వారెవ్వా… విశాఖకు అమెజాన్

ఏపీకి పెట్టుబడుల వరద ప్రవహిస్తోంది. మరీ ముఖ్యంగా విశాఖకు దిగ్గజ సంస్థలు కదలి వస్తున్నాయి. ఐటీ కేరాఫ్ విశాఖ అన్నట్లుగా ఇప్పటికే ఒక రూపం సంతరించుకున్న స్మార్ట్ సిటీకి మరో పేరున్న విఖ్యాత సంస్థ…

ఏపీకి పెట్టుబడుల వరద ప్రవహిస్తోంది. మరీ ముఖ్యంగా విశాఖకు దిగ్గజ సంస్థలు కదలి వస్తున్నాయి. ఐటీ కేరాఫ్ విశాఖ అన్నట్లుగా ఇప్పటికే ఒక రూపం సంతరించుకున్న స్మార్ట్ సిటీకి మరో పేరున్న విఖ్యాత సంస్థ అమెజాన్ వస్తోంది. విశాఖలో అమెజాన్ సంస్థ డెవలప్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ని ఏర్పాటు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకోవడంతో అంతటా హర్షం వ్యక్తం అవుతోంది.

విశాఖలో అమెజాన్ కంపెనీ 184.12 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రాధమిక సమాచారం ద్వారా వెల్లడి అవుతోంది. ఇందుకోసం సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాకు అమెజాన్ దరఖాస్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అన్నీ అనుకూలించి అనుకున్నట్లుగా ముందుకు సాగితే కొత్త ఏడాది 2023లో విశాఖలో తన డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారభించడానికి అమెజాన్ పూర్తి సన్నద్ధతతో ఉన్నట్లుగా చెబుతున్నారు. 

ఇంఫోసిస్ వచ్చింది, మరో రెండు దిగ్గజ సంస్థలు వచ్చాయి. ఇపుడు అమెజాన్ వస్తుంది. ఆ బాటలో మరికొన్ని సంస్థలు కూడా విశాఖ బాట పట్టనున్నాయి. ఇది విశాఖ సహా ఏపీ అభివృద్ధికి శుభ పరిణామమని చెప్పవచ్చు.