చంద్ర‌బాబు చ‌క్రాన్ని రెండూ ప‌ట్టించుకోలేదే!

ఐదేళ్ల కింద‌ట కూడా దాదాపు ఇదే స‌మ‌యంలో ర‌చ్చ‌ర‌చ్చ చేశారు చంద్ర‌బాబు నాయుడు! అప్ప‌ట్లో కాంగ్రెస్ కూట‌మిలో చేరి చంద్ర‌బాబు నాయుడు ఇక త‌నే ప్ర‌ధాని అభ్య‌ర్థి అన్న‌ట్టుగా రెచ్చిపోయారు. మోడీపై విరుచుకుప‌డ్డారు. మోడీని…

ఐదేళ్ల కింద‌ట కూడా దాదాపు ఇదే స‌మ‌యంలో ర‌చ్చ‌ర‌చ్చ చేశారు చంద్ర‌బాబు నాయుడు! అప్ప‌ట్లో కాంగ్రెస్ కూట‌మిలో చేరి చంద్ర‌బాబు నాయుడు ఇక త‌నే ప్ర‌ధాని అభ్య‌ర్థి అన్న‌ట్టుగా రెచ్చిపోయారు. మోడీపై విరుచుకుప‌డ్డారు. మోడీని వ్య‌క్తిగ‌తంగా తిట్టారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే మోడీని చంద్ర‌బాబు నాయుడు తిట్టిన‌ట్టుగా రాహుల్ గాంధీనో, ఒవైసీలో కూడా అప్పుడు తిట్ట‌లేదు! ఇంకా చెప్పాలంటే అప్ప‌ట్లో మోడీపై చంద్ర‌బాబు చెల‌రేగిన‌ట్టుగా ఇప్ప‌టి వ‌ర‌కూ కూడా ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదు కూడా!

అంత‌టితో ఆగారా అదీ లేదు.  ఈవీఎంల‌ను నిందించారు. ఈవీఎంల‌పై ఎన్నిక‌లొద్ద‌న్నారు. ఏదో ఒక‌టి చేస్తూ రోజూ వార్త‌ల్లో నిలిచారు చంద్ర‌బాబు. కాంగ్రెస్ వైపున్న కూట‌మి నేత‌లంద‌రినీ వెంటేసుకుని త‌నే పీఎం క్యాండిడేట్ అన్న‌ట్టుగా చంద్ర‌బాబు క‌ల‌రింగ్ ఇచ్చుకున్నారు. క‌ట్ చేస్తే కుప్పంలో చంద్ర‌బాబు మెజారిటీ స‌గం పోయింది. టీడీపీ 23 సీట్ల‌కు ప‌రిమితం అయ్యింది. ఐదేళ్లు గ‌డుస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు ఆయా కూట‌ములు రెడీ అవుతున్నాయి.

ఢిల్లీలో ఎన్డీయే స‌మావేశం, బెంగ‌ళూరులో కాంగ్రెస్ నాయ‌క‌త్వంలో ప్ర‌తిప‌క్ష పార్టీల స‌మావేశం. మ‌రి ఐదేళ్ల‌క అంత ర‌చ్చ చేసి, దేశంలో ప్ర‌ధానిగా ఎవ‌రుండాలి, రాష్ట్ర‌ప‌తిగా ఎవరుండాలో త‌నే ఫోన్ల‌లో డిసైడ్ చేసిన‌ట్టుగా చెప్పుకునే .. ఇప్ప‌టికే రోజూ అదే చెప్పే చంద్ర‌బాబు నాయుడు ఇరు కూట‌ములూ ఇప్పుడు ప‌ట్టించుకోవ‌డం లేదు!

అటు ఎన్డీయే స‌మావేశానికీ చంద్ర‌బాబుకు ఆహ్వానం అంద‌లేదు. ఇటు కాంగ్రెస్ కూట‌మి కూడా ఈయ‌న‌ను ఖాత‌రు చేయ‌లేదు. గ‌తంలో ప్ర‌ధానుల‌కు పాల‌న ఎలా చేయాలో కూడా త‌నే చెప్పిన‌ట్టుగా అరిగిపోయిన కేసెట్ ను చంద్ర‌బాబు నాయుడు వేస్తూనే ఉంటారు. అంతా త‌నే చ‌క్రం తిప్పిన‌ట్టుగా పాత విష‌యాల‌న్నింటినీ గురించీ కూడా నోటికొచ్చిన‌ట్టుగా చెబుతూ ఉంటారు. మ‌రి వర్త‌మానంలో మాత్రం.. చంద్ర‌బాబు చ‌క్రం వంక‌ర్లే పోయిన‌ట్టుగా.. ఎవ‌రికీ ప‌ట్ట‌నిది అయ్యింది.