సాధారణంగా పెద్ద రాజకీయ పార్టీలకు (ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా) విరాళాల కొరత ఉండదు. ఏదో ఒక రూపంలో విరాళాలు వస్తుంటాయి. అధికార పార్టీలే కాకుండా, ప్రతిపక్ష పార్టీల్లోనూ ధనిక పార్టీలు ఉంటాయి. ఈ పార్టీలు వివిధ మార్గాల ద్వారా విరాళాలు సమకూర్చుకుంటాయి. బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు విరాళాలు ఇస్తుంటారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు డబ్బు కొరత ఉండదు.
కానీ ప్రస్తుతం ఏపీలో డబ్బు సమస్యతో ఇబ్బంది పడే పార్టీ ఏదైనా ఉందీ అంటే జనసేన మాత్రమే. తమ వద్ద డబ్బు లేదనే సంగతిని పార్టీ అధినేత పవన్ కళ్యాణే చాలాసార్లు చెప్పారు. అది వాస్తవం కూడా. పార్టీకి డబ్బు లేనందువల్లనే తాను సినిమాల్లో నటిస్తూ పార్టీని నడుపుకొస్తున్నానని అన్నారు. తాను పనిగట్టుకొని రెండు పడవల్లో ప్రయాణం చేయడం లేదన్నారు.
పవన్ డబ్బు కోసం సినిమాల్లో నటిస్తున్న కారణంగానే పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అన్ని పార్టీల్లోని నాయకులకు వ్యాపారాలు, పరిశ్రమలు ఉన్నాయని, కానీ పార్టీని నడపాలంటే తనకు సినిమాల్లో నటించడం తప్ప మరో మార్గం లేదన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే సినిమాలు కూడా చేస్తున్నారు.
పవన్ చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి అయ్యేసరికే ఎన్నికలు వస్తాయి. 2024 ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే ఉంది. పవన్ చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి చేయడమే కష్టమని అంటున్నారు. జనవరి నుంచి ఆయన రాజకీయ యాత్ర కూడా చేయాలనుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ దశలో ఉంది. హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ స్క్రీప్టుతో రెడీగా ఉన్నారు. ఇక వినోదయ సీతమ్ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. సైలెంట్‌గా లాంచింగ్‌ను జరుపుకున్న ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. ఇలా డబ్బు కోసం సినిమాలు చేస్తుండటంతో పవన్ చాలా ఒత్తిడికి గురవవుతున్నారని జనసేన నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు కోటి రూపాయల అందింది. ఎలా అంటారా? పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు న ఆయన నటించిన ‘జల్సా’ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పలు ధియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఈ చిత్ర ప్రదర్శన ద్వారా జనసేన పార్టీ కార్యకర్తలు రూ. కోటి విరాళాన్నిసేకరించారు. ఈ డబ్బును వారు పీఏసీ సభ్యుడు నాగబాబు చేతుల మీదుగా పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. “నా సేన కోసం నా వంతు” అనే కార్యక్రమానికి జన సైనికుల నుంచి మంచి స్పందన వచ్చింది. పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు రూ. కోటి విరాళం సేకరించి అభిమానం చాటుకున్నారు. 2008లో విడుదలైన ఈ సినిమాని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమా ప్రింట్ ను అప్డేట్ చేసి రిలీజ్ చేస్తే.. ఈ రేంజ్లో రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జల్సా చిత్రంలో ఇలియానా డిక్రూజ్ హీరోయిన్. కమలినీ ముఖర్జీ, పార్వతి మెల్టన్, ప్రకాష్ రాజ్, ముఖేష్ రిషి, శివాజీ ముఖ్య పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. జల్సా సినిమా మళ్ళీ రిలీజ్ చేసి పార్టీకి కోటి రూపాయల విరాళం అందించారు కాబట్టి విరాళాల సేకరణకు ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు. పవన్ గతంలో నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమాలను మళ్ళీ రిలీజ్ చేస్తే డబ్బులు బాగానే రాలుతాయి. ఈ మధ్య కాలంలో పాత సినిమాలను మళ్ళీ విడుదల చేయడం ఓ ట్రెండ్ గా మారింది కూడా!.