Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఆయన పాలిటిక్స్ లో ఉన్నాడంటే ఉన్నాడు... లేడంటే లేడు

ఆయన పాలిటిక్స్ లో ఉన్నాడంటే ఉన్నాడు... లేడంటే లేడు

మెగా స్టార్ పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. ఆయన జోరుగా సినిమాలు చేస్తున్న సమయంలో ఉమ్మడి ఏపీకి సీఎం కావాలనే ఆశ పుట్టింది. తాను మెగా స్టార్ ని కాబట్టి సీఎం కావడం చాలా ఈజీ అనుకున్నాడు. ఇంత ఇమేజ్ ఉన్న తాను వేరే పార్టీలో చేరడమేమిటని ఆనుకొని తానే ఒక పార్టీ పెట్టుకున్నాడు. దానికి ప్రజారాజ్యం అని పేరు పెట్టాడు. యేవో ఆదర్శాలు, ఆశయాలు వల్లించాడు. పెద్దపెద్ద మాటలు మాట్లాడాడు. ఎన్నికల్లో పోటీకి దిగాడు. కానీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదు.

కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ట్రాప్ లో పడేసింది. ఇలా సొంత పార్టీ పెట్టుకొని కిందా మీదా పడటంకంటే పార్టీని మా పార్టీలో విలీనం చేసేయ్. నీకు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని ఆ పార్టీ పెద్దలు ప్రలోభ పెట్టారు. మెగా స్టార్ ఆలోచించాడు. పార్టీని నడపడం ఆర్ధికంగా భారం అనుకున్నాడు. అనేక తలనొప్పులు వస్తాయనుకున్నాడు. ఈ చికాకులు భరించడం కష్టమనుకున్నాడు. యూపీఏ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా చేరిపోయాడు. పార్టీని ఎత్తేశాడు. కానీ ఈ తరువాత జరిగిన పరిణామాల్లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది.

తెలంగాణా ఏర్పడింది. ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసుకున్న మెగా స్టార్ తనకు కూడు పెట్టేవి సినిమాలేగానే పాలిటిక్స్ కాదని ఆనుకొని ఆ బురదను డెట్టాల్ తో కడుక్కొని బయటకు వచ్చాడు. మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. మెగా స్టార్ ఇమేజ్ కారణంగా మళ్ళీ పుంజుకున్నాడు. సినిమాలకు అంకితం అయ్యాడు. 

రాజకీయాల బురదను మెగా స్టార్ వదిలించుకున్న తరువాత ఆయన తమ్ముడు పవర్ స్టార్ పూసుకున్నాడు. ఆయన గత పదేళ్లుగా కిందా మీదా పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఏపీలో పచ్చ పార్టీతో, కాషాయంతో కలిసి ఎన్నికల బరిలో ఉన్నాడు. ఆయన అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. మరి మెగా స్టార్ చిత్రమైన పరిస్థితి ఏమిటి అంటారా? ఆయన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్పుకోవచ్చు. లేడంటే లేడని చెప్పుకోవచ్చు. ఇలా ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాంకేతికంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. రాజకీయపరంగా లేడు. ఈ చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ...మెగా స్టార్ తమ్ముడు పవర్ స్టార్ పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చాడు.

మెగా స్టార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండి వేరే పార్టీకి విరాళం ఇవ్వడం ఏమిటనే చర్చ మొదలైంది. తమ్ముడి పార్టీకి ఆర్ధిక సాయం చేశాడు తప్ప నోటి (ప్రచారం) సాయం చేయడని అంటున్నారు. ఇంతలో ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఎంటరై మెగా స్టార్ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడే అని చెప్పాడు. ఆయన పొలిటికల్ గా యాక్టివ్  లేడుగానీ మా పార్టీలోనే ఉన్నాడని చెప్పాడు. ఆయన తన తమ్ముడి పార్టీకి ప్రచారం చేయబోడని అన్నాడు.

ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో అప్పటినుంచి మెగా స్టార్ పాలిటిక్స్ మాట్లాడటం లేదు. ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ చేయడం లేదు. ఏపీ సీఎం జగన్ ను కలిసినా, తెలంగాణా సీఎంను కలిసినా సినిమా సమస్యల గురించే మాట్లాడాడు.  ఎందుకో తెలియదుగానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రాజీనామా చేయలేదు. అందుకే కాంగ్రెస్ నాయకులు మెగాస్టార్ ఇప్పటికీ తమ పార్టీ నాయకుడనే చెప్పుకుంటారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మెగాస్టార్ ను అధ్యక్షుడిగా చేస్తారనే ప్రచారం ఒకప్పుడు జరిగింది. బీజేపీ వాళ్ళు కూడా ఆయన్ని గుంజుకోవాలని ట్రై చేశారని అంటారు. కానీ ఆయన దేనికీ స్పందించలేదు.

తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా  రాజకీయాలు తనను వదలడంలేదని గతంలో ఒకసారి చెప్పాడు. 2022 లో ఆయన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏపీ పీసీసీ కమిటీ ప్రతినిధిగా ఖరారు చేసింది. ఆయనకు ఐడీ కార్డు కూడా జారీ చేసింది. ఆయన తన రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం పూర్తయ్యాక రాజకీయాలకు దూరంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకపోవడంతో ఆయన్ని ఇంకా కాంగ్రెస్ సభ్యుడిగానే పరిగణిస్తున్నారు. అదీ కథ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?