పచ్చదళం, పోలీసు ఏకమైనా ఫలితం దక్కలేదు!

పచ్చదళాలు, పోలీసులు ఒక్కటైపోయారు. విషం చిమ్మడానికి ప్రయత్నించారు. న్యాయస్థానాన్ని ప్రభావితం చేయడానికి తమ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. వారెన్ని విషపు ప్రయత్నాలు చేసినప్పటికీ.. అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. న్యాయమూర్తిని తమ మాటలగారడీతో ఇన్‌ఫ్లుయెన్స్…

పచ్చదళాలు, పోలీసులు ఒక్కటైపోయారు. విషం చిమ్మడానికి ప్రయత్నించారు. న్యాయస్థానాన్ని ప్రభావితం చేయడానికి తమ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. వారెన్ని విషపు ప్రయత్నాలు చేసినప్పటికీ.. అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. న్యాయమూర్తిని తమ మాటలగారడీతో ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేకపోయారు.

పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డికి బెయిలు దక్కకుండా చేయడానికి, ఆయనను అరెస్టు చేయడానికి అడ్డుపడేలా ఎలాంటి ఉత్తర్వులు రాకుండా ఉండడానికి వారంతా కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. వారు సఫలం కాలేకపోయారు. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. మాచర్ల ఎపిసోడ్లకు సంబంధించి ఏ కేసుల్లో కూడా కూడా 6వ తేదీ వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవడానికి వీల్లేదని ఆదేశించింది.

ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిపై 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. అయితే సీఐ మీద దాడిచేసిన దానికి సంబంధించి నమోదైన హత్యాయత్నం కేసు, మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఇతర ఘర్షణలకు సంబంధించిన కేసుల్లో పిన్నెల్లిని అరెస్టు చేయడం లేదంటూ.. కొన్ని రోజులుగా పచ్చదళాలు మొత్తం హోరెత్తించేస్తున్నాయి.

సీఐ మీద హత్యాయత్నం చేసిన కేసు ఉంటే కూడా పోలీసులు అరెస్టు చేయరా అంటూ.. పదేపదే పోలీసుల్ని రెచ్చగొట్టడానికి పచ్చదళాలు ఎంత కష్టపడుతూ వచ్చాయో చెప్పలేం. దానికి తగ్గట్టుగానే.. పోలీసుల తరఫున పీపీ నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ ఓట్ల లెక్కింపు రోజున పిన్నెల్లి అసలు కౌంటింగ్ కేంద్రాల వద్దకు రాకుండానే చూడాలన్నట్టుగా వాదనలు వినిపించారు. ఆయన వస్తే నేరఘటనలను పునరావృతం చేస్తారని అన్నారు. కోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారని బెయిలు ఇవ్వవద్దని ఆయన అన్నారు.

ఇక తెలుగుదేశం వారి సంగతి సరేసరి. అసలు బెయిలు ఇవ్వొద్దంటూ పిటిషన్ వేసిన నంబూరి శేషగిరిరావు, చెరుకూరి నాగశిరోమణి తరఫు న్యాయవాది కూడా పిన్నెల్లిని కౌంటింగ్ కేంద్రానికి రానివ్వకుండా ఆదేశాలు రావాలని కోరుకున్నారు. పచ్చదళాలు, పోలీసు దళాలు కలిసి కుమ్మక్కు అయి వాదనలు వినిపిస్తున్నారా? అనే అనుమానం కలిగేలాగా.. వారు ఏకపక్షంగా వాదనలు వినిపించారు గానీ.. న్యాయమూర్తి ప్రభావితం కాలేదు.

పిన్నెల్లికి ఊరట లభించింది. ఆయన మీద జూన్ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదని ఆదేశించింది.