సంక్షేమ పాలనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రథ సారథి అనే పేరు తెచ్చుకున్నారు. ఇదే సందర్భంలో ఒక వర్గం సంక్షేమ పాలనను వ్యతిరేకిస్తూ తీవ్ర విమర్శల్ని నిత్యం గుప్పిస్తోంది. జగన్ సంక్షేమ పాలనకు ఏ మేరకు ఆమోదం లభిస్తుందో రానున్న ఎన్నికల్లో తేలనుంది. అయితే వ్యతిరేకించే వారి గళాలు మాత్రం గట్టిగా సౌండ్ చేస్తున్నాయి.
జగన్‌పై జనంలో వ్యతిరేకత నింపి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కొందరు మేధావుల్ని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో వారితో లైవ్ డిబేట్లు నిర్వహిస్తూ, డబ్బులు పంచి పెడితే సంక్షేమం అవుతుందా? అంటూ పరోక్షంగా జగన్ సర్కార్ చేస్తున్నది తప్పు అని చెబుతున్నారు. సంక్షేమ పాలనతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగనే పాలకుడిగా కొనసాగితే పిల్లలకు భవిష్యత్ వుండదంటూ హెచ్చరిస్తూ, భయపెడుతూ, వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసేందుకు తమ వంతు ప్రయత్నాల్ని వేగవంతం చేయడాన్ని గమనించొచ్చు. సంక్షేమ పాలనను వ్యతిరేకించకూడదనే నియమం ఏదీ లేదు. అయితే దీనిమీదే నిలబడి ఎన్నికల్లో ప్రచారం చేస్తే… అంతిమంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు.
అదేంటో గానీ, కూటమి మేధావులు జయప్రకాశ్ నారాయణ్, ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు… జగన్ కంటే ఎక్కువ సంక్షేమ లబ్ధి కలిగిస్తామని చెబుతుంటే మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. ఎల్లో మీడియా, కూటమి అనుకూల మేధావుల తీరు గమనిస్తే… సూపర్ సిక్స్, వీటికి తోడుగా మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామనే చంద్రబాబు మాటలు నమ్మశక్యంగా లేవు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా… చంద్రబాబును ఆదరిస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలన్నీ రద్దు అవుతాయనే అనుమానం కలుగుతోంది. కూటమి మేధావుల సంక్షేమ పాలనకు వ్యతిరేక ప్రచారంతో, చివరికి తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారు. జగన్ కంటే రెట్టింపు సంక్షేమ ప్రయోజనాల్ని కలిగిస్తామంటే, అప్పుడు మాత్రం రాష్ట్రం అప్పుల కుప్ప కాకుండా ఎలా వుంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాగే పిల్లలకు భవిష్యత్ ఎలా వుంటుందో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై వుంది.
చంద్రబాబు సూపర్ సిక్స్ సంగతేమో గానీ, సూపర్ ఛీటింగ్ అనే అభిప్రాయం కలుగుతోంది. జగన్‌ను గద్దె దించితే, ఆ తర్వాత అధికారంలోకి వస్తే అడిగే వారెవరనే ధీమా చంద్రబాబులో కనిపిస్తోంది. అంతే తప్ప, సంక్షేమ పథకాలంటూ చంద్రబాబు చెబుతున్నవేవీ అమలు అయ్యేలా లేవు. సంక్షేమ పాలనకు కూటమి మేధావులు వ్యతిరేకమైతే, చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ తదితర పథకాలను కూడా బహిరంగంగా వ్యతిరేకించాలి.
కానీ ఒక్కటి మాత్రం నిజం… చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తారని ముద్రపడ్డ జయప్రకాశ్ నారాయణ్, ఎల్వీ సుబ్రమణ్యం, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తదితరుల చేష్టల వల్ల అంతిమంగా మూల్యం చెల్లించుకోవాల్సింది కూటమే. కావున వారిని అడ్డం పెట్టుకుని జగన్‌ను రాజకీయంగా ఏదో చేయాలనే ఆత్రుతలో తమ మీదికి సమస్య తెచ్చుకోకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది.