరాడలేదు
సింపతీ వస్తుందని తెగ కిందా మీదా పడ్డారు. అలాంటి జాడ కనిపించలేదు.
ఇక ఇలా కాదని భార్య ను రంగంలోకి దింపారు కానీ అదీ పనికి వచ్చే ప్లాన్ లా కనిపించలేదు.
తాను ఇలా లోపల వుండిపోతే పార్టీకి దిక్కు దివాణం వుండదని ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
తనను బయటకు తేవడం తన వాళ్ల వల్ల కాదు అనే నమ్మకం వచ్చేసింది.
అందుకే తన వంతు ప్లాన్ లు తను వేస్తున్నారు.
ఫలిస్తాయా? ఏమో? డవుటే.