ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంటే ఒక బ్రాండ్. ఇపుడు ఆయనకు మరో ట్యాగ్ లైన్ వచ్చి చేరింది. బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ కి మామ గారుగా ఆయన పేరు మారుమోగుతోంది. ఈ దిగ్గజం విశాఖకు రావడం అన్నది ఒక అరుదైన ఘటన.
అయితే ఆయన ఒక రోజు అంతా విశాఖలోనే గడపడం మరో ముచ్చట. అది ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా యూనివర్శిటీ వల్ల సాధ్యపడుతోంది. ఏయూ పూర్వ విద్యార్ధుల సమ్మేళనాన్ని డిసెంబర్ 17న ఘనంగా నిర్వహిస్తోంది. దానికి చీఫ్ గెస్ట్ గా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హాజరవుతున్నారు.
ఆయన ఆ రోజు ఏయూలో మార్నింగ్ నుంచి సెషన్స్ లో పాల్గొంటూ ఈవెనింగ్ జరిగే మీటింగ్ కి అటెండ్ అవుతారు. ఈ సందర్భంగా ఏయూలో జరిగే పలు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హాజరుకావడం అంటే అది తమకు గొప్ప అవకాశంగా ఏయూ వీసీ ప్రసాదరెడ్డి చెబుతున్నారు.
ఆయనకు తాము ఆతీధ్యం ఇవ్వడం ఒక మధురమైన ఘటన అంటున్నారు. ఏయూ మరింతగా అభివృద్ధి సాధించేందుకు ఆయన విలువైన సలహా సూచనలు అందిస్తారు అని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో ఈ మధ్యనే ఇన్ఫోసిస్ సంస్థ వచ్చింది.
ఐటీ సిటీగా విశాఖ కొత్తగా ఫోకస్ అవుతున్న నేపధ్యంలో దిగ్గజం లాటి నారాయణమూర్తి విశాఖకు అతిధిగా రావడం అంటే ఆసక్తి పెరుగుతోంది. ఆయన విశాఖ గురించి ఏమి చెబుతారు, ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధికి ఏ రకమైన సూచనలు చేస్తారు అన్నది కూడా అంతా చర్చిస్తున్న విషయం.