దేశంలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా వంటి రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కూడా ముగింపు దశకు వచ్చింది. ఈ ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలు ఎడాపెడా ఖర్చులు పెట్టాయి. ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చుతో పోలిస్తే.. ఓట్ల కోసం పార్టీలు పెట్టే ఖర్చులు ఆకాశమంత ఎత్తుకు చేరాయి. బరిలో నిలిచే అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టాలనే అంశం గురించి ఎన్నికల కమిషన్ వద్ద సవాలక్ష మార్గదర్శకాలున్నాయి. అయితే అవన్నీ ఉత్తుత్తివే!
ఎన్నికల కమిషన్ నిబంధనలకు అభ్యర్థులు తిలోదకాలు ఇవ్వడం కొత్తేం కాదు. ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులే తక్కువలో తక్కువ 40 కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెట్టారనేది ఒక అంచనా. వీరికి ఉన్న పరిమితి 40 లక్షలు అయితే, పెడుతున్న ఖర్చులు అందుకు వంద రెట్లుగా కనిపిస్తున్నాయి!
దేశంలో పొలిటికల్ ట్రెండ్స్ ను బట్టి.. లోక్ సభ ఎన్నికల కన్నా, అసెంబ్లీ ఎన్నికల విషయంలో పార్టీలు ఎక్కువ ఖర్చు పెడతాయి. అసెంబ్లీ ఎన్నికలకే ఓటుకు నోటు ఇచ్చే సంప్రదాయం ఎక్కువగా ఉంది. అలాగని లోక్ సభ ఎన్నికల విషయంలో ఖర్చు పెట్టవని కాదు, ఎంతో కొంత ఖర్చు తప్పదు! తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో లోక్ సభ సీటు అభ్యర్థి కనీసం 70 కోట్ల వరకూ ఖర్చు పెడతారనేది ఉన్న అంచనా! అది కేవలం ఆ అభ్యర్థి ఖర్చు. మళ్లీ అతడి కోసం పార్టీ పెట్టే ఖర్చు వేరే, పార్టీల యాడ్స్ వేరే, సోషల్ మీడియా ఖర్చులు, ఇంకా అనేక ఖర్చులు వేరే!
గూగుల్ యాడ్స్ మీదే పొలిటికల్ ఒక్కో పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందనే కథనాలు వచ్చాయి ఎన్నికల ప్రక్రియ ఆరంభంలోనే! ఇలాంటి నేపథ్యంలో.. దేశంలో లోక్ సభ ఎన్నికల ఖర్చు గురించి స్టడీ చేసిన ఒక సంస్థ ఈ ఖర్చు అక్షరాలా లక్ష కోట్ల రూపాయల పైనే అని అంటోంది! ఇంకా చెప్పాలంటే.. పార్టీలన్నీ కలిపి, అభ్యర్థులంతా కలిసి సుమారు లక్షా ముప్పై వేల కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెట్టి ఉంటారనేది అంచనా!
ఎన్నికల తతంగానికి ఇలా రాజకీయ పార్టీలు నిధులు ఖర్చు పెట్టాయనే అంచనాలు విస్మయాన్ని కలిగించే విధంగానే ఉన్నాయి! ఏ అభ్యర్థి లేదా సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు తమ ఆస్తులన్నీ ఇలా ఒక్క ఎన్నిక విషయంలోనే ఖర్చు పెట్టి ఉండరు! వారికి ఉన్న దాంట్లో ఏ పది శాతాన్ని ఖర్చు పెట్టడమే గగనం! అది కూడా ఎన్నికల వేళ ఖర్చు పెట్టిందానికి అనేక రెట్లు రాబట్టు కోవాలనే టార్గెట్ కూడా ఉంటుంది! మరి అభ్యర్థుల ఎన్నికల ఖర్చే జస్ట్ లక్ష కోట్ల రూపాయలపైనే అంటే, దేశంలో రాజకీయ నేతలతో ముడిపడిన సంపద స్థాయి ఊహించడం కూడా కష్టమే!