ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల సీజన్ నడుస్తోంది. షెడ్యూలును కూడా ప్రకటించేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఎమ్మెల్యేల బలాబలాలను పరిశీలిస్తే.. చాలా స్పష్టంగానే ఫలితాలు వస్తాయని అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని గమనిస్తే రెండు రాష్ట్రాల్లో కూడా క్రాస్ ఓటింగ్ అనివార్యంగా ఉంటుందనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.
తమాషా ఏంటంటే.. రెండు రాష్ట్రాల్లోనూ క్రాస్ ఓటింగ్ అనేది రెండు వేర్వేరురూపాల్లో ఉండనుంది. ఏపీలో అధికార పార్టీనుంచి విపక్షానికి క్రాస్ ఓటింగ్ జరిగే చాన్సుండగా, తెలంగాణలో విపక్షం నుంచి అధికార పార్టీకి క్రాస్ ఓటింగ్ జరగవచ్చునని అంచనా వేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడేసి రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బలాల ప్రకారం- ఏపీలో ఉన్న మూడు స్థానాలను కూడా అధికార వైసీపీ దక్కించుకోవాలి. అలాగే, తెలంగాణలో మూడింటిలో కాంగ్రెసుకు రెండు, భారాసకు ఒకటి దక్కే అవకాశం ఉంది. రెండుచోట్ల ముగ్గురేసి అభ్యర్థులు మాత్రమే బరిలో ఉంటే ఇక క్రాస్ ఓటింగ్ అనే మాట ఉత్పన్నం కాదు.
కానీ ఏపీలో తెలుగుదేశం కూడా అభ్యర్థిని మోహరించే ఉద్దేశంతో ఉంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పు చేర్పుల పర్యవసానంగా పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వారి ఓట్లన్నీ తమకు అనుకూలంగా పడతాయని తెలుగుదేశం ఆశపడుతోంది.
వైసీపీ నుంచి ఆల్రెడీ బయటకు వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ సమయంలో టికెట్ల కారణంగా కొత్తగా అసంతృప్తి ఫీలవుతున్న వారు ఇంకా చాలా మంది ఉన్నారు. వీరిమీద ఇప్పటి దాకా ఫిరాయింపు ఫిర్యాదులు కూడా స్పీకరుకు చేరనేలేదు. ఈ నేపథ్యంలో వారు అందరూ కచ్చితంగా ఓటింగ్ వరకు పదవిలోనే ఉంటారు. అలాంటి వారందరూ కూడా.. తెలుగుదేశం అభ్యర్థిని మోహరిస్తే వారికి వేసే అవకాశం ఉంది. ఆ రకంగా ఇప్పటికే అసంతృప్తిని బయటపెట్టిన ఎమ్మెల్యేలు కొందరుండగా.. లోలోపల ఉడికిపోతూ.. జగన్ మీద ఆగ్రహంతో రగులుతున్నవారు ఇంకా కొందరున్నారు. అలాంటి వారు కూడా క్రాస్ ఓటింగ్ కు పాల్పడే అవకాశం ఉంది.
తెలంగాణ విషయానికి వస్తే.. భారాస ఎమ్మెల్యేలు పలువురు అధికార కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు. వీరు త్వరలోనే ఆ పార్టీలోకి ఫిరాయిస్తారనే పుకార్లు కూడా ఉన్నాయి. అసలు పార్లమెంటు ఎన్నికల తర్వాత.. భారాస ఖాళీ అవుతుందని, ఆ పార్టీనుంచి 30 మంది వరకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉన్నదని ఆ పార్టీ మంత్రులు చెబుతున్నారు.
30 అనేది అతిశయమైన సంఖ్య అయినప్పటికీ.. ఫిరాయింపులు ఖచ్చితంగా ఉంటాయి. వారందరూ కూడా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేయవచ్చు. అయితే.. అధికార పార్టీ మూడో అభ్యర్థిని మోహరిస్తే మాత్రమే ఇదంతా జరుగుతుంది. భారాసకు బలంగా గణనీయంగానే ఉన్న నేపథ్యంలో.. ఎంఐఎం మద్దతు కూడా వారికి ఉంటుందని అనుకుంటుండగా.. కాంగ్రెస్ అసలు మూడో అభ్యర్థిని బరిలో పెడుతుందా? లేదా? అనేది ప్రశ్న!