ఆంధ్ర సిఎమ్ జగన్ తాను అనుకున్నట్లు మూడు రాజధానుల కార్యక్రమాన్ని అమలు చేయలేకపోతున్నారు. దీనికి చాలా అంటే చాలా కారణాలు వున్నాయి. ఉద్యమాలు, కోర్టు కేసులు, ఇంకా ఇంకా చాలా అంటే చాలా.. వీటిని పక్కన పెడితే నిజంగా సిఎమ్ జగన్ కు చిత్తశుద్ది వుందా? మూడు రాజధానులు అనే విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారా? అన్నది కూడా అనుమానంగానే వుంది.
ఎందుకంటే రాజధాని ఏర్పాటు అంటే కోర్టు పరిథిలో వుండి వుండోచ్చు కానీ విశాఖ నుంచి పాలించడం అన్నదాన్ని ఎవరు అడ్డుకోలేదు కదా?
నిజంగా జగన్ కు విశాఖ మీద అంత ప్రేమ వుంటే నెలకు వారం రోజులు విశాఖలో క్యాంప్ ఆఫీసు ఎందుకు పెట్టకూడదు? విశాఖలో కూర్చుని ఎందుకు పాలించకూడదు? ఎవరు వద్దన్నారు. పైగా ఇలా చేయడం వల్ల చాలా లాభాలు వున్నాయి. కానీ జగన్ మాత్రం ఆ దిశగా ఆలోచిస్తున్నట్ల కనిపించడం లేదు. దీని వల్ల విశాఖ రాజధాని అనే అంశం మీద సిఎమ్ చిత్తశుద్దిని కూడా శంకించాల్సి వస్తోంది.
విశాఖ నుంచి పాలించాలన్నా, విశాఖలో వుండాలన్న స్వంత ఇల్లు వుండి తీరాలనే సైకలాజికల్ థాట్ ఏదో జగన్ కు వున్నట్లుంది. అందుకే ఆయన స్వంత ఇంటి కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం దగ్గుబాటి సురేష్ బాబు తో జగన్ మనుషులు డిస్కషన్లు కూడా సాగిస్తున్నారని బోగట్టా. ఇల్లు సెట్ అయ్యే వరకు జగన్ వైజాగ్ రారేమో?
నిజానికి జగన్ కనుక విశాఖలో ప్రతి నెలా వారం రోజులు వుంటే ఉత్తరాంధ్ర వాసుల్లో రాజధాని భావన బలపడుతుంది. ఎప్పుడయితే సిఎమ్ విశాఖలో వుంటారో, మొత్తం అధికార బృందం, మంత్రి బృందం కూడా వారం రోజులు విశాఖ తరలి వస్తుంది. అప్పుడు విశాఖకు వుండే కళే వేరు.
ఇలా చేయడానికి అయితే లీగల్ గా ఎటువంటి అడ్డంకులు లేవు. ఎందుకంటే సిఎమ్ ఎక్కడ వుండాలనుకుంటే అక్కడ వుండొచ్చు. తెలంగాణ సిఎమ్ కేసిఆర్ తన ఫార్మ్ హవుస్ నుంచే పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికైనా జగన్ ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. లేదూ అంటే ఇదంతా కేవలం ఓట్ల కోసం ఆడే రాజకీయం అనే అభిప్రాయం సర్వత్రా బలపడే ప్రమాదం వుంది.