
ఎల్లుండి ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. సరిగ్గా ఇదే సమయంలో అవినాష్ రెడ్డి అరెస్టు కాబోతున్నట్టుగా గట్టి ప్రచారం! సాధారణంగా ఏదైనా కేసులో ఎవరినైనా అరెస్టు చేయడానికి సీబీఐ ఎంత సమయం తీసుకోవచ్చు? ఇప్పటికి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి దాదాపు నాలుగేళ్లు అవుతోంది! సీబీఐ రంగంలోకి దిగి కూడా చాలా నెలలు గడిచాయి. నిన్న కూడా సీబీఐ కోర్టు ఈ కేసు విచారణను వేగవంతం చేయాలంటూ సీబీఐని ఆదేశించింది! అయితే ఈ కేసు రాజకీయమయం అయ్యిందా? అవినాష్ రెడ్డి గురించి లీకులు, అరెస్టు ఊహాగానాలు, ఈ కేసు విచారణ హడావుడి.. ఇదంతా కేవలం ఎన్నికలు, పోలింగ్ లు ఉన్నప్పుడే బజ్ క్రియేట్ అవుతుందా? అనే సందేహాలు ఇప్పుడు జనిస్తున్నాయి!
ఏపీలో సోమవారం నాడు గ్రాడ్యుయేట్, టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అవినాష్ అరెస్టు లీకులు, ఊహాగానాలు.. స్థూలంగా ఈ బజ్ అంతా ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేందుకు ఇలాంటి రాజకీయం సాగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
దేశంలో ఒక కేసు అని కాదు.. సీబీఐ రంగంలోకి దిగిదంటే ఆ కేసులు రాజకీయం అయినట్టే అనే అభిప్రాయాలు సర్వత్రా ఉన్నాయి. సీబీఐని పంజరంలో చిలకగా అభివర్ణించింది సర్వోన్నత న్యాయస్థానం ఎప్పుడో! ఇలాంటి నేపథ్యంలో వివేకానందరెడ్డి హత్య కేసు కూడా సీబీఐ చేతికి వెళ్లాకా విచారణ వేగవంతం కావడం కంటే రాజకీయహడావుడి ఎక్కువయ్యిందనడంలో పెద్ద వింత లేదు!
అది కూడా ఈ కేసుల్లో విచారణకు హాజరైన వారు ఏం చెప్పారో.. అంటూ పచ్చమీడియా చేస్తున్న హడావుడి బోలెడన్ని అనుమానాలకు తావు ఇవ్వదా? సీబీఐ విచారణలో ఏం జరుగుతోందో నిత్యం పచ్చమీడియాకు ఎలా తెలుస్తుంది? విచారణకు హాజరైన వారు ఏం చెబుతున్నారో పచ్చమీడియాకు ఎలా రాస్తుంది? అంటే సీబీఐ విచారణ గురించి మీడియా తనకు ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చా! సాక్షులుగా, నిందితులుగా హాజరైన వారు చెప్పింది చెప్పినట్టుగా మీడియా రాస్తోందా? వివేక హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన కొందరు తాము సీబీఐ ముందు చెప్పని విషయాలను, తనకు తోచినట్టుగా పచ్చమీడియా రాసిందని వాపోయారు! అయితే వారిది అరణ్య రోదనే అయ్యింది! మరి ఇంతకీ విచారణ జరుపుతున్నది సీబీఐనా లేక పచ్చమీడియానా అనే ఆశ్చర్యం సామాన్యుల్లో కలగడం వింత కాదు!
స్థూలంగా సోమవారం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలోనే ఈ హడావుడి అంతా అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సోమవారం పోలింగ్ పూర్తయితే ఆ తర్వాత మళ్లీ హడావుడి తగ్గుముఖం పడుతుంది. మళ్లీ రాజకీయంగా అవసరం ఏర్పడినప్పుడు మళ్లీ హడావుడి మొదలవుతుంది. వైఎస్ భాస్కర్ రెడ్డిని అయితే ఈ కేసులో ఏడాది తర్వాత విచారణకు పిలుస్తున్నారు! ఎన్నికల హడావుడి నేపథ్యంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నట్టు ముమ్మర ప్రచారం!
వివేకానందరెడ్డి హత్య కేసులో పక్కాగా జరుగుతున్న రాజకీయం ఇది అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు! మరి ఈ రాజకీయంతో ఎవరికి ప్రయోజనం? వివేక హత్యను రాజకీయంగా వాడుకుంటున్నది ఎవరు? సరిగ్గా ఎన్నికలు, ఏదైనా రాజకీయ హడావుడి ఉన్నప్పుడే ఇలాంటి బజ్ ఎందుకు? అంటే ఈ కేసు విచారణ 2024 ఎన్నికల సమయం వరకూ అంటే ఇంకో ఏడాది వరకూ ఈ తరహాలోనే సాగబోతోందా! విశ్లేషణకు వ్యక్తం చేస్తున్న సందేహాలివి!