‘సంకేతాలు’ జగన్ కు ఇప్పుడే గుర్తుకొచ్చాయా

పార్టీలో ఏదైనా కీలక పరిణామం జరిగినప్పుడు ప్రజలు దానిని రకరకాలుగా అర్థం చేసుకుంటారు. అందువలన పార్టీ అధినాయకుడు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా అపార్థాలకు తావులేకుండా జాగ్రత్త పడాల్సి…

పార్టీలో ఏదైనా కీలక పరిణామం జరిగినప్పుడు ప్రజలు దానిని రకరకాలుగా అర్థం చేసుకుంటారు. అందువలన పార్టీ అధినాయకుడు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా అపార్థాలకు తావులేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అలకపూనిన వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. 

మూడు జిల్లాల పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన తర్వాత.. జగన్ చెప్పినా కూడా.. తాను ఆ బాధ్యతలు చూడలేనని సొంత నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి ఉందని బాలినేని సున్నితంగా తిరస్కరించారు. ఈ సందర్భంగా.. బాలినేని రాజీనామా కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని జగన్ ఆయనతో అనడం విశేషం.

ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డికి బాలినేని విషయంలో మాత్రమే తప్పుడు సంకేతాలు కనిపిస్తున్నాయా? పార్టీ పరువు పోయేలా ఇతరత్రా పరిణామాలేమీద పార్టీలో ఆయనకు కనిపించడం లేదా? అనే సందేహం పలువురిలో తలెత్తుతోంది.

బాలినేని వ్యవహారంలో మాత్రం కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళతాయని అంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక అనేక నియోజకవర్గాలలో సొంత పార్టీ వారు ముఠాలుగా విడిపోయి కుమ్ములాడుకుంటున్నా గమనించడంలేదు. సొంత పార్టీ నాయకులే ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకుంటూ ఉన్నప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదు. అలాంటి పరిణామాలు కూడా కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు తీసుకువెళతాయని జగన్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు.. అనేది ప్రజల సందేహం. 

పార్టీ అధినాయకుడి గా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే ప్రతి విషయంలోనూ తాను జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని సర్ది చెప్పాలని విభేదాలను కొట్లాటలను శాంతింపజేయాలని బుజ్జగింపజేయాలని జగన్ ఎందుకు అనుకోవడం లేదో కార్యకర్తలకు అర్థం కాని సంగతి. 

చాలా నియోజకవర్గాల్లో పార్టీ పరువు తీసే వ్యవహారాలను జగన్, ఇతర నాయకుల మీద వదిలేసి తాను వేలుపెట్టకుండా మిన్నకుండిపోతున్నారు. ఫలితంగా చాలా చోట్ల విభేదాలు ఒకకొలిక్కి రావడం లేదు. 

రావణకాష్టంలా రగులుతున్నాయి. చాలా చోట్ల నాయకుల్లో ఉన్న అసంతృప్తులను స్వయంగా కనీసమాత్రంగా కూడా పట్టించుకోకుండా..  బాలినేని వ్యవహారాన్ని మాత్రం సద్దుమణిగేలా చేయడానికి జగన్ స్వయంగా పూనుకోవడం కూడా కార్యకర్తలకు ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు పంపుతుంది. 

పార్టీకి ఇవి ప్రమాదకర పరిణామాలు కాకుండా ఉంటాయా అని పలువురు విశ్లేషిస్తున్నారు. పార్టీకి చేటు చేసే వ్యవహారాలను పార్టీ అధినాయకుడు స్వయంగా సర్దుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.