దక్షిణభారతదేశంలో మూఢనమ్మకాల స్థాయి కాస్త ఎక్కువగా ఉండే రాష్ట్రం కర్ణాటక. స్వామీజీలు, మఠాధిపతులు ప్రమేయం కర్ణాటక రాజకీయాలపైనే ఉంది! వీరంతా ప్రజలను ప్రభావితం చేస్తారని, వీరు చెప్పిన వారికి ప్రజలు ఓటేస్తారని రాజకీయ నేతలు కూడా కర్ణాటకలోని మఠాధిపతులకు పెద్ద పీటలు వేస్తారు. గతంలో కాంగ్రెస్ వారైనా, ఇప్పుడు బీజేపీ వాళ్లైనా.. మఠాధిపతులంటే చాలా గౌరవం ఇచ్చేస్తారు. మఠాధిపతులు, కాషాయధారులు కూడా రాజకీయాలను ప్రభావితం చేసేందుకు తెగ ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి కర్ణాటకలో మకాం పెట్టిన స్వామీ నిత్యానంద వ్యవహారాన్ని గత దశాబ్దం పై నుంచినే ప్రజలంతా గమనిస్తున్నారు. అది వేరే కథ.
ఇక నమ్మకాలకూ ఎక్కువ విలువను ఇచ్చే కర్ణాటకలో స్త్రీలంటే కూడా వివక్ష ఎక్కువ! ఇండియాలో ఎక్కడైనా ఇంతే కావొచ్చు. అయితే కన్నడీగులు తమకు నచ్చని స్త్రీలపై సామాజిక మాధ్యమాల ద్వారా చేసే దాడులు మాత్రం గట్టిగా ఉన్నాయి. బాహాటంగా స్త్రీలపై ఈ తరహా వ్యవహరణ తీరు ఏ మాత్రం సమంజసం అనిపించదు. హీరోయిన్ అయినా తమకు నచ్చినట్టుగా, తాము చెప్పినట్టుగా వ్యవహరించాలనే తీరున కన్నడీగుల స్పందన చోద్యంగా అనిపిస్తుంది.
దాదాపు పదేళ్ల కిందట.. ఒక హీరోయిన్ పై కన్నడీగులకు కోపం వచ్చింది. అంతే వారు ఆమెపై నిషేధం విధించారు. ఆమెకు కన్నడ సినిమాల్లో అవకాశం ఇవ్వకూడదని, కన్నడ నిర్మాతలు ఎవ్వరూ ఆమెతో సినిమాలు తీయకూడదని, అమె కన్నడ తెరపై కనిపించనే కూడదని అక్కడ నిర్మాతల మండలి ఒక బహిరంగ నిషేధాజ్ఞ జారీ చేసింది. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి? అంటే.. ఆ హీరోయిన్ పై ఒక హీరో భార్య బహిరంగంగా అసహనం వ్యక్తం చేసింది. సదరు హీరోయిన్ తన భర్తతో సన్నిహితంగా నడుచుకుంటోందని, తన భర్తకూ ఆమెకూ ఎఫైర్ ఉందంటూ ఆమె ఆరోపించింది. దీంతో నిర్మాతలకు కోపం వచ్చి ఆ హీరోయిన్ పై నిషేధం విధించారు!
ఆ హీరోయిన్ పేరు నిఖిత. కన్నడ స్టార్ హీరో దర్శన్ తో ఆమెకు ఎఫైర్ ఉందనే పుకార్లు వచ్చాయి. ఆ దశలో నిఖితపై నిషేధం విధించి కన్నడ చిత్ర పరిశ్రమ తన తీరును చాటుకుంది! మరి దర్శన్ భార్య ఆరోపణలు నిర్మాతలకు చాలా బాధ కలిగించినట్టు అయితే, నిఖిత పై నిషేధం విధిస్తే సరిపోతుందా? వారి మధ్యన ఎఫైరే ఉండి, అది పద్ధతి కాదు అనుకుంటే.. దర్శన్ పై కూడా నిషేధం వేయాలి! అతడు హీరో, మగాడు.. కాబట్టి అతడిపై చర్యలు తీసుకునేంత సీన్ లేదు! అదే హీరోయిన్ అయితే, అమ్మాయి, అది కూడా ఎక్కడి నుంచినో వచ్చింది నిషేధం కాదు, ఏదైనా చేయగలరు!
కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించి హీరోయిన్లపై ఆ తరహా దాడి అది మొదటిది, చివరిది కాకపోవచ్చు. ఆ తర్వాత కొన్నేళ్లకు వారికి రష్మికపై కోపం వచ్చింది. అది ఆమె తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నందుకు. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాకు సంబంధించిన వ్యక్తితో రష్మిక పెళ్లి చేసుకువాలానుకుంది. ఇద్దరి సమ్మతంతో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత రష్మికకు తెలుగులో వరస పెట్టి అవకాశాలు వచ్చాయి. ఇక్కడ స్టార్ అయ్యింది. కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ తో అవకాశాలు తలుపుతట్టాయి. మరి ఈ కారణాలతోనే రష్మిక తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలనుకున్నా, లేక మరే రీజన్ ఉన్నా.. అది పూర్తిగా ఆమె వ్యక్తిగతం!
ఈ రోజుల్లో సామాన్యుల్లోనే ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లి రద్దు చేసుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. సినిమా వాళ్లలోనూ అలాంటి జాబితా పెద్దదే. రష్మిక కూడా అదే పని చేసింది. అయితే సోషల్ మీడియాలో రష్మికను అప్పట్లో చాలా మంది తీవ్రంగా నిందించారు. రష్మికది అవకాశవాదం అని, డబ్బు కోసం అని.. ఇలా ఇష్టానుసారం రెచ్చిపోయారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి.. అన్నట్టుగా రెచ్చిపోయారంతా. వారికి రష్మికపై ఇప్పటికీ కోపం తగ్గలేదు.
కన్నడ చిత్రపరిశ్రమ ఆవల రష్మిక సంపాదించుకున్న కెరీర్ అంతా కన్నడీగులకు మంటగానే ఉంది! అందరికీ కాకపోవచ్చు. సోషల్ మీడియాలో జడ్జిమెంట్లు ఇచ్చే బ్యాచ్ కు రష్మిక అంటే తీవ్రమైన అసహనం ఉంది. కాంతార సినిమా సక్సెస్ కూ రష్మికకు ముడిపెడుతూ.. ఈ బ్యాచ్ పరమ పనికిమాలిన తీరున వ్యవహరించింది. కాంతార సినిమా సక్సెస్ రష్మికపై రీవేంజ్ అనేంత రీతిలో వీరు స్పందించారు! ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టుగా ఉంది ఈ బ్యాచ్ తీరు!
ఇక కాంతార సినిమాను ప్రశంసిస్తూ పూజా హెగ్డే ఏదో అందట. తనవీ కన్నడ మూలాలే అని, కాంతార తనకు నచ్చిందంటూ ఆమె చెప్పిందట! ఇదే పాపం అయిపోయింది. హెగ్డే అనే పేరు వింటేనే ఆమెవి కన్నడ మూలాలు అని ఎవరైనా అనుకుంటారు. అయితే పూజ కర్ణాటక నుంచి వచ్చిందా, బాంబేలో పెరిగిందా అనేది బయటి వాళ్లకు పట్టదు. ఇదే తరహాలో పూజా కూడా ఏదో తన కన్నడ మూలాల గురించి చెప్పింది. అయితే కాంతార హిట్ తోనే ఆమెకు కన్నడనాడు గుర్తుకొచ్చిందా.. అంటూ మరో బ్యాచ్ విరుచుకుపడింది!
అక్కడికేదో ఈ సోషల్ మీడియా జడ్జిమెంటల్ ఫ్రీక్సే కాంతార సినిమాను తీసినట్టుగా ఫీలవుతున్నారు! ఆ సినిమాపై ఎవరు మాట్లాడినా కుక్కల్లా విరుచుకుపడుతున్నారు! మీద పడి రక్కేలా ఉన్నారు! ఇదే ఊపులో రష్మికపైనా, పూజా మీద నిషేధం విధించేయాలని కూడా వీరు నిఖిత పై నిషేధం నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నారు! ఏదో సినిమా హిట్ అయితే… మరీ ఇలా తీవ్రవాదపు బ్యాచ్ లా తయారు కావాలా?