గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో మీడియా గురించి మెగాస్టార్ కాస్త మాట్లాడారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ అయితే నిందలు, నిష్టూరాలు కూడా వేసారు. సినిమా విడుదలకు ముందు సరైన ప్లానింగ్, పబ్లిసిటీ లేదని, బజ్ లేదని మీడియాలో కథనాలు వచ్చిన మాట వాస్తవం. దానికి కొంత వరకు యూనిట్ ది కూడా బాధ్యత వుంది.
సల్మాన్…చిరు పాట విడుదల చేయడంలో తడబాటు, ఆ తరువాత కంటెంట్ వదలడంలో ఇబ్బందులు అన్నీ కలిసి ఇలాంటి కథనాలకు దారితీసాయి. నిజానికి సరైన టైమ్ కు సినిమా రెడీ చేయడంలో యూనిట్ బాధ యూనిట్ ది.
ఒక దశలో నిర్మాత ఎన్వీ ప్రసాద్ స్నేహితుడు టాగోర్ మధు, సినిమాతో సంబంధం లేకపోయినా, చోటా కే నాయుడును తీసుకెళ్లి ముంబాయిలో రెండు రోజుల్లో పాట చిత్రీకరించుకుని వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో రకరకాల వార్తలు వచ్చినా, సినిమా విడుదలయిన తరువాత మీడియా సంస్థలు అన్నీ దాదాపుగా జెన్యూన్ రివ్యూలే ఇచ్చాయి. కానీ కొన్ని మీడియా సంస్థల నుంచి సినిమాకు కాస్త నెగిటివ్ ఫీడింగ్ వచ్చింది.
దీంతో ఇప్పుడు మెగాస్టార్ పరిస్థితిని చక్కదిద్దడానికి నడుం బిగించినట్లు కనిపిస్తోంది. నెగిటివ్ గా వున్న మీడియా సంస్థల ప్రతినిధులను పిలిచి, మాట్లాడి, సమస్య ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి పట్ల, ఆయన సినిమాల పట్ల తమకు నెగిటివ్ థాట్ ఏమీ లేదని, తమ మేనేజ్ మెంట్ లకు అసలే లేదని, జస్ట్ కొన్ని సార్లు అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద గాడ్ ఫాదర్ ముందు, వెనుక మీడియా విషయంలో మెగాస్టార్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.